Begin typing your search above and press return to search.

నేడు ప్ర‌ధాని బెంగాల్ ప‌ర్య‌ట‌న‌.. దీదీకి చుక్క‌లు చూపిస్తారా?

By:  Tupaki Desk   |   23 Jan 2021 9:42 AM GMT
నేడు ప్ర‌ధాని బెంగాల్ ప‌ర్య‌ట‌న‌.. దీదీకి చుక్క‌లు చూపిస్తారా?
X
ప‌శ్చిమ బెంగాల్ రాజ‌కీయం కాక పుట్టిస్తుందా? ఎన్నిక‌ల‌కు ఇంకా చాలా స‌మ‌యం ఉన్న‌ప్ప‌టికీ.. ఇప్ప‌టి నుంచే బీజేపీ వ‌ర్సెస్ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీల మ‌ధ్య పోరు ర‌స‌వ‌త్త‌రంగా సాగుతోంది. ఎట్టి ప‌రిస్థితిలోనూ బెంగాల్లో స‌ర్కారును ఏర్పాటు చేయా లని క‌ల‌లుకంటున్న బీజేపీ.. ఒక‌వైపు.. ఎట్టిప‌రిస్థితిలోనూ బీజేపీని ఎద‌గ‌నిచ్చేది లేద‌ని.. ముచ్చ‌ట‌గా మూడోసారి కూడా ప‌గ్గా లు చేప‌ట్ట‌డం ఖాయ‌మ‌ని అధికార తృణ‌మూల్ కాంగ్రెస్ అధినేత్రి మ‌మ‌తా బెన‌ర్జీ(దీదీ)లు ఒక‌రితో ఒక‌రు ఢీ అంటే ఢీ అనే రీతిలో పోరాడుకుంటున్నారు. ఈ క్ర‌మంలో రాష్ట్ర ప‌ర్య‌ట‌న‌కు వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు న‌డ్డా ప్ర‌యాణిస్తున్న కాన్వాయ్‌పై కొన్నాళ్ల కింద‌ట రాళ్ల దాడి జ‌రిగింది. ఇక‌, కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు కూడా బెంగాల్‌లో ప‌రాభ‌వం ఎదురైంది.

ఇదిలావుంటే.. కేంద్రం కూడా దీదీ విష‌యంలో అవ‌కాశం వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా దూకుడు ప్ర‌ద‌ర్శిస్తోంది. విమ‌ర్శ‌లు సంధిస్తోంది. అరాచ‌క పాల‌న‌కు ప‌రాకాష్ట‌గా ప‌శ్చిమ బెంగాల్ నిలిచిందంటూ.. సాక్షాత్తూ రాష్ట్ర గ‌వ‌ర్న‌రే వ్యాఖ్య‌లు చేస్తుండ‌డం దీనిలో భాగ‌మేన‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. మ‌రోవైపు దీదీ మంత్రివ‌ర్గాన్ని బ‌ల‌హీన ప‌రిచే చ‌ర్య‌లు కూడా చాప‌కింద నీరులా బీజేపీ చేస్తుండ‌డం గ‌మ‌నార్హం. ఇప్ప‌టికే కీల‌క నేత‌ల‌ను దీదీకి దూరం చేయ‌డంతోపాటు.. త‌మ చెంత‌కు చేర్చుకున్న క‌మ‌లం పార్టీ.. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ బెంగాల్ ప‌ర్య‌ట‌న‌కు ఒక్క‌రోజు ముందు అంటే శుక్ర‌వారం దీదీ మంత్రి వ‌ర్గంలోని మ‌రో కీల‌క నేత‌ను ఆమెకు దూరం చేసింది. అట‌వీశాఖ మంత్రిగా ఉన్న రాజీవ్ బెన‌ర్జీ.. త‌న‌ ప‌ద‌వికి.. రాజీనామాచేయ‌డం రాష్ట్ర రాజ‌కీయాల‌ను కుదిపేసింది. ఆయ‌న త్వ‌ర‌లోనే బీజేపీ తీర్థం పుచ్చుకుంటార‌ని అంటున్నారు.

ఇలా ఎన్నిక‌ల‌కు చాలా స‌మ‌యం ఉన్న నేప‌థ్యంలో ఇరు ప‌క్షాలు ఒక‌రిపై ఒక‌రు రాజ‌కీయ చుర‌క‌త్తుల‌తో విరుచుకుప‌డుతూ.. రాష్ట్రంలో పొలిటిక‌ల్ సెగ‌ను భారీగా పెంచేస్తున్నారు. ఈ స‌మయంలో తాజాగా శ‌నివారం.. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.. బెంగాల్‌లో ప‌ర్య‌టించ‌డం రాజ‌కీయంగా మ‌రింత చ‌ర్చ‌నీయాంశంగా మారింది. నేతాజీ సుభాస్ చంద్రబోస్ 125 వ జయంత్యుత్సవాన్ని పురస్కరించుకొని ప్రధాని బెంగాల్‌లో పర్యటించనున్నారు. మామూలుగా అయితే ఈ పర్యటనకు అంత ప్రాధాన్యత ఉండకపోవచ్చు. కానీ, బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు త్వ‌ర‌లోనే జ‌ర‌గ‌నున్న నేపథ్యంలో ఈ పర్యటనకు అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. ఎల్జిన్ రోడ్డులోని నేతాజీ భవన్‌ను సందర్శించి, అక్కడి నుంచే ‘పరాక్రమ దివస్’ ను ప్రారంభించనున్నారు.

వాస్త‌వానికి కీల‌క ప్రాధాన్యం లేకుండా.. ప్ర‌ధాని బెంగాల్ ప‌ర్య‌ట‌న‌కు సంసిద్ధులు కారనేది ప‌రిశీల‌కుల మాట‌. దీనిని బ‌ట్టి.. బెంగాల్ బీజేపీకి మ‌రింత జోష్ పెంచ‌డంతోపాటు.. తృణ‌మూల్ నేత‌ల‌కు ప‌రోక్షంగా `నేనున్నా`నంటూ.. మోడీ సందేశం పంపించే అవ‌కాశం క‌నిపిస్తోంద‌ని అంటున్నారు. ఇటీవ‌ల గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఎన్నిక‌ల ప్ర‌చారం జ‌రుగుతున్న స‌మ‌యంలో కూడా ప్ర‌ధాని మోడీ.. క‌రోనా వ్యాక్సిన్ త‌యారీ సంస్థ‌ల శాస్త్ర‌వేత్త‌ల‌తో భేటీ అయ్యేందుకు రావ‌డం ద్వారా.. గ్రేట‌ర్ ఎన్నిక‌ల‌ను ప్ర‌భావితం చేశార‌నే వాద‌న ఉంది. అలానే.. ఇప్పుడు కీల‌క‌మైన ఎన్నిక‌ల ప్ర‌క్రియ మ‌రికొద్ది వారాల్లో ప్రారంభం కానున్న నేప‌థ్యంలో బెంగాల్ రాజ‌కీయాల‌ను ప్ర‌భావితం చేసేందుకే ఆయ‌న ప‌నిగ‌ట్టుకుని `ప‌రాక్ర‌మ దివ‌స్‌`ను ఇక్క‌డ నుంచి ప్రారంభిస్తున్నార‌నే విశ్లేష‌ణ‌లు వినిపిస్తున్నాయి. ఏ ఎండ‌కు ఆ గొడుగు ప‌ట్ట‌డం రాజ‌కీయ నేత‌ల ల‌క్ష‌ణం.. సో.. ఏదేమైనా.. మోడీ వ్యూహాత్మ‌క ప‌ర్య‌ట‌న దీదీకి ఎలాంటి ప‌రిస్థితిని తీసుకువ‌స్తుందో చూడాల‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.