Begin typing your search above and press return to search.

జగన్‌ కు మోదీ ఫోన్.. షాక్ ఇచ్చిన వైసీపీ అధినేత !?

By:  Tupaki Desk   |   15 May 2019 12:40 PM GMT
జగన్‌ కు మోదీ ఫోన్.. షాక్ ఇచ్చిన వైసీపీ అధినేత !?
X
2014 ఎన్నికల్లో ఎన్నో అంచనాలతో బరిలోకి దిగింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. కానీ, ఆ ఎన్నికల్లో మోదీ మేనియా, పవన్ కల్యాణ్ ప్రభావంతో తృటిలో అధికారాన్ని కోల్పోయింది. కానీ, అప్పటి నుంచి ప్రజల పక్షాన నిలుస్తూ వచ్చింది ఆ పార్టీ. చంద్రబాబు నాయుడు సారథ్యంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసే తప్పులను ఎత్తి చూపుతూ ముందుకు వెళ్లారు వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి. ప్రత్యేక హోదాపై ఒక్కటే స్టాండ్ మీద ఉండి, తమ పార్టీ ఎంపీలతో రాజీనామాలు కూడా చేయించారు. అంతేకాదు, చాలా విషయాల్లో ప్రజల పక్షాన నిలిచి వారికి అండగా ఉన్నారు. అందుకే ఈ సారి అవకాశం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్‌ లోని ఓటర్లు భావిస్తున్నారన్నది తెలిసిన విషయమే. ఇదే విషయాన్ని సర్వేలు కూడా స్పష్టం చేస్తున్నాయి.

ఏపీలో వైసీపీ విజయం తథ్యమన్న సంకేతాలు ఇప్పటికే జాతీయ స్థాయి వరకు వెళ్లిపోయాయి. అంతేకాదు, 25 ఎంపీ స్థానాలకు గానూ 18-21 చోట్ల వైసీపీ అభ్యర్థులే విజయం సాధించబోతున్నారని కూడా తెలుస్తోంది. మొత్తంగా రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టడంతో పాటు, కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో కూడా వైసీపీ అధినేత కీలకంగా మారే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు, కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ అంటూ దేశంలోని అన్ని పార్టీల నేతలను కలుస్తున్నారు. తాజాగా కాంగ్రెస్‌ తో సఖ్యతగా ఉండే డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌ తో భేటీ అయ్యారు. ఈ సమావేశం తర్వాత కేసీఆర్ కూడా కాంగ్రెస్ సారథ్యంలోని కూటమిలో కలుస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ.. జగన్‌ కు స్వయంగా ఫోన్ చేశారని విశ్వసనీయంగా తెలుస్తోంది.

వాస్తవానికి టీఆర్ ఎస్ కూడా బీజేపీతో సన్నిహితంగానే ఉందనేది బహిరంగ రహస్యమే. గతంలో జరిగిన చాలా పరిణామాలు దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఈ విషయంలో బీజేపీ అధిష్ఠానం కూడా ధీమాగానే ఉండేది. అలాంటిది కేసీఆర్.. కాంగ్రెస్ ఏజెంట్ పార్టీని కలవడంతోనే మోదీ.. జగన్‌ కు ఫోన్ చేశారని తెలిసింది. గులాబీ అధినేత నుంచి వాళ్లకు సహకారం ఉండే అవకాశాలు లేకపోవడంతోనే జగన్‌ నుంచి మద్దతు కావాల్సిందిగా ప్రధాని అడిగారనే టాక్ వినిపిస్తోంది. దీనికి రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఏపీకి ప్రత్యేక హోదా ఎవరు ఇస్తారో వాళ్లకే మద్దతు ఉంటుందని మోదీతో వైసీపీ అధినేత స్పష్టం చేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదే కనుక జరిగితే చంద్రబాబు ఐదేళ్ల కాలంలో చేయలేనిది జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే చేసే అవకాశాలు ఉంటాయి.