Begin typing your search above and press return to search.

టీడీపీకి మరో దెబ్బ..‘మిలీనియం’పై కథనాలు బేస్ లెస్సే

By:  Tupaki Desk   |   22 Feb 2020 5:34 PM GMT
టీడీపీకి మరో దెబ్బ..‘మిలీనియం’పై కథనాలు బేస్ లెస్సే
X
వైసీపీ సర్కారు విశాఖ కేంద్రంగా ఏర్పాటు చేస్తున్న ఎగ్జిక్యూటివ్ కేపిటల్ పై ఇప్పటికే లెక్కలేనన్ని అసత్యాలు ప్రచారంలోకి రాగా... అవన్నీజగన్ సర్కారుతో ప్రమేయం లేకుండానే వీగిపోయాయి. తాజాగా సచివాలయం ఏర్పాటు కానుందన్న మిలీనియం టవర్స్ విషయంలోనూ జగన్ సర్కారుకు దెబ్బ పడిందన్న వార్తలు కూడా తుత్తునీయలు అయ్యాయి. ఈ విషయంలోనూ జగన్ సర్కారు ప్రమేయం ఎంతమాత్రం లేదని సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వంలో అంతర్భాగంగా ఉన్న ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(పీఐబీ) తేల్చి చెప్పేసింది. వెరసి జగన్ సర్కారుపై ఏదో ఒక అస్త్రాన్ని ఆసరా చేసుకుని దుష్ప్రచారం చేస్తున్న టీడీపీకి - ఆ పార్టీ నేతలకు మరో ఎదురు దెబ్బ గట్టిగానే తగిలిందని చెప్పక తప్పదు.

మిలీనియం టవర్స్ లో ఏపీ సచివాలయంతో పాటు సీఎం కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేసే దిశగా జగన్ సర్కారు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మిలీనియం టవర్స్ ను రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఇప్పటికే రెండు మూడు పర్యాయాలు పరిశీలించారు కూడా. ప్రస్తుతం అందులో కొనసాగుతున్న పలు కంపెనీలకు కొత్తగా వేరే చోట కార్యాలయాలు ఏర్పాటు చేసుకునేలా ప్రభుత్వం నుంచి ఆదేశాలు కూడా వెళ్లాయన్న ప్రచారం సాగుతోంది. ఈ విషయంలో ఇప్పటిదాకా ఎలాంటి అధికారిక ఉత్తర్వులు వెలువడకున్నా... దీనిపై టీడీపీ అనుకూల మీడియాలో లెక్కలేనన్ని కథనాలు వస్తున్నాయి.

ఇందులో భాగంగానే ఐటీ కంపెనీల కోసం ఏర్పాటు చేసిన మిలీనియం టవర్స్ లో సెక్రటేరియట్ ఎలా పెడతారంటూ టీడీపీ నేతలు వాదిస్తున్నారు. ఇదే సమయంలో తెలుగు నేలకు చెందిన ప్రముఖ ఆంగ్ల దినపత్రిలో శనివారం నాటి సంచికలో ఓ కథనం ప్రచురితమైంది. మిలీనియం టవర్స్ లో సెక్రటేరియట్ ఏర్పాటుకు విశాఖ కేంద్రంగా పనిచేస్తున్న తూర్పు నావికాదళం అభ్యంతరం వ్యక్తం చేసిందని - ఫలితంగా మిలీనియం టవర్స్ నుంచి ఏపీ ప్రభుత్వం వెనుకంజ వేయక తప్పలేదని ఆ కథనంలో సదరు పత్రిక తెలిపింది. ఈ వార్తలను పట్టుకుని టీడీపీ నేతలు ఓ రేంజిలో నానా యాగీ చేశారు. జగన్ కు ఏం తెలుసని మిలీనియం టవర్స్ లో సెక్రటేరియట్ పెడతారంటూ తమదైన శైలి వ్యాఖ్యలు చేశారు.

టీడీపీ నేతల నుంచి ఈ తరహా కామెంట్లు వినిపిస్తున్న నేపథ్యంలో... దేశ రక్షణ రంగానికి చెందిన విభాగాల వార్తలను విడుదల చేసే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఓ సంచలన ప్రకటనను విడుదల చేసింది. మిలీనియం టవర్స్ లో సెక్రటేరియట్ పెడతామంటూ ఏపీ ప్రభుత్వం నుంచి తూర్పు నావికా దళానికి ఎలాంటి ప్రతిపాదన రాలేదని, అదే సమయంలో మిలీనియం టవర్స్ కు సంబంధించి తూర్పు నావికా దళం ఏపీ ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం తెలపలేదని, ఈ దిశగా జరిగిన ప్రచారం, ఓ ఆంగ్ల పత్రికలో వచ్చిన కథనం పూర్తిగా ఆధార రహితమని, పూర్తిగా అబద్ధమని పీఐబీ కుండబద్దలు కొట్టింది. పీఐబీ నుంచి ఖండన వచ్చిందంటే... అది కేంద్ర ప్రభుత్వం నుంచి జారీ అయిన ప్రకటనగానే భావించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మిలీనియం టవర్స్ విషయంలో జగన్ కు దెబ్బ పడిందని మహ బాగా సంబరపడిపోయిన టీడీపీ నేతలకు మరోమారు గట్టి ఎదురు దెబ్బ తగిలిందని చెప్పక తప్పదు.