Begin typing your search above and press return to search.

ఆదాలకు ఆదిలోనే ఝలక్...?

By:  Tupaki Desk   |   7 Feb 2023 9:26 AM GMT
ఆదాలకు ఆదిలోనే ఝలక్...?
X
నెల్లూరు అంటే వైసీపీకి పెట్టని కోట. అక్కడ 2019లో టోటల్ సీట్లు గెలిచి స్వీప్ చేసి పారేసింది. అలాంటి జిల్లాలో ఇపుడు రెబెల్స్ డేంజర్ బెల్స్ మోగించేస్తున్నారు. ఒక ఆనం రామనారాయణరెడ్డి మరో కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి చేసిన సింహగర్జనకు నెల్లూరు వైసీపీ కోటకు బీటలు వారుతున్నాయి. ఇక వారు పోతే మాకేంటి ఇంకా బలమైన వారు ఉన్నారు అనుకుంటూ వైసీపీ చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకు సక్సెస్ అవుతున్నాయన్నదే చర్చగా ఉంది.

వెంకటరిగిత్లో ఆనం ప్లేస్ లో వచ్చిన నేదురుమల్లి రాం కుమార్ రెడ్డి అక్కడ గట్టిగా ఫ్యాన్ రెక్కలను తిప్పగలరా అన్న డౌట్లు ఉండనే ఉన్నాయి. ఇక ఆయన పరిస్థితి అలా ఉండగానే నెల్లూరు రూరల్ లో కోటం రెడ్డి కోటలో వైసీపీ జెండా ఎగరడం ఖాయమని భావిస్తూ అతి ధీమా మీద ఉన్న వైసీపీ అధినాయకత్వం నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకరరెడ్డిని దించింది. ఆయన్ని తెచ్చి ఇంచార్జిగా నియమించింది.

జగన్ ఆయన్ని స్వయంగా పిలిపించుకుని మరీ నెల్లూరు రూరల్ బాధ్యతలు అప్పగించారు. అంగబలం అర్ధంబలం పుష్కలంగా ఉన్న ఆదాల అయితేనే కోటం రెడ్డికి కరెక్ట్ అని భావించే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక ఆదాలకు నెల్లూరు రూరల్ జిల్లాలో మంచి పరిచయాలు ఉన్నాయి. దాంతో ఆయన ధీటైన అభ్యర్థిగా మరోసారి అక్కడ వైసీపీని గెలిపించుకుని వస్తారని అనుకున్నారు.

ఈ రోజు ఆదాల నెల్లూరు రూరల్ జిల్లా టూర్ కి వచ్చారు. ఆయనకు బాధ్యతలు అప్పగించాక ఘనస్వాగతం పలుకుతూ పార్టీ శ్రేణులు ఆయన్ని తీసుకువచ్చాయి. అయితే ఆదాలకు నాయకుల నుంచి మంచి స్వాగతం లభించినా ద్వితీయ శ్రేణి నాయకులు పెద్దగా స్పందించలేదని అంటున్నారు. నెల్లూరు కార్పోరేషన్ వైసీపీ చేతుల్లోనే ఉంది. కానీ కార్పొరేటర్లు కొందరు తప్ప ఎక్కువ మంది ఆదాలతో ర్యాలీలో పాలుపంచుకోలేదని అంటున్నారు.

ఆదాలతో పాటు జిల్లా మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి బీద మస్తాన్ రావు, ఎమ్మెల్యేలు అనిల్ కుమార్ యాదవ్, మేకపాటి విక్రం రెడ్డి వంటి వారు ఉన్నారు. అయితే ఆదాల నివాసం దాకా వచ్చిన ఈ ర్యాలీలో స్థానిక ప్రజలు తక్కువగానే పాల్గొన్నారు అని అంటున్నారు. అలాగే కార్పోరేటర్లు కూడా పెద్దగా కనిపించకపోవడం, ద్వితీయ శ్రేణి నేతలు కూడా అనుసరించకపోవడం చర్చనీయాంశం అయింది.

ఇదిలా ఉంటే నెల్లూరు సిటీలో ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ కి ఆయన సొంత బాబాయ్ అయిన రూప్ కుమార్ యాదవ్ కి గొడవలు ఉన్నాయి. దాంతో కార్పోరేటర్లు రెండు వర్గాలు అయ్యారు. దాంతో వారు వీరూ కూడా పాల్గొనకుండా డుమ్మా కొట్టారని అంటున్నారు. ఇక ఆదాల అనుచరులు మాత్రం పెద్ద ఎత్తున హాజరయ్యారు.

ఇవన్నీ పక్కన పెడితే ఆదాల నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని పూర్తిగా తన ఆధీనంలో తెచ్చుకుని మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం ఉందని అంటున్నారు. అటు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి జనం మనిషిగా ముద్రపడ్డారు అని ఆయనకు ధీటుగా నిలబడి గెలవాలీ అంతే ఆదాల బాగా శ్రమించాల్సి ఉంటుందని ఈ ర్యాలీ జస్ట్ శాంపిల్ గా చూపించిందని అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.