Begin typing your search above and press return to search.

జగన్ చర్య..లోకేశ్ కు ఎంత ఫ్రస్ట్రేషన్ తెచ్చిందంటే?

By:  Tupaki Desk   |   27 Jan 2020 1:41 PM GMT
జగన్ చర్య..లోకేశ్ కు ఎంత ఫ్రస్ట్రేషన్ తెచ్చిందంటే?
X
శాసన మండలిని రద్దు చేస్తూ ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న కీలక నిర్ణయం... మండలి సభ్యుడిగా ఉన్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి - మాజీ మంత్రి నారా లోకేశ్ లో ఎంతటి ఫ్రస్ట్రేషన్ కు గురి చేసిందన్న విషయం ఇప్పుడు ఆసక్తి రేకెత్తిస్తోంది. మండలిని రద్దు చేస్తూ జగన్ నిర్ణయం తీసుకుంటే.. లోకేశ్ కు ఉన్న ఎమ్మెల్సీ పదవి ఒక్క దెబ్బకు ఊడిపోయింది కదా. అసెంబ్లీలోకి అడుగుపెట్టే యోగం ఇప్పటిదాకా లోకేశ్ కు కలగలేదు కదా. మొన్నటి ఎన్నికల్లో మంగళగిరి నుంచి బరిలోకి దిగిన లోకేశ్ ను వైసీపీ చిత్తుగా ఓడించిన సంగతి తెలిసిందే. ఎలాగూ లోకేశ్ కు ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచే సత్తా లేదని ముందే తెలుసుకున్నారో? ఏమో? తెలియదు గానీ.. చంద్రబాబు ఆయనను దొడ్డిదారిన మండలికి ఎంపిక చేశారన్న ఆరోపణలు ఇప్పటికే లోకేశ్ ను తీవ్ర ఇబ్బందులకు గురి చేసిన వైనం తెలిసిందే. ఈ క్రమంలో తనకున్న ఆ ఒక్క ఎమ్మెల్సీ పదవిని కూడా జగన్... మండలిని రద్దు చేస్తూ తీసేయడంతో నిజంగానే లోకేశ్ లో ఫ్రస్ట్రేషన్ ఓ రేంజికి చేరిపోయిందని చెప్పాలి.

ఈ క్రమంలో సోమవారం నాటి అసెంబ్లీలో మండలిని రద్దు చేస్తున్నట్లుగా జగన్ ప్రకటించారు. ఈ మాట వినినంతనే తన ట్విట్టర్ ఖాతా వేదికగా లోకేశ్ ఓ రేంజిలో విరుచుకుపడ్డారు. 38 బిల్లులు మండలికి వస్తే వాటిలో కేవలం రెండు బిల్లులకు సవరణలు ప్రతిపాదిస్తూ పంపామని, అదే సమయంలో మరో రెండు బిల్లులను మాత్రమే తిరస్కరించామని లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మాత్రానికే మండలిని రద్దు చేస్తారా? అంటూ ప్రశ్నించిన లోకేశ్... తక్షణమే జగన్ కేబినెట్ లోని ఇద్దరు ఎమ్మెల్సీలతో మంత్రి పదవులకు రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా వైసీపీకి ఉన్న మరో ఏడుగురితో ఎమ్మెల్సీ పదవులకు రాజీనామాలు చేయించాలని, ఇటీవల టీడీపీ నుంచి వైసీపీలోకి జంప్ కొట్టిన మరో ఇద్దరు ఎమ్మెల్సీలతోనూ రాజీనామాలు చేయించాలని లోకేశ్ డిమాండ్ చేశారు.

అంతటితో ఆగని లోకేశ్... జగన్ పై ఓ రేంజిలో విరుచుకుపడ్డారు. రెండు బిల్లులను తిరస్కరించిన మండలిని రద్దు చేసిన జగన్... తనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వలేదని కోర్టులను కూడా రద్దు చేస్తారా? అని తనదైన శైలి ఫ్రస్ట్రేషన్ ను చూపించుకున్నారు. అంతేకాకుండా ప్రతి శుక్రవారం తాను కోర్టుకు హాజరు కావాల్సిన దుస్థితిపై మదనపడుతున్న జగన్.. మండలి మాదిరే ఏకంగా శుక్రవారాన్నే రద్దు చేసేస్తారా? తనను కోర్టు ముందు నిలబెడుతున్న శుక్రవారాన్ని రద్దు చేసేసి... ఏడు రోజుల వారాన్ని ఆరు రోజుల వారంగా మార్చేస్తారా? అంటూ ఓ రేంజి వ్యాఖ్యలు చేశారు. మొత్తంగా మండలిని రద్దు చేసేస్తూ... తన ఎమ్మెల్సీ పదవిని పీకేసిన జగన్ పై తనదైన శైలి ఫ్రస్ట్రేషన్ ను చూపిన లోకేశ్... ఈ తరహా వ్యాఖ్యలు చేశారన్న వాదనలు వినిపిస్తున్నాయి.