ఏపీకి హ్యాండివ్వటమే మోడీ ప్రయారిటీనా?

Mon Jul 30 2018 16:16:26 GMT+0530 (IST)

ఏపీకి మొండి చేయి చూపించటమే మోడీ సర్కార్ ప్రధమ కర్తవ్యమన్నట్లుగా కనిపిస్తోంది. విభజన హామీల మీద సుప్రీంలో కేంద్రం సమర్పిస్తున్న ఆఫిడవిట్లను చూస్తే.. విభజన హామీల్ని చెత్త కుప్పలో పడేసేందుకు ఫుల్ గా డిసైడ్ అయ్యారనే చెప్పాలి. ఒక ప్రధానమంత్రి రాజ్యసభలో ఇచ్చిన హామీని తుంగలోకి తొక్కేయటం ద్వారా.. పార్లమెంటు మీద తనకున్న గౌరవ మర్యాదలు ఎంతన్న విషయాన్ని చెప్పేశారని చెప్పాలి.ఎంపీగా తొలిసారి గెలిచి.. పార్లమెంటులోకి అడుగు పెట్టే క్రమంలో.. అక్కడి మెట్లకు నమస్కారం చేయటం ద్వారా అందరి మనసుల్ని దోచేసిన మోడీ.. అవన్నీ కెమేరాలు క్లిక్ మనిపించేందుకు.. రికార్డుల్లో తన గురించి గొప్పగా రాయటానికే కానీ.. మనసులో అలాంటివేమీ లేవన్న విషయాన్ని చేతల్లో చేసి చూపించారు.

హోదాకు దెబ్బేసిన మోడీ సర్కారు.. విభజన చట్టంలో పేర్కొన్న కడప ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించిన వ్యవహారం మీద ఇప్పటికే సాధ్యం కాదన్న మాటను లాభసాటి కాదన్న కారణాన్ని చూపించి హ్యాండిచ్చిన మోడీ సర్కారు.. ఇప్పుడు విశాఖకు రైల్వే జోన్ మీదా హ్యాండ్ ఇవ్వటం తెలిసిందే.

మోడీ సర్కారు మీద టీడీపీ పెట్టిన అవిశ్వాస తీర్మానం సందర్భంలోనూ రైల్వే జోన్ అంశాన్ని పరిశీలిస్తున్నట్లుగా చెప్పి.. పాజిటివ్ గా తాము రియాక్ట్ కానున్నట్లుగా చెప్పినప్పటికీ.. అవన్నీ అప్పటికి కవర్ చేసే మాటలే తప్పించి ఆచరణలో అలాంటిదేమీ లేదన్న విషయాన్ని తాజాగా తేల్చేశారని చెప్పాలి.

విభజన చట్టంలో సాధ్యాసాధ్యాల పరిశీలన అని మాత్రమే పేర్కొన్నారే తప్పించి.. అందులో పేర్కొన్న ప్రతి అంశాన్ని నెరవేర్చాలన్నట్లుగా లేదు కాబట్టి. . ఆ పేరు చెప్పి సాధ్యం కాదన్నట్లుగా తేల్చేయటం చూస్తుంటే.. ఏపీని ఏ విధంగా ఆదుకునే ఆలోచన తమకు లేదన్న విషయాన్ని మోడీ సర్కారు స్పష్టం చేస్తున్నట్లుగా చెప్పక తప్పదు.

విభజన చట్టంలో పేర్కొన్న అంశాల్లో సాధ్యాసాధ్యాలు.. పరిశీలన లాంటి పదాలన్ని తర్వాతి రోజుల్లో కేంద్రానికి ఇబ్బంది లేకుండా ఉండేలా చేయటం కోసమే తప్పించి... ఆ పేరుతో తప్పించుకోవటానికి కాదన్న విషయాన్ని మోడీ మర్చిపోయినట్లున్నారు. ఏమైనా.. చట్టంలో పేర్కొన్న కొన్ని పదాల్ని అసరాగా చేసుకొని ఏపీకి హ్యాండిచ్చేందుకు సిద్ధమవుతున్న మోడీ తీరు చూస్తే.. ఏపీ ప్రజలు విభజన కారణంగా ఎంతగా మోసానికి కారణమయ్యారో ఇట్టే తెలుస్తుంది. అయినా.. తన ముందు ప్రధానిగా పని చేసిన వ్యక్తి మాటకు విలువ ఇవ్వాల్సిన అవసరం లేదనే మోడీ లాంటి నేత.. చట్టంలో ఉన్న అంశాల్ని మాత్రం బాధ్యతగా తీసుకుంటారని ఆశిస్తే అది అత్యాశే అవుతుంది