రాహుల్‌ను కలుస్తా.. అయితే రాజకీయాలకు దూరమే: కాంగ్రెస్ సీనియర్ నేత హాట్ కామెంట్స్!

Fri Oct 07 2022 23:00:02 GMT+0530 (India Standard Time)

Neelakantapuram Raghuveera Reddy comments

నీలకంఠాపురం రఘువీరారెడ్డి పరిచయం అక్కర్లేని పేరు. కంచు కంఠంతో.. మంచి వాగ్ధాటి మాట్లాడుతూ ఏపీ రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేకతను కలిగిన నేత. అలాంటి నేత 2019 ఎన్నికల నుంచి పూర్తి స్తబ్దుగా ఉంటున్నారు. వ్యవసాయ పనులు చేసుకుంటూ అనంతపురం జిల్లాలోని తన గ్రామానికే పరిమితమయ్యారు.1989 1999 2004 అసెంబ్లీ ఎన్నికల్లో రఘువీరారెడ్డి అనంతపురం జిల్లా మడకశిర నుంచి 2009లో కల్యాణదుర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు 2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో వ్యవసాయ శాఖ మంత్రిగా ఆ తర్వాత కొణిజేటి రోశయ్య నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి మంత్రివర్గాల్లో రెవెన్యూ శాఖ మంత్రిగా కీలక బాధ్యతలు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత 2014 నుంచి 2019 వరకు ఏపీ పీసీసీ అధ్యక్షుడిగానూ వ్యవహరించారు.

గత ఎన్నికల్లో కల్యాణదుర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన రఘువీరారెడ్డి మూడో స్థానంలో నిలిచారు. ఇక అప్పటి నుంచి క్రియాశీలక రాజకీయాలకు దూరమయ్యారు. ప్రస్తుతం కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ పాదయాత్ర కర్ణాటకలో సాగుతున్న సంగతి తెలిసిందే. అక్కడ అక్టోబర్ నెలాఖరులో యాత్ర ముగించుకుని రాహుల్ అనంతపురం కర్నూలు జిల్లాల్లోకి ప్రవేశిస్తారు. ఏపీలో ఈ రెండు జిల్లాల్లో మాత్రమే రాహుల్ యాత్ర సాగుతుంది.

ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ పాదయాత్రలో తాను పాల్గొంటానని రఘువీరారెడ్డి తెలిపారు. జోడో యాత్రలో రాహుల్‌ను కలుస్తానని స్పష్టం చేశారు. అయితే క్రియాశీలక రాజకీయాల్లోకి తిరిగి ప్రవేశించబోనని తేల్చిచెప్పారు.

కాంగ్రెస్ పార్టీలో తనకు అవకాశం ఇచ్చి.. ఉన్నత స్థానానికి తీసుకువచ్చారని ఈ నేపథ్యంలో మర్యాదపూర్వకంగా రాహుల్ గాంధీని కలుస్తానని రఘువీరారెడ్డి వెల్లడించారు. అయితే తాను రాజకీయాలకు దూరంగా ఉంటానని స్పష్టం చేశారు. మళ్లీ ఎప్పుడు తిరిగి వస్తానో మరోసారి చర్చిద్దామని వెల్లడించారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.