Begin typing your search above and press return to search.

మోడీ తెచ్చిన చ‌ట్టంపై కోర్టుకు..నిల‌బ‌డేనా?

By:  Tupaki Desk   |   14 Dec 2019 3:38 PM GMT
మోడీ తెచ్చిన చ‌ట్టంపై కోర్టుకు..నిల‌బ‌డేనా?
X
పౌర‌స‌త్వ నియ‌మాల స‌వ‌ర‌ణ చ‌ట్టం కోర్టులో నిల‌బ‌డ‌దు అంటూ కాంగ్రెస్ నేత‌లు వ్యాఖ్యానిస్తూ వ‌స్తున్నారు. లాయ‌ర్లు అయిన కాంగ్రెస్ నేత‌ల్లో ఒక‌రు - కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబ‌రం ఆ విశ్లేష‌ణ చేశారు. ఈ చ‌ట్టం మ‌త‌ప‌ర‌మైన‌ద‌ని ఆయ‌న గుర్తు చేశారు. రాజ్యాంగం ప్ర‌కారం.. ఇలాంటి చ‌ట్టాలు నిల‌బ‌డ‌వ‌ని - రాజ్యాంగంలో స‌వ‌ర‌ణ చేసి ఉంటే ఈ చ‌ట్టం నిల‌బ‌డేదేమో కానీ, ఇప్ప‌టికిప్పుడు చేసిన ఈ చ‌ట్టం నిల‌బ‌డ‌దు అని ఆయ‌న విశ్లేషించారు.

మ‌రి కొంద‌రు కాంగ్రెస్ నేత‌లు కూడా అదే మాటే మాట్లాడారు. పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ‌ల చ‌ట్టం నిల‌బ‌డే అవ‌కాశ‌మే లేద‌ని వారు కుండ‌బ‌ద్ధ‌లు కొట్టారు. ఈ నేప‌థ్యంలో ఈ చ‌ట్టంపై కోర్టులో తొలి పిటిష‌న్ దాఖ‌లు అయ్యింది. ఎంఐఎం అధినేత అస‌దుద్దీన్ ఒవైసీ ఈ మేర‌కు పిటిష‌న్ దాఖ‌లు చేశారు.

పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ‌ల చ‌ట్టాన్ని ర‌ద్దు చేయాల‌ని ఆయ‌న కోర్టును కోరారు. ఆ చ‌ట్టంపై చ‌ర్చ సంద‌ర్భంగా కూడా ఒవైసీ తీవ్రంగా స్పందించారు. ఆ చ‌ట్టం పేప‌ర్ల‌ను ఆయ‌న లోక్ స‌భ‌లో చించి గాల్లోకి విసిరారు. ముస్లింల‌కు ఈ చ‌ట్టంతో ఇబ్బందులు క‌లుగుతాయ‌ని అంటూ ఆయ‌న చ‌ట్టాన్ని వ్య‌తిరేకించారు.

ఇప్పుడు కోర్టుకు ఎక్కారు. ఈ పిటిష‌న్ ను సుప్రీం కోర్టు విచారిస్తే అది అత్యంత ఆస‌క్తిదాయ‌కం అవుతుంది. ఎందుకంటే.. ఈ చ‌ట్టాన్ని మోడీ స‌ర్కారు చాలా ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంది. ఇది చారిత్రాత్మ‌క చ‌ట్టం అంటూ మోడీ, అమిత్ షాలు చెప్పుకున్నారు. ఇది కోర్టు ముందు నిల‌బ‌డే అవ‌కాశ‌మే లేద‌ని కాంగ్రెస్ సీనియ‌ర్లు వాదిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఎవ‌రి పంతం నెగ్గుతుంద‌నేది కోర్టే తేల్చాల్సి ఉంద‌ని ప‌రిశీల‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.