Begin typing your search above and press return to search.

మరోసారి బద్దలైన 'మౌంట్ సేమేరు' అగ్ని పర్వతం.. హెచ్చరికలు జారీ..!

By:  Tupaki Desk   |   5 Dec 2022 8:30 AM GMT
మరోసారి బద్దలైన మౌంట్ సేమేరు అగ్ని పర్వతం.. హెచ్చరికలు జారీ..!
X
ప్రకృతి విపత్తులకు కేరాఫ్ గా ఇండోనేషియా మారుతోంది. తరుచూ భూకంపాలతో వార్తల్లో నిలుస్తున్న ఇండోనేషియా తాజాగా మరోసారి ప్రకృతి విపత్తు లోనుకావడం విషాదాన్ని నింపింది. జావా ద్వీపంలోని మౌంట్ సేమేరు అగ్ని పర్వతం ఆదివారం తెల్లవారుజామున బద్దలైంది. ఈక్రమంలోనే ఇండినేషియా ప్రకృతి విపత్తుల శాఖ స్థానికంగా తీవ్ర హెచ్చరికలను జారీ చేసింది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. ఇండోనేషియాలో అత్యంత ఎత్తైన అగ్ని పర్వతంగా 'మౌంట్ సెమేరు' నిలిచింది. అయితే ఈ అగ్ని పర్వతం ఇటీవలీ కాలంలో తరుచూ విస్పోటం చెందుతోంది. గత ఏడాది డిసెంబర్ లో ఈ అగ్నిపర్వతం పేలడం వల్ల స్థానికంగా ఉండే 50 మంది పౌరులు దుర్మరణం చెందగా వేలాది మంది నిరాశ్రయులుగా మారారు.

ఈ ఏడాదిలో మౌంట్ సెమేరు అగ్నిపర్వతం పేలడం వరుసగా మూడోసారి. ఇండోనేషియా కాలమాన ప్రకారంగా ఆదివారం ఉదయం 2.46 నిమిషాలకు అగ్నిపర్వతం విస్పోటనం చెందినట్లు ఇండోనేషియా అగ్నిపర్వతాల.. భూ సంబంధిత ప్రమాదాల నివారణ కేంద్రం అధిపతి హెండ్రా గుణవాన్ తెలిపారు. మధ్యాహ్నం కల్లా లావా చుట్టూ ఉండే ప్రాంతాలకు పాకి పోయిందన్నారు.

ఈ నేపథ్యంలోనే అగ్ని పర్వతం చుట్టూరా ఐదు నుంచి ఎనిమిది కిలోమీటర్ల రేంజ్ పరిధిలో డేంజర్ జోన్ గా ప్రభుత్వం ప్రకటించింది.

అగ్నిపర్వతం నుంచి లావా విరివిగా వెలువడుతున్న నేపథ్యంలో స్థానిక ప్రజలంతా బెసుక్ కొబోకాస్ నది ఆగ్నేయ ప్రాంతం మీదుగా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని హెండ్రా గుణవాన్ సూచించారు.

అగ్నిప్రమాదం పేలుడుతో ఆ ప్రాంతమంతా దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. దాదాపు 19 కిలోమీటర్ల పరిధిలో బూడిద వ్యాపించిందని అధికారులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో తీవ్ర హెచ్చరికలను జారీ చేశారు. స్థానికంగా ఉంటున్న రెండు వేల మందిని తాత్కాలిక శిబిరాలకు తరలించినట్లు ఇండోనేషియా విపత్తు ప్రతిస్పందన నిర్వహణ సంస్థ తాజాగా వెల్లడించింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.