ఓవైసీకి ఇలాంటి ఇమేజ్ ఉందా?

Wed Apr 17 2019 10:17:22 GMT+0530 (IST)

Navjot Singh Sidhu Attacks PM Modi over Asaduddin Owaisi

కొన్ని మాటలు ఊహకు అందని రీతిలో ఉంటాయి. బీజేపీకి.. మజ్లిస్ ఓవైసీకి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందన్నట్లు ఉంటుంది. మరి.. వీరిద్దరి మధ్య మంచి సంబంధాలు ఉంటాయన్న మాటను జీర్ణించుకోగలమా?  కానీ.. తరచి చూస్తే.. ఇది నిజమన్నట్లుగా కొన్ని ఆరోపణలు ఉన్నాయి. పాతవాటిని పక్కన పెడితే.. కొత్తగా తెర మీదకు వచ్చిన ఒక ప్రముఖుడి వ్యాఖ్య కొత్త అనుమానాలు రేకెత్తించటం ఖాయం.ఇంతకీ ఆ ప్రముఖుడు ఎవరు?  ఓవైసీ మీద అతడు చేసిన ఆరోపణ ఏమిటి? అన్నది చూస్తే.. మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీకి.. బీజేపీకి మధ్య చక్కటి సంబంధాలు ఉన్నట్లుగా తీవ్రమైన ఆరోపణ చేశారు పంజాబ్ మంత్రి నవజ్యోత్ సిద్దూ. తాజాగా ఆయన చేస్తున్న ఎన్నికల ప్రచారంలో ఆయన ఆసక్తికర వ్యాఖ్య చేశారు.
 
ముస్లిం సోదరులారా వినండి! మిమ్మల్ని హెచ్చరించడానికే కతిహార్ కు వచ్చాను. బీజేపీ నేతలు ఒవైసీలాంటి వాళ్లకు లంచాలిచ్చి ఇక్కడికి తీసుకొచ్చారు. ఆయనేమో మిమ్మల్ని మీ ఓట్లను చీల్చడానికి ప్రయత్నిస్తున్నారంటూ ఊహించని రీతిలో విమర్శలు చేశారు. వాస్తవానికి ఓవైసీ మీద ఈ తరహా ఆరోపణలు కొందరు చేస్తుంటారు. గతంలో ఎప్పుడూ లేని రీతిలో 2014 తర్వాత నుంచి దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఎన్నికల్లో పోటీ చేస్తున్న అసద్ ఉద్దేశం గెలుపు కాదని.. ముస్లిం ఓట్లు చీల్చి మోడీ పరివారానికి సాయం చేయటంగా చెబుతారు.

ఈ వాదనల్లో నిజం లేదన్న మాటకు కొందరు చెప్పే సమాధానం కాస్తంత కన్వీన్స్ చేసేలా ఉంటుంది. ఓవైసీ మీద ఉన్న కేసుల్ని పక్కన పెడితే. .దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న వారిపై ఏదో సమయంలో సోదాలు జరగటం చూస్తున్నాం కదా.. మరి.. ఓవైసీ మీద ఎప్పుడు ఎలాంటి తనిఖీలు.. సోదాలు ఎందుకు జరగనట్లు? అంటూ వేసే ప్రశ్న విన్నప్పుడు సిద్దూ చేసిన వ్యాఖ్య లాంటిది చప్పున గుర్తుకు రాక మానదు. మొత్తంగా చూస్తే.. సిద్ధూ ఆరోపణలు ఆసక్తికరమని చెప్పాలి. మరి.. ఈ వ్యాఖ్యలపై ఓవైసీ మాష్టారు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.