Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ వికృత పోకడను ప్రజలు గమనిస్తున్నారు: చంద్ర‌బాబు ఫైర్

By:  Tupaki Desk   |   27 Jun 2022 2:30 AM GMT
జ‌గ‌న్ వికృత పోకడను ప్రజలు గమనిస్తున్నారు:  చంద్ర‌బాబు ఫైర్
X
ఏపీ ప్ర‌భుత్వంపై టీడీపీ అధినేత చంద్ర‌బాబు తీవ్ర‌స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రాష్ట్రంలో జ‌రుగుతున్న ప‌రిణామాల‌పై ప్ర‌జ‌లు ఇబ్బంది ప‌డుతున్నా.. అధికార పార్టీ నేత‌ల దూకుడుతో ఉద్యోగులు అవ‌మానాల‌కు, దెబ్బ‌ల‌కు గుర‌వుతున్నా.. ప్ర‌భుత్వం నిమ్మ‌కు నీరెత్తిన‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని.. చంద్ర‌బాబు తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. ఈ క్ర‌మంలో ప్ర‌జ‌లు స‌మ‌యం చూసుకుని వైసీపీని అంతే విధంగా దెబ్బ‌కొడ‌తార‌ని.. చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు. ఈ మేర‌కు ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు.

ఏమ‌న్నారంటే..

రాష్ట్రంలో గ‌త రెండురోజుల్లో జరిగిన రెండు ఘటనలు ప్రభుత్వ దుర్మార్గాన్ని చాటి చెపుతున్నాయి. శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలంలో సచివాలయ ఉద్యోగి వాసుదేవరావుపై సర్పంచ్ భర్త గున్నయ్య దాడిచేశారు. ప్రకాశం జిల్లా అల్లూరులో మంత్రిని సమస్యలపై ప్రశ్నించారని కవిత అనే మహిళ ఇంటికి కరెంట్ తొలగించి పాలు, నీళ్లు కూడా అందకుండా చేశారు. రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీ అహంకారానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? ఉద్యోగులు, ప్రజల పట్ల వైసిపి గూండాలు వ్యవహరించిన తీరు ఒకటైతే...దాన్ని సమర్థించిన ప్రభుత్వం తీరు మరింత విస్తుగొలుపుతుంది. అని చంద్ర‌బాబు విమ‌ర్శించారు.

పోయేకాలం వ‌చ్చింది..

అధికారం నుంచి దిగిపోయేకాలం దాపురించి కన్నుమిన్ను కానకుండా వ్యవహరిస్తున్న వైసిపి రాక్షసులు వీటన్నింటికీ ఎప్పటికైనా మూల్యం చెల్లించుకుంటారని చంద్ర‌బాబు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. సిగ్గున్న ప్రభుత్వం అయితే శ్రీకాకుళంలో దివ్యాంగ ఉద్యోగిపై దాడి, ప్రకాశం జిల్లాలో మహిళపై వేధింపులకు తలదించుకోవాలని అన్నారు. వెంటనే కారకులపై చర్యలు తీసుకోవాల‌ని చంద్ర‌బాబు డిమాండ్ చేశారు. బాధితులను క్షమాపణ కోరాల‌న్నారు. `` ప్రజలు మీ ప్రభుత్వ ప్రతి వికృత పోకడను గమనిస్తున్నారనేది తెలుసుకోవాలి.`` అని సీఎం జ‌గ‌న్‌ను ఉద్దేశించి చంద్ర‌బాబు పేర్కొన్నారు.