Begin typing your search above and press return to search.

బెట్టింగ్‌ కు గేట్లేత్తేస్తారా?..మోదీ మార్కు కొత్త యోచ‌న‌!

By:  Tupaki Desk   |   6 July 2018 10:23 AM GMT
బెట్టింగ్‌ కు గేట్లేత్తేస్తారా?..మోదీ మార్కు కొత్త యోచ‌న‌!
X
దేశాన్ని అవినీతి ర‌హితం చేస్తామంటూ గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో బీజేపీ ప్ర‌ధాన మంత్రి అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగిన న‌రేంద్ర మోదీ ఊక‌దంపుడు ఉప‌న్యాసాలు చేశారు. మ‌న దేశానికి చెందిన అవినీతిప‌రులు చ‌ట్ట‌విరుద్ధంగా సంపాదించి స్విస్ బ్యాంకుల‌కు త‌ర‌లించిన న‌ల్ల‌ధ‌నాన్ని తిరిగి దేశానికి ర‌ప్పిస్తామ‌ని - దానితో దేశాన్ని ఏ ఒక్క‌రూ ఊహించనంత మేర అభివృద్ధి చేసేస్తామ‌ని నాడు క‌మ‌ల‌దండు జ‌నం చెవులు చిల్లులు ప‌డేలా ప్ర‌చారాన్ని మారుమోగించింది. అప్ప‌టిదాకా చాలా మంది ఈ మాట చెప్పినా... మోదీ త‌న‌దైన శైలిలో చేసిన ప్ర‌చారంతో నిజంగానే ఈ కార్యం జరిగి తీరుతుందేమోన‌న్న భావ‌న‌తో జ‌నం మోదీకి జైకొట్టారు. బ్యాలెట్ ప‌త్రాల్లో క‌మ‌లం గుర్తుపై త‌మ విలువైన ఓట్లేసి బీజేపీకి అఖండ మెజారిటీ క‌ట్ట‌బెట్టారు. తీరా జ‌రిగిందేమిటంటే... న‌ల్ల‌ధ‌నం తీసుకురాలేదు క‌దా... ఆ దిశ‌గా పెద్ద‌గా చ‌ర్య‌లు తీసుకున్న దాఖ‌లాలు కూడా క‌నిపించ‌లేదు. ఏదో జ‌నానికి చెప్పాం కాబ‌ట్టి స్విస్ బ్యాంకులు - ఆ బ్యాంకులు ఉన్న దేశానికి లేఖ‌లు రాసేసి త‌మ ప‌ని అయిపోయిన‌ట్టుగా మోదీ స‌ర్కారు వ్య‌వ‌హ‌రించేసింది.

ఈ తతంగంపై జ‌నం దృష్టిని మ‌ర‌ల్చేందుకు మ‌రో పెద్ద ప్రణాళిక ర‌చించిన మోదీ... దేశంలో అవినీతి త‌గ్గాలంటే పెద్ద నోట్ల ర‌ద్దు ఒక్కటే మార్గ‌మంటూ... ఉరుములేని పిడుగులా రాత్రికి రాత్రి పెద్ద రూ.1,000 - రూ.500 నోట్ల‌ను ర‌ద్దు చేసి పారేశారు. ఆ త‌ర్వాత అంత‌కంటే పెద్ద విలువ క‌లిగిన రూ.2 వేల నోట్ల‌ను ప్ర‌వేశ‌పెట్టారు. మోదీ స‌ర్కారు చేసిన ఈ సాహ‌సం దుస్సాహ‌సంగానే ప‌రిణ‌మించేసింది. పేద‌, మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌లు తాము సంపాదించిన క‌రెన్సీ కోసం బ్యాంకులు - ఏటీఎంల ముందు రోజుల త‌ర‌బ‌డి నిలుచుండి నానా పాట్లు ప‌డితే - కొంద‌రు ఏకంగా ప్రాణాలే పొగొట్టుకున్నారు. అవినీతిప‌రుల ఆట‌ల‌కు అడ్డుక‌ట్ట వేసేందుకే ఈ నిర్ణ‌యం తీసుకున్నామ‌ని మోదీ స‌ర్కారు చెబితే... అలాంటిదేమీ లేద‌ని బ‌డా బాబులు నిరూపించేశారు. సింగిల్ నోటు కోసం జ‌నం గంట‌ల త‌ర‌బ‌డి క్యూల‌లో నిలుచుంటే... త‌మిళ‌నాడుకు చెందిన కాంట్రాక్ట‌ర్‌ - టీటీడీ పాల‌క మండ‌లి మాజీ స‌భ్యుడు శేఖ‌ర్ రెడ్డిలాంటి వారు మాత్రం... లెక్క‌లేన‌న్ని నోట్ల‌ను కూడ‌బెట్టేశారు. ఫ‌లితంగా మోదీ మార్కు పెద్ద నోట్ల ర‌ద్దు అట్ట‌ర్ ఫ్లాఫ్ అయ్యింద‌నే చెప్ప‌క త‌ప్ప‌దు. అంతేకాకుండా పెద్ద నోట్ల ర‌ద్దుతో బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షాకు చెందిన సంస్థ‌ల‌కు పెద్ద ఎత్తున లబ్ధి చేకూరింద‌న్న వార్త‌లు ఇటీవ‌ల వెలుగులోకి వ‌చ్చాయి.

అయినా ఇప్పుడిదంతా ఎందుకంటారా? నాడు దేశ పురోభివృద్ధి కోస‌మంటూ పెద్ద నోట్ల‌ను ర‌ద్దు చేసిన అభాసుపాలైన మోదీ స‌ర్కారు... ఇప్పుడు అదే త‌ర‌హా కీల‌క నిర్ణ‌యం తీసుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్న‌ట్లుగా తెలుస్తోంది. గ‌త నిర్ణ‌యం కంటే కూడా ఇప్పుడు లా క‌మిష‌న్ సిఫార‌సు చేసిన మేర‌కు నిర్ణ‌యం తీసుకుంటే... ఏకంగా దేశంలో గుట్టుచ‌ప్పుడు కాకుండా జ‌రుగుతున్న చ‌ట్ట విరుద్ధ కార్య‌క్ర‌మాలను చ‌ట్ట‌ప‌రం చేసిన‌ట్టవుతుంద‌న్న వాద‌న కూడా వినిపిస్తోంది. ఇక అస‌లు విష‌యంలోకి వ‌స్తే... దేశంలో ఇప్పుడు పెద్ద ఎత్తున జ‌రుగుతున్న గ్యాంబ్లింగ్‌ - బెట్టింగ్‌ ల‌ను చ‌ట్ట‌బ‌ద్ధం చేసేస్తే మంచిదంటూ కేంద్ర ప్ర‌భుత్వానికి లా క‌మిష‌న్ చాలా గొప్ప సూచ‌న‌నే చేసింది. తాము సూచించిన మేర‌కు ఈ రెండు కార్య‌క‌లాపాల‌ను చ‌ట్ట‌బ‌ద్ధం చేసేస్తే... పెద్ద ఎత్తున ప‌న్ను వ‌సూలు అవుతుంద‌ని, ఆ నిధుల‌తో దేశంలో మ‌రింత మేర సంక్షేమ కార్య‌క్ర‌మాల‌ను అమ‌లు చేసే వీలుంటుంద‌ని కూడా ఆ క‌మిష‌న్ త‌న వాద‌న‌ను స‌మ‌ర్ధించుకునే య‌త్నం చేసింది. అంతేకాకుండా ఎలాగూ చ‌ట్ట‌విరుద్ధ‌మైన ఈ రెండు కార్య‌క‌లాపాల‌ను ఎలాగూ నిరోధించ‌లేక‌పోతున్నాం కాబ‌ట్టి... వాటికి చ‌ట్ట‌బ‌ద్ధ‌త క‌ల్పించ‌డ‌మే మేలంటూ త‌న‌దైన శైలి అభిప్రాయాన్ని వెలువ‌రించింది.

ఎలాగూ నిరోధించ‌డానికి అల‌వికాని ఈ రెండింటిని చ‌ట్ట‌బ‌ద్ధం చేసేస్తే... ఏకంగా విదేశీ ప్ర‌త్య‌క్ష పెట్టుబ‌డులు కూడా పెద్ద ఎత్తున దేశానికి త‌ర‌లివ‌స్తాయ‌ని కూడా ఓ ఉచిత స‌ల‌హా పారేసింది. మొత్తంగా చ‌ట్ట‌విరుద్ధ‌మైన ఈ కార్య‌కలాపాల‌కు ప‌చ్చ‌జెండా ఊపేసి... ప్ర‌భుత్వ ఖ‌జానాను నింపేయండ‌ని లా క‌మిష‌న్ మోదీ స‌ర్కారుకు చెప్పేసింది. మోదీ స‌ర్కారు ఈ దిశ‌గా చ‌ర్య తీసుకుంటారా?, లేదా అన్న విష‌యాన్ని ప‌క్క‌న‌బెడితే... లా క‌మిష‌న్ ప్ర‌భుత్వానికి వ‌చ్చే రాబ‌డినే ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంది త‌ప్పించి... ఈ రెండింటి కార‌ణంగా ఎన్నెన్ని కుటుంబాలు రోడ్డున‌ప‌డ్దాయ‌న్న విష‌యాన్న అస‌లు ప‌రిగ‌ణ‌న‌లోకే తీసుకున్న పాపాన పోలేదు. గుట్టుచ‌ప్పుడు కాకుండా జ‌రుగుతున్నా... ఈ రెండు మ‌హ‌మ్మారులు ఇప్ప‌టికే వేలాది కుటుంబాల‌ను రోడ్డున ప‌డేయ‌డంతో పాటు ప‌లువురి వంద‌లాది మంది ఆత్మ‌హ‌త్య‌ల‌కు కార‌ణ‌మ‌య్యాయి. ఇవేవీ ప‌ట్ట‌ని లా క‌మిష‌న్ ఇచ్చిన సిఫార‌సును ముందూ వెనుకా ఆలోచించ‌కుండా మోదీ స‌ర్కారు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేస్తే... మోదీపై మ‌రో మాయ‌ని మ‌ర‌క ప‌డుతుంద‌న్న విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి.