Begin typing your search above and press return to search.

చినబాబు పాదయాత్రలో చేయాల్సిన అతి పెద్ద పని అదే..?

By:  Tupaki Desk   |   4 Dec 2022 7:41 AM GMT
చినబాబు పాదయాత్రలో చేయాల్సిన  అతి పెద్ద పని అదే..?
X
చినబాబు కేరాఫ్ చంద్రబాబు అన్న ముద్ర నుంచి బయటపడేందుకు భారీ ఎత్తున పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ఈ పాదయాత్ర నారా లోకేష్ ని అసలు సిసలు నాయకుడిగా జనం ముందుకు తెస్తుంది అని అంచనా వేస్తున్నారు. ఏకంగా నాలుగు వేల కిలోమీటర్ల దూరం, నాలుగు వందల రోజుల పాటు సుదీర్ఘమైన ప్రయాణం ఒక విధంగా చూస్తే లోకేష్ రాజకీయ జీవితాన్ని మేలి మలుపు తిప్పేదిగా పాదయాత్రను డిజైన్ చేశారు.

లోకేష్ జనవరి 27న పాదయాత్ర మొదలుపెట్టనున్నారు. కుప్పం నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం దాకా ఆయన పాదయాత్ర సాగనుంది. ఈ మధ్యలో ఎన్నో నియోజకవర్గాలు, ఎన్నో ఊళ్ళు ఆయన టచ్ చేస్తారు. ఈ పాదయాత్ర ద్వారా ప్రజలకు ఆయన చెప్పబోయేది చాలా ఉంది. వైసీపీ సర్కార్ వైఫల్యాలను ఏకరువు పెట్టడమే కాదు, గతంలో టీడీపీ ఏలుబడిలో పేదలకు తాము చేసిన కార్యక్రమాలను మరోసారి గుర్తు చేయడం.

పేదలకు తమ ప్రభుత్వం వస్తే ఏం చేయబోతోంది విప్పి చెప్పడం, వారిని తిరిగి తమ పార్టీ వైపుగా ఆకట్టుకోవడం. ఇక వైసీపీకి స్ట్రాంగ్ హోల్డ్ గా ఉన్న రూరల్ సెక్టార్ ని పూర్తిగా టీడీపీ వైపుగా టర్న్ చేయడం, గ్రామాలలో చూసుకుంటే పధకాల ప్రభావం ఎక్కువగా ఉంది. వాటిలోని డొల్లతనాన్ని జనాలకు అర్ధమయ్యేలా చేస్తూ తమ ప్రభుత్వం ఏమేమి చేస్తుందో వివరించడం.

అలా కోల్పోయిన గ్రామీణ ఓటు బ్యాంక్ ని తిరిగి ఒడిసి పట్టడం. ఇంకో వైపు చూస్తే పార్టీ చెల్లాచెదురుగా ఉంది. చంద్రబాబు పై స్థాయిలో ఎంత చెబుతున్నా దిగువ స్థాయిలో నేతలు మాత్రం పట్టించుకోవడం లేదు. అలాంటి వారిలో కసి రగల్చడం, టీడీపీ అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకతను, చంద్రబాబు సీఎం అవుతాను అని అసెంబ్లీలో చేసిన శపధాన్ని గుర్తు చేయడం, ఇలా క్యాడర్ మొత్తం టీడీపీ వెంట నడిచేలా భాగస్వామ్యం అయ్యేలా చూడడం.

వీటి కంటే అతి పెద్ద బాధ్యత కూడా మరోటి ఉందిట. అదే పార్టీలో చాలా మంది నాయకుల మధ్యన ఐక్యత లేదు. వారిలో వారు కొట్టుకుంటున్నారు. తిట్తుకుంటున్నారు. టికెట్ విషయంలో కూడా పెద్ద ఎత్తున ఆధిపత్యం పోరు సాగుతోంది. వారసులు ఒక వైపు రెడీ అవుతూంటే యూత్ కూడా తమకు టికెట్ కావాలని అంటోంది. సీనియర్ నేతలు కొందరు ఎక్కడా తగ్గడంలేదు. ఎవరి రాజకీయం వారు చేస్తూ పోతున్నారు.

ఈ నేపధ్యంలో ఈ రకంగా ఉన్న తమ్ముళ్ల తగాదాలను కూడా తీచే అతి పెద్ద పని లోకేష్ మీద ఉంది అంటున్నారు. నిజానికి ఇప్పటి రాజకీయం చూసెత పదవి ఉండాలి. టికెట్ వస్తుంది అనుకుంటేనే ఎవరైనా పని చేస్తారు. లేకపోతే మనకెందుకు అని కాళ్ళు జాపేస్తారు. అలాంటి వారికి గీతోపదేశం చేసి పార్టీ అధికారంలోకి వస్తే అవకాశాలు ఎలా వస్తాయో వారికి తాము గుర్తు పెట్టుకుని ఎలా ఇస్తామో కూడా చెప్పాలి. మొత్తానికి చూస్తే లోకేష్ ముందు అతి పెద్ద సవాల్ ఉంది అంటున్నారు.

ఎందుకంటే చంద్రబాబు లాంటి ఉద్ధండ పిండం చెప్పినా కూడా పార్టీలో తమ్ముళ్ళు పట్టించుకోవడంలేదు. పైగా వారి గొడవలు అలాగే ఉన్నాయి. మరి ఈ స్థితిలో లోకేష్ వచ్చి మీరంతా ఒక్కటిగా ఉండాలి అని నీతి బోధ చేస్తే వింటారా అన్నది ఒక పాయింట్. మరో వైపు ఎప్పటికపుడు క్షేత్ర స్థాయిలో పార్టీ పరిస్థితిని అధినేత బాబుకు వివర్చించడానికి కూడా లోకేష్ పాదయాత్రను ఉపయోగించుకోబోతున్నారు అని అంటున్నారు.

లోకేష్ పాదయాత్ర సక్సెస్ కావాలీ అంటే తమ్ముళ్ళు అంతా ఒక త్రాటిమీదకు రావాలి. వారిని అలా కార్యోన్ముఖులను చేయాలి. అలా లోకేష్ ఒక వైపు జనాలతో పాటు మరో వైపు పార్టీ జనాలను కూడా ఏకం చేయడం, టీడీపీ దిశగా నడిపించడం మీదనే ఆయన పాదయాత్ర విజయం ఆధారపడి ఉంది అంటున్నారు.