ఉమేశ్ యాదవ్ రేంజ్ ఏంటి? ఆ రేటు ఏమిటి? ఐపీఎల్ వేలంపై నెహ్రా ఫైర్..!

Tue Feb 23 2021 18:00:01 GMT+0530 (IST)

Nehra Emotional About Umesh Yadav

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 మినీ వేలంపై  భారతజట్టు మాజీ ఫేసర్ ఆశిష్ నెహ్రా తీవ్రంగా మండిపడ్డారు. వేలం జరిగిన తీరు తననెంతో ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు. ఎంతో అనుభవం ఉన్న ఉమేశ్ యాదవ్‌కు చాలా తక్కువ ధరకే అమ్ముడుపోయాడని పేర్కొన్నారు. ఏ మాత్రం అనుభవం లేని వాళ్లకు ఇంకా నేర్చుకొనే దశలోనే ఉన్న క్రీడాకారులకు మాత్రం ఎక్కువ రేటు పెట్టారని ఆయన అన్నారు. తాజాగా స్టార్స్ స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు నెహ్రా అంశాలను పంచుకున్నారు..‘ఐపీఎల్ మినీ వేలం నన్ను ఎంతో ఆశ్చర్యానికి గురిచేసింది. టాప్ బౌలర్ ఉమేశ్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ కేవలం రూ. కోటి వెచ్చించి కొనుగోలు చేసింది. అతడిపై మిగతా ఏ ప్రాంఛైజీ కూడా ఆసక్తి చూపకపోవడం నన్ను ఎంతో ఆశ్చర్యానికి గురిచేసింది. జై రిచర్డ్‌సన్ కైల్ జేమిసన్ కు ఏం అనుభవం ఉంది. ఉమేశ్‌తో పొల్చినప్పుడు వాళ్ల ఎక్స్పీరియన్స్ ఆటతీరు చాలా తక్కువస్థాయిలో ఉంటుంది. అటువంటిది వాళ్లు వేలంలో ఎక్కువ ధరకు ఎలా అమ్ముడుపోయారో అర్థం కావడం లేదు. పేరులేని బౌలర్లకు అంత పెట్టినప్పుడు ఉమేశ్‌కు అంత తక్కువ పెట్టడం నిజంగా షాక్‌కు గురిచేసింది.

మిచెల్ స్టార్క్ లసిత్ మలింగ లాంటి బౌలర్లు భారీ ధరకి అమ్ముడుపోయారంటే అర్థం ఉంది. వాళ్లు ఇప్పటికే సత్తా చాటుకున్నారు’ అని నెహ్రా పేర్కొన్నారు. ఉమేశ్ తక్కువ ధరకు అమ్ముడు పోవడాన్ని మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ సైతం తప్పు పట్టారు.  దక్షిణాఫ్రికాకు చెందిన క్రిస్ మోరిస్ రూ.16.25 కోట్లకు  అమ్ముడుపోగా.. న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ కైల్ జేమిసన్ ను  ఆర్‌సీబీ రూ.15 కోట్లకు కొనుగోలు చేసింది. ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ జై రిచర్డ్‌సన్‌కు రూ.14 కోట్లు వెచ్చించి పంజాబ్ కింగ్స్ దక్కించుకుంది. రూ.కోటితో ఉమేశ్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది. ఉమేష్ భారత్ తరఫున 48 టెస్టులు 75 వన్డేలు 7 టీ20లు ఆడాడు. ఇక 121 ఐపీఎల్ మ్యాచులు ఆడాడు.