ముగ్గురు అధినేతలపై నోరు పారేసుకున్న నారాయణ

Tue Sep 29 2020 19:30:19 GMT+0530 (IST)

Narayana slammed the three chiefs

కామ్రేడ్ నారాయణ నోరు మామూలుగా ఉండదు. ఉన్నట్లుండి కస్సుమంటారు. భుజాలు.. భుజాలు రాసుకు పూసుకు తిరిగే ఎప్పుడేం మాట్లాడతారో అస్సలు అర్థం కాదు. గతంలోని వామపక్ష వాదులకు భిన్నంగా నారాయణగారి తీరు ఉంటుందన్న మాట తరచూ వినిపిస్తూ ఉంటుంది. నిత్యం నీతులు చెప్పే ఈ పెద్ద మనిషి.. ప్రజల మనసుల్ని ఎందుకు దోచుకులేకపోతున్నారో మాత్రం చెప్పరు. నారాయణలో ఉన్న ప్రత్యేకత ఏమంటే.. అప్పటివరకు నానా తిట్లు తిట్టేసి.. ఒక ఫైన్ మార్నింగ్ తాను విమర్శలతో కడిగేసిన పార్టీ అధినేతతోనే చెట్టాపట్టాలు వేసుకునే ట్రాక్ రికార్డు సొంతం.తాజాగా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. విపక్ష నేత చంద్రబాబు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒకేసారి హోల్ సేల్ గా చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ దుమారానికి కారణమయ్యే అవకాశం ఉందంటున్నారు. జైలుకు వెళతానన్న భయం ఏపీ సీఎం జగన్ లో ఉందని.. మోడీని నమ్మితే చంద్రబాబుకు పట్టిన ఘనతే జగన్ కు పడుతుందని హెచ్చరించారు. జగన్.. చంద్రబాబు.. పవన్ ల కారణంగా ఏపీ రాష్ట్రం తీవ్రంగా నష్టపోతుందన్నారు. వీరి ముగ్గురు కారణంగా రాష్ట్రానికి నష్టం వాటిల్లుతుందన్న ఆయన.. రైతులకు ఎంతో నష్టం కలిగించే వ్యవసాయ బిల్లుకు ఏపీ అధికార.. విపక్ష పార్టీలు మద్దతు పలకటం దారుణమన్నారు.

రాష్ట్రంలో అధికార.. విపక్ష నేతలు దివాలాకోరు రాజకీయాల్ని చేస్తున్నట్లుగా ఆరోపించిన నారాయణ.. ప్రధాని మోడీ కాళ్లను జగన్..బాబులు ఇద్దరూ పట్టుకున్నారన్నారు. పవన్ సైతం మోడీ కాళ్లను పట్టుకున్నట్లుగా వ్యాఖ్యానించారు. గత ఎన్నికల్లో బుద్ధి తక్కువై పవన్ ను తాము నమ్మినట్లుగా పేర్కొన్నారు. ఏపీ రాజధాని అమరావతే అన్న ఆయన.. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామన్న జగన్ చేతులు ఎత్తేశారన్నారు. ఒకేసారి హోల్ సేల్ గా ముగ్గురు ముఖ్య అధినేతలపై ఇంతలా నోరు పారేసుకున్న నారాయణ వ్యాఖ్యలపై ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.