కేసీఆర్ కు చెక్ పెట్టారన్న సిగ్నల్ అలా ఇస్తారట!

Wed Jun 12 2019 10:35:44 GMT+0530 (IST)

తెలంగాణ ప్రజలు నమ్మి.. బంగారు తెలంగాణ కోసం సారుకు చేతికి రాష్ట్రం తాళాల్ని ఇచ్చేసినప్పుడు ఎంత బాధ్యతగా వ్యవహరించాలి. విభజన నాటి సమస్యలు ఇంకా కొలిక్కి రాక ముందే.. తెలంగాణను వదిలేసి దేశాన్ని ఏలేసే ఆలోచన చేసి.. ఫెడరల్ ఫ్రంట్ పేరుతో హడావుడి చేసిన కేసీఆర్ ఇప్పుడు తీరిగ్గా బాధ పడుతున్నట్లుగా చెబుతున్నారు. అత్యంత సన్నిహితుల దగ్గర డామిట్.. కథ అడ్డం తిరిగిందన్న రీతిలో ఆయన తన మనసులోని మాటల్ని చెప్పినట్లుగా తెలుస్తోంది.ఫెడరల్ ఫ్రంట్ కాన్సఫ్ట్ అదిరిపోయేదే కానీ.. ప్రజల మనసుల్ని చదవటంలో ఫెయిల్ అయ్యామన్న భావన ఆయన మాటల్లో వినిపించినట్లుగా చెబుతున్నారు. ఫెడరల్ ఊపులో ప్రధాని మోడీని ఉద్దేశించి తాను చేసిన వ్యాఖ్యల్ని ఇప్పుడు చూసుకుంటున్న ఆయన.. అంత జోరు ప్రదర్శించకుండా ఉండాల్సిందన్న అభిప్రాయంలో ఉన్నట్లు సమాచారం. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ప్రతి విషయాన్ని మనసులో పెట్టుకొని సమయం చూసి దెబ్బ తీసే మోడీ.. ఇప్పుడు తమకు ఎలాంటి చికాకులు పెడతారన్నది అర్థం కావట్లేదంటున్నారు.

ఈ విషయం మీద మాట్లాడేందుకు ఇటీవల కాలంలో పలుమార్లు తనకు అత్యంత సన్నిహితుడైన తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ తో మాట్లాడినట్లుగా చెబుతున్నారు. మోడీకి తిరుగులేని అధికారాన్ని దేశ ప్రజలు ఇచ్చిన నేపథ్యంలో ఆయన గతానికి మించిన బలవంతుడవుతారని.. తమను ఇబ్బందిపెట్టటం మొదలు పెడితే కొత్త తలనొప్పులు ఖాయమంటున్నారు.

అయితే.. ఈ విషయాన్ని గుర్తించేది ఎలా? అన్న దానిపై గులాబీ నేతలు చెబుతున్న మాటలు కాసింత ఆసక్తికరంగా ఉన్నాయి. తమ సారుకు చెక్ పెట్టాలన్నదే మోడీ ఆలోచన అయితే.. దానికి సంబంధించిన ప్రక్రియ గవర్నర్ ను సాగనంపటంతోనే సిగ్నల్ ఇచ్చేస్తారని చెబుతున్నారు. పదేళ్లుగా గవర్నర్ గా ఉన్న నరసింహన్ మరికొంతకాలం కొనసాగిస్తారన్న వాదనతో గులాబీ నేతలు ఇప్పుడు విబేధిస్తున్నారు.

ఈసారికి అవకాశాలు తక్కువన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్నెల్ల నుంచి తొమ్మిది నెలల వరకూ గవర్నర్ ను కొనసాగిస్తే.. మరికొంతకాలం మార్చే అవకాశం ఉందంటున్నారు. అదే సమయంలో చెప్పి చెప్పకుండానే ఆయన్ను తొలగిస్తే మాత్రం.. కేసీఆర్  విషయంలో తాము దృష్టి పెట్టామన్న విషయాన్ని చెప్పకనే చెప్పేసినట్లు అవుతుందంటున్నారు. గవర్నర్ ను కదిలించటంలోనే వార్నింగ్ విజిల్ మోగుతుందన్న మాట వినిపిస్తోంది.