మళ్లీ కలకలం రేపే కామెంట్లు చేసిన నాయిని

Sun Jan 14 2018 02:50:41 GMT+0530 (IST)

Nayini

తెలంగాణ ముఖ్యమంత్రి టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సన్నిహితుడనే పేరున్న రాష్ట్ర హోం కార్మిక శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి మరోమారు గులాబీ దళపతికి గిట్టని వ్యాఖ్యలు చేశారు. ‘తెలంగాణ ఉద్యమం సమయంలో కేసీఆర్‌ను బండ బూతులు తిట్టిన ముం… కొడుకులే నేడు ఎమ్మెల్యేలు ఎంపీలుగా రాష్ట్ర కేబినెట్‌లో మంత్రులుగా కొనసాగుతున్నారు’’ అని వ్యాఖ్యానించి కలకలం సృష్టించిన నాయిని...తాజాగా మళ్లీ అదే తరహా వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ పార్టీ వినిపించే గళానికి భిన్నమైన వ్యాఖ్యలు చేశారు.మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి 99వ జయంతి సందర్భంగా పాల్గొన్న హోం మంత్రి నాయిని ఈ సందర్భంగా సంచలన కామెంట్లు చేశారు. తెలంగాణ ఉద్యమంలో చెన్నారెడ్డి కీలక పాత్ర పోషించారని ప్రశంసించారు. ఉద్యోగులు విద్యార్థులను మందుడి నడిపించారని నాయిని అన్నారు.
చెన్నారెడ్డి ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకెళ్ళారని తెలిపారు. `ఉద్యమం తీవ్రతరం కావటంతో ఇందిరాగాంధీ హుటాహుటీన హైద్రాబాద్ వచ్చారు. అందరూ అంటున్నట్లు చెన్నారెడ్డి ఉద్యమాన్ని బలహీన పరచలేదు. చెన్నారెడ్డి పోరాట యోధుడు. చెన్నారెడ్డి స్ఫూర్తితోనే కేసీఆర్ 2001లో మలి దశ ఉద్యమాన్ని ప్రారంభించారు` అని ప్రశంసల జల్లు కురిపించారు.

ఉద్యమం గురించి ఇలా ప్రకటించిన నాయిని...తాజాగా స్వరాష్ట్ర సాధన గురించి అదే తరహా కామెంట్లు చేశారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందని కొనియాడారు. తెలంగాణ రాష్ట్రాన్ని మేం తెస్తామనుకోలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. `చెన్నారెడ్డి కేసీఆర్ స్ఫూర్తితో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. రాజకీయాలకు అతీతంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవకాశముంది` అని వ్యాఖ్యానించారు.