Begin typing your search above and press return to search.

క్వారంటైన్‌ కు అటెండర్‌..ఆందోళనలో మంత్రులు - కలెక్టర్‌

By:  Tupaki Desk   |   5 April 2020 10:34 AM GMT
క్వారంటైన్‌ కు అటెండర్‌..ఆందోళనలో మంత్రులు - కలెక్టర్‌
X
ఆంధ్రప్రదేశ్‌ లో కరోనా వైరస్‌ కేసులు అత్యధికంగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోనే అధికంగా ఉన్నాయి. ఈ జిల్లాలో కరోనా వైరస్‌ తీవ్రంగా వ్యాప్తిస్తుండడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. తబ్లిగీ జమాత్‌ కి వెళ్లొచ్చిన వారిలో సాధారణ ప్రజలతో పాటు కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నారు. వారు ఢిల్లీ పర్యటన ముగించుకుని ఆంధ్రప్రదేశ్‌ లోని తమ సొంత ప్రాంతాలకు వచ్చారు. ప్రభుత్వ ఉద్యోగులు నిర్వర్తిస్తున్న వారు కూడా ఉన్నారు. అయితే వారు విధులకు వెళ్తుండడంతో ప్రభుత్వ ఉద్యోగుల్లోనూ కలవరం మొదలైంది. ఈ క్రమంలో ఏకంగా కలెక్టర్‌ కార్యాలయంలో విధులు నిర్వహించే ఉద్యోగి కూడా ఉన్నాడని తాజాగా గుర్తించారు. అయితే ఆ ఉద్యోగి అటెండర్‌ గా భావిస్తున్నారు. తాజాగా అతడికి కరోనా లక్షణాలు బయటపడడంతో అధికార యంత్రాంగంతో పాటు మంత్రులు - ఎమ్మెల్యేలు ఆందోళన చెందుతున్నారు.

ఢిల్లీలో తబ్లిగీ సమావేశంలో పాల్గొని తిరిగివచ్చిన ఓ కలెక్టరేట్ ఉద్యోగి యథావిధిగా నెల్లూరులోని కలెక్టర్‌ కార్యాలయంలో విధులకు హాజరయ్యాడు. రోజు మాదిరిగా కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నాడు. ఇటీవల కార్యాలయంలో కలెక్టర్‌ తోపాటు మంత్రులు అనిల్‌ కుమార్‌ యాదవ్‌ - మేకపాటి గౌతమ్‌ రెడ్డి - ఎమ్మెల్యేలు - జిల్లా స్థాయి అధికారులు హాజరయ్యారు. కరోనా కట్టడిపై సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ కూడా నిర్వహించారు. అయితే ఆ సమావేశాల్లో అటెండర్‌గా ఉన్న ఆ వ్యక్తి అందరికీ తాగునీళ్లు - చాయ్‌ కాఫీ - తినుబండారాలు అందించారు. సమావేశానికి ఏర్పాట్లు చేశాడు. అన్ని పనులూ ఆ అటెండర్‌ చేశాడు. అయితే ఈ విషయం అతడికి కరోనా లక్షణాలు రావడంతో బయటపడింది. దీంతో సహోద్యోగులు భయాందోళన చెంది వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చారు.

షాక్‌కు గురైన కలెక్టర్ వెంటనే అతడిని నెల్లూరులోని జిల్లా ప్రధానాస్పత్రిలోని క్వారంటైన్‌ కు తరలించారు. అతడి విషయం వెలుగులోకి రావడంతో అతడితో సన్నిహితంగా ఉన్న ఉన్నతాధికారులు భయాందోళన చెందుతున్నారు. మంత్రులు అనిల్ కుమార్ యాదవ్ - మేకపాటి గౌతమ్ రెడ్డి - ఎమ్మెల్యేలు కూడా ఒకింత ఆందోళన పడుతున్నారు. అతడికి కరోనా సోకితే వెంటనే కలెక్టర్‌ కార్యాలయం ఉద్యోగులంతా క్వారంటైన్‌ కు వెళ్లాల్సిందే. అందుకే ఆ అటెండర్‌ తో క్లోజ్‌ గా ఉన్న వారిని అనుమానితులుగా గుర్తిస్తున్నారు. ఒకవేళ అతడికి కరోనా సోకి ఉంటే అతడి ద్వారా ప్రభుత్వ అధికారులకు ఎంతమందికి సోకి ఉంటుందేమోనని చర్చ సాగుతోంది.