2004లో.. జగన్ సీఎం అయి ఉంటే.. చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

Thu Jun 30 2022 20:04:46 GMT+0530 (India Standard Time)

Nara chandra babu comments on cm jagan

ఏపీ సీఎం జగన్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఏపీ సీఎంగా ఉన్న జగన్.. రాజధానిని సర్వం నాశనం చేశాడని.. దుయ్యబట్టారు. అదే ఉమ్మడి రాష్ట్రంలో తన తర్వాత.. ము ఖ్యమంత్రి అయి ఉంటే.. ఈ రాష్ట్రాన్ని జగన్ ఏం చేసేవాడో.. అంటూ.. బాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  ``తెలంగాణకు హైదరాబాద్ ఉన్నట్లు మనకు అమరావతి ఉండాలని భావించాను. 2019లో టీడీపీ ఓటమి వల్ల రాష్ట్రానికి తీవ్ర నష్టం జరిగింది`` అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.తాను విజన్ తో చేసిన పాలన కారణంగానే హైదరాబాద్ నేడు ఉన్నత స్థానంలో ఉందని చంద్రబాబు అన్నారు. ఇప్పుడు ఏపీలో అన్నీ కూల్చేస్తున్న ప్రాజెక్టులు ఆపేస్తున్న జగన్ లాంటి వాళ్లు.. 2004లో తన అనంతరం సీఎం అయ్యి ఉంటే హైదరాబాద్ ఏమయ్యి ఉండేదో అని చంద్రబాబు అన్నారు. హైటెక్ సిటీ ఐఎస్ బీ లాంటి వాటిని కూల్చేసి ఎయిర్ పోర్ట్ రింగ్ రోడ్ వంటి ప్రాజెక్టులను ఆపేసి ఉండేవారేమో అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

నా మీద కక్షతో రాజధాని అమరావతిని శ్మశానం చెయ్యాలని చూస్తున్న జగన్ కు అవకాశం వచ్చి ఉంటే... హైదరాబాద్ ను ఎంత నాశనం చేసేవారో అని చంద్రబాబు అన్నారు. ఇప్పుడు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రానికి ప్రధాన ఆదాయ వనరుగా ఉపాధి కేంద్రంగా అభివృద్దికి చిరునామా గా మారిందని చంద్రబాబు గుర్తు చేశారు. అమరావతి కూడా అలా ఉండాలని తాను భావించానని.. అందుకే అభివృద్ది చేశానని చంద్రబాబు అన్నారు.

ఉడతలపై జోకులు

గన్నవరం నియోజకవర్గం రామవరప్పాడు గ్రామానికి చెందిన బిసి సంఘాల నేతలు కార్యకర్తలు చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా చంద్రబాబు రాష్ట్రంలో పాలనా వైఫల్యాలపై మాట్లాడారు. ఉడతల కారణంగా కరెంట్ తీగలు తెగిపోవడం ఎలుకలు మద్యం తాగడం ప్రభుత్వ ఉద్యోగుల సొమ్ము ఉద్యోగుల అకౌంట్ల నుంచి మాయం అవడం ఈ ప్రభుత్వంలో మాత్రమే సాధ్యం అని చంద్రబాబు ఎద్దేవా చేశారు.

ఉద్యోగుల అకౌంట్లలో సొమ్ము మాయం అవ్వడానికి సిఎఫ్ఎంఎస్ విధానంలో లోపం కాదని....వైసిపి విధానంలోనే లోపమని చంద్రబాబు అన్నారు. తెలంగాణలో 10వ తరగతి పరీక్షల్లో 90 శాతం మంది విద్యార్థులు పాస్ అయితే.. ఏపీలో కేవలం 67 శాతం మంది మాత్రమే పాస్ అవ్వడమే నాడు నేడు కార్యక్రమమా అని చంద్రబాబు ప్రశ్నించారు.

2019 టీడీపీ ఓటమితో రాష్ట్రం ఎంత నష్టపోయిందో ఇప్పుడు ప్రత్యక్షంగా అంతా చూస్తున్నారని అన్నారు. ప్రజల్లో ఇప్పటికే తిరుగు బాటు మొదలయ్యిందని...అందుకే వైసిపి ఏ కార్యక్రమం మొదలు పెట్టినా జనం ఆదరించడం లేదని దుయ్యబట్టారు.