Begin typing your search above and press return to search.

లోకేష్.. సిల్లీ వాదనల్లో తగ్గడం లేదు!

By:  Tupaki Desk   |   20 July 2019 4:27 AM GMT
లోకేష్.. సిల్లీ వాదనల్లో తగ్గడం లేదు!
X
'అమరావతిని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విజయవంతంగా అడ్డుకున్నారు..' అని ప్రకటించేశారు తెలుగుదేశం ఎమ్మెల్సీ నారా లోకేష్ బాబు. ఇంతకీ అమరావతిని జగన్ అడ్డుకోవడం ఏమిటి? దానికి బ్రహ్మాండమైన లాజిక్కులు చెప్పాడు లోకేష్. విశేషం ఏమిటంటే.. అధికారంలో ఉన్నప్పుడు ఏ మాటలను అయితే చెప్పాడో లోకేష్ ఇప్పుడూ అవే మాటలే చెప్పడం.

'దొంగ లెటర్లు రాయడం.. పంటలను తగలబెట్టించడం...' ఇలా జగన్ అమరావతిని అడ్డుకున్నారు అని లోకేష్ చెప్పుకొచ్చారు. ఈ వాదనలు చాన్నాళ్ల నుంచినే తెలుగుదేశం వాళ్లు వినిపిస్తూ ఉన్నారు. ప్రత్యేకించి పంటలు తగలబెట్టించడం విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పని అంటూ కేసులు కూడా పెట్టారు. అయితే ఆ కేసులను అధికారంలో ఉన్నప్పుడు ఏమీ తేల్చలేకపోయారు తెలుగుదేశం నేతలు. నిజంగా వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్లు ఆ పని చేసి ఉంటే.. అధికారాన్ని చేతిలో పెట్టుకున్నప్పుడు ఎందుకు నిరూపించలేదో లోకేష్ కే తెలియాలి.

ఆ వాదనను ఎన్నికల ముందు కూడా లోకేష్ వినిపించారు. అయితే అదే రాజధాని ప్రాంతంలో లోకేష్ ఎమ్మెల్యేగా నెగ్గలేకపోయారు. పంటలు తగలుబెట్టి ప్రాంతంలోనే లోకేష్ ఎమ్మెల్యేగా ఓడిపోయారు. అయినా లోకేష్ తీరులో మాత్రం మార్పు కనిపించడం లేదు.

ఇంకా అక్కడే ఆగిపోయాడాయన. ఇక దొంగ లెటర్లు అంటూ ప్రపంచబ్యాంకుకు వెళ్లిన ఫిర్యాదులను లోకేష్ ప్రస్తావించినట్టుగా ఉన్నారు. అయితే దొంగ లెటర్లు రాస్తే వాటిని గుర్తించలేనంత అమాయకమైనది ఏమీ కాదు ప్రపంచబ్యాంక్. అక్కడ పని చేసేది రాజకీయ నేతలు కాదు. ఆవలిస్తే పేగులు లెక్కపెట్టే మేధావులు అక్కడ ఉంటారు. వారు దొంగ లెటర్లకు కన్వీన్స్ అవుతారని వాదించడం లోకేష్ మేధావి తనాన్ని చాటుతూ ఉంది. ఇలాంటి సిల్లీ వాదనలే లోకేష్ మానుకుంటేనే ఆయనకే మేలు కావొచ్చని పరిశీలకులు అంటున్నారు.