Begin typing your search above and press return to search.

చంద్రబాబుకు షాక్ తప్పదా ?

By:  Tupaki Desk   |   22 May 2022 5:30 AM GMT
చంద్రబాబుకు షాక్ తప్పదా ?
X
చంద్రబాబునాయుడుకు షాక్ తప్పేట్లు లేదు. అభ్యర్ధులను ముందుగా ప్రకటించే ప్రక్రియకు శ్రీకారం చుట్టిన చంద్రబాబు తాజాగా కర్నూలు జిల్లా పర్యటనలో డోన్ అభ్యర్థిగా ధర్మవరం సుబ్బారెడ్డిని ప్రకటించారు. సుబ్బారెడ్డి గెలుపుకు పార్టీ నేతలు, కార్యకర్తలందరూ కృషి చేయాలన్నారు. టీడీపీ అభ్యర్ధిగా సుబ్బారెడ్డి బుల్లెట్ లాగ దూసుకువెళ్ళటం ఖాయమని, గెలుపుపై తనకు అనుమానాలు లేవని కూడా చెప్పారు.

అయితే చంద్రబాబు పర్యటన పూర్తయి రెండు రోజులు కూడా గడవకముందే పెద్ద షాక్ కొట్టేట్లుంది. కారణం ఏమిటంటే చంద్రబాబు నిర్ణయంతో మనస్తాపం చెందిన కేఈ కుటుంబం పార్టీకి రాజీనామా చేయబోతోందని పార్టీలోను, జిల్లాలో ఒక్కసారిగా చర్చ పెరిగిపోయింది. పార్టీ ఏదైనా డోన్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి కేఈ కుటుంబమే 1989 నుండి పోటీ చేస్తున్నారు. గెలుపోటములతో సంబంధంలేకుండా నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని ఉన్న కేఈ కుటుంబానికి నియోజకవర్గంలో బలమైన మద్దతుదారులున్నారు.

కేఈ కుటుంబం ఏపార్టీలో ఉంటే ఆ పార్టీలోకి వాళ్ళ మద్దతుదారులు కూడా మారిపోతుంటారు. మొన్నటి ఎన్నికల్లో కూడా టీడీపీ తరపున కేఈ ప్రభాకర్ పోటీచేసి ఓడిపోయారు. గడచిన మూడేళ్ళుగా ప్రభాకర్ నియోజకవర్గంలో యాక్టివ్ గానే ఉన్నారు. ఇదే సమయంలో సుబ్బారెడ్డి కూడా యాక్టివ్ అవటంతో గ్రూపుల గోల మొదలైంది. సుబ్బారెడ్డి వర్గంతో కేఈ వర్గం గొడవలకు దిగటంతో ప్రభాకర్ కు చంద్రబాబు వార్నింగ్ కూడా ఇచ్చారట.

అంటే సుబ్బారెడ్డికే చంద్రబాబు మద్దతుందని ప్రభాకర్ కు అర్ధమైపోయింది. అప్పటినుండే మద్దతుదారులతో రెగ్యులర్ గా సమావేశాలు పెట్టుకుంటున్నారట. ఈ నేపధ్యంలోనే జిల్లా పర్యటనలో చంద్రబాబు హఠాత్తుగా డోన్ అభ్యర్ధిగా సుబ్బారెడ్డిని ప్రకటించటం కేఈ కుటుంబానికి షాక్ కొట్టినట్లయ్యింది. దాంతో చంద్రబాబు జిల్లా దాటి వెళ్ళిపోగానే అర్జంటుగా తమ మద్దతుదారులతో కేఈ కుటుంబం సమావేశమైందట. ఎలాగూ అభ్యర్ధిని కూడా ప్రకటించేసిన కారణంగా ఇక చంద్రబాబును కలిసి ఉపయోగం లేదని, అలాగే పార్టీలో ఉండికూడా ఉపయోగం లేదని నిర్ణయానికి వచ్చినట్లు జిల్లాలో చెప్పుకుంటున్నారు. అందుకనే పార్టీకి కేఈ కుటుంబం రాజీనామా చేయబోతున్నట్లు బాగా ప్రచారం జరుగుతోంది.