Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ కి మరో షాక్..ఆనంద్ భవన్ కు 4.35 కోట్ల ఫైన్ !

By:  Tupaki Desk   |   20 Nov 2019 8:55 AM GMT
కాంగ్రెస్ కి మరో షాక్..ఆనంద్ భవన్ కు 4.35 కోట్ల ఫైన్ !
X
గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీకి షాక్‌ ల మీద షాక్‌ లు తగులుతున్నాయి. ఇప్పటికే గత రెండు ధపాలుగా అధికారానికి దూరమై ఏంచేయాలో దిక్కుతోచని స్థితిలో ఉంది. తాజాగా మరో షాక్ తగిలింది. మాజీ ప్రధాని దివంగత ఇందిరాగాంధీ పుట్టిన ప్రయాగ్‌ రాజ్‌ లోని చారిత్రక ఆనంద్ భవన్‌ కు ప్రయాగ్‌ రాజ్ మున్సిపల్ కార్పొరేషన్ రూ.4.35 కోట్ల పన్ను నోటీసు పంపింది. ఈ భవనాన్ని ఇందిరాగాంధీ తాతగారైన మోతీలాల్ నెహ్రూ కొనుగోలు చేశారు. గాంధీ కుటుంబానికి చెందిన ఈ ఇంటిని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ నేతృత్వంలో జవహర్‌ లాల్ నెహ్రూ మెమోరియల్ ట్రస్టు (జేఎంఎంటీ) నడుపుతోంది.

కాగా, మున్సిపల్ కార్పొరేషన్ చట్టం - ఆస్తి పన్ను నిబంధనల కింద రెండు వారాల క్రితమే తాము పన్ను నోటీసు ఇచ్చినట్టు చీఫ్ టాక్స్ అసెస్‌ మెంట్ అధికారి పీకే మిశ్రా తెలిపారు. నాన్-రెసిడెన్షియల్ కేటగిరి కింద టాక్స్ వేశామని - ఆనంద్ భవన్ కి 2003 నుంచి పన్ను చెల్లించడం లేదని తెలిపారు. పన్ను మొత్తాన్ని నిర్ణయించేందుకు తాము సర్వే కూడా నిర్వహించామని - ఏవైనా అభ్యంతరాలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని తాము కోరినప్పటికీ ఇంతవరకు ఎవరూ ముందుకు రాలేదని తెలిపారు.

కాగా, వారసత్వ భవంతులైనందున ఆనంద్ భవన్ - దానికి ఆనుకుని ఉన్న కాంప్లెక్స్‌ లపై విధించిన పన్నును సమీక్షించాలని జేఎన్ ఎంటీ నుంచి తమకు నోటీసు అందినట్టు ప్రయాగ్‌ రాజ్ మేయర్ అభిలాషా గుప్తా నంది తెలిపారు. సంబంధిత ఫైళ్లను - డాక్యుమెంట్లను అధ్యయనం చేసి తదుపరి చర్యలు తీసుకుంటామని మేయర్ తెలిపారు. ఆనంద్ భవన్‌ కు పన్ను వేయడంపై మాజీ మేయర్ చౌదరి జితేంద్ర నాథ్ సింగ్ మాట్లాడుతూ - తనకు తెలిసినంత వరకూ అన్ని రకాల పన్నుల నుంచి జేఎన్ ఎంటీకి మినహాయింపు ఉందని చెప్పారు.