వ్యవసాయ బిల్లుల ఆందోళనపై మోడీ సీరియస్

Tue Sep 29 2020 23:02:07 GMT+0530 (IST)

Modi is serious about the concern over agricultural bills

పార్లమెంట్ ఆమోదింప చేసిన వ్యవసాయ బిల్లులపై ఇంతవరకు మోడీ స్పందించలేదు. పార్లమెంట్ లోనూ దీనిపై చర్చలో పాల్గొనలేదు. ఆ బిల్లులు ఆమోదం పొందడంతో దేశమంతా అట్టుడుకింది. రైతులు రోడ్లమీదకొచ్చి ఆందోళన చేశారు. ఇక బీజేపీ పాలిత కర్ణాటకలో అయితే రైతులు రైతు సంఘాలు భారీ బంద్ చేసి విజయవంతం చేశాయి. దేశవ్యాప్తంగా ఆందోళనకు కారణమైన ఈ వ్యవసాయ బిల్లులపై మోడీ ఇంతవరకు స్పందించలేదు.కాంగ్రెస్ పార్టీ వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా సీరియస్ గా ముందుకెళుతోంది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఈ చట్టాలను అమలు చేయవద్దని సోనియాగాంధీ పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే 3 వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా చేస్తున్న ఆందోళనలపై ప్రధాని మోడీ తొలిసారి తీవ్రంగా స్పందించారు.

కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో మోడీ పరోక్షంగా విరుచుకుపడ్డారు. దేశంలోని ఓ పార్టీ.. మా ప్రభుత్వం ఏం చేసినా వ్యతిరేకిస్తూనే ఉంది. చట్టాలకు అడ్డుపడుతున్నారు. వ్యవసాయ సంస్కరణలు తెస్తే వాటిపైనా ఆందోళన చేస్తున్నారు. రైతులు వారి పంటను స్వేచ్ఛగా అమ్ముకోవడం వీరికి ఇష్టం లేదు. కాంగ్రెస్ కు రైతులు బాగుపడడం ఇష్టం లేదంటూ కాంగ్రెస్ పై పరోక్షంగా మోడీ విమర్శలు చేశారు.

నమామి గంగే మిషన్ కింద ఉత్తరాఖండ్ లో రూ.521 కోట్లతో చేపట్టిన ఆరు అభివృద్ధి ప్రాజెక్టులను మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు.గంగానది మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు. దేశంలో సగం జనాభా అవసరాలను తీరుస్తోన్న గంగానది శుద్ధి కోసం గత ప్రభుత్వాలు ఎలాంటి దూరదృష్టితో పనిచేయలేదని విమర్శించారు. దేశ సంస్కృతి వారసత్వానికి గంగానది ప్రతీక అని మోడీ తెలిపారు.