Begin typing your search above and press return to search.

వివేకా హత్య కేసులో వ్య‌తిరేకంగా వాదించిన వారికి రాజ్య‌స‌భ సీటా? : చంద్ర‌బాబు నిల‌దీత‌

By:  Tupaki Desk   |   18 May 2022 2:38 PM GMT
వివేకా హత్య కేసులో వ్య‌తిరేకంగా వాదించిన వారికి రాజ్య‌స‌భ సీటా?  :  చంద్ర‌బాబు నిల‌దీత‌
X
కడప జిల్లాలో పర్యటించిన టీడీపీ అధినేత చంద్రబాబు వైసీపీ రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఏపీలో రాజ్యసభకు అర్హులైనవారే లేరా అని జగన్‌ను సూటిగా ప్రశ్నించారు. రాజ్యసభ సీట్లు రెండు తెలంగాణ, రెండు ఆంధ్రాకు ఇచ్చి సమ న్యాయం చేశారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. అందులో కూడా ఇద్దరు తెలుగుదేశం మాజీలు, మరో ఇద్దరు ఆయనకు కావాల్సిన వాళ్లని టీడీపీ అధినేత చెప్పారు.

ఆయనకు కావాల్సిన ఇద్దరిలో ఒకరు వివేకా హత్య కేసులో ప్రత్యేక లాయర్‌గా వ్యవహరించి ఆ కేసు మీద పోరాడిన వ్యక్తని.. అనుకూలంగా కాదని, వ్యతిరేకంగా అని.. అలాంటి వ్యక్తి అయిన నిరంజన్‌ రెడ్డిని జగన్ రాజ్యసభకు పంపిస్తున్నారని చంద్రబాబు చెప్పారు. బీసీ నాయకుడు ఆర్‌.కృష్ణయ్య, మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్‌ రావు, ఏలేటి నిరంజన్‌ రెడ్డిలకు రాజ్యసభ చాన్స్‌ ఇచ్చారు. ఇప్పటికే రాజ్యసభ సభ్యుడిగా ఉన్న విజయ సాయిరెడ్డిని మరోసారి పెద్దల సభలో కొనసాగించాలని నిర్ణయించారు. నలుగురిలో ఇద్దరు బీసీలు కాగా... మిగిలిన ఇద్దరు జగన్‌ సొంత సామాజిక వర్గానికి చెందిన వారు.

ఆర్‌.కృష్ణయ్య, బీద మస్తాన్‌ రావు ఇద్దరూ గతంలో టీడీపీ నుంచి ఎమ్మెల్యేలుగా నెగ్గిన వారే కావడం విశేషం. 2014లో ఆర్‌.కృష్ణయ్య ఎల్‌బీనగర్‌ నుంచి తెలంగాణ శాసన సభకు ఎన్నికయ్యారు. అప్పట్లో ఆయనను చంద్రబాబు నాయుడు ‘ముఖ్యమంత్రి అభ్యర్థి’గా కూడా ప్రకటించారు. ఇక... బీద మస్తాన్‌ రావు కావలి నుంచి 2009లో టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ కండువా కప్పుకొన్నారు.

తెలంగాణకు చెందిన నిరంజన్‌ రెడ్డి సీఎం జగన్‌కు వ్యక్తిగత న్యాయవాది. జగన్‌పై ఉన్న అక్రమాస్తుల కేసులను ఆయన వాదిస్తున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనను ఏపీలో ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది గా నియమించారు. లక్షలకు లక్షలు ఫీజులు కూడా చెల్లించారు. ఇటీవల విడుదలైన ‘ఆచార్య’ చిత్ర నిర్మాతల్లో నిరంజన్‌ రెడ్డి కూడా ఒకరు! ఇక... విజయసాయి రెడ్డి జగన్‌ కుటుంబ కంపెనీల ఆడిటర్‌గా దశాబ్దాలుగా సేవలు అందిస్తున్నారు.

వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆయన ఇప్పటికే రాజ్యసభ సభ్యుడు! వచ్చేనెలలో ఆయన పదవీకాలం ముగియనుంది. ఇప్పుడు.. జగన్‌ ఆయనకు మరో అవకాశమిచ్చారు. ఇప్పుడు ఎంపిక చేసిన నలుగురు అభ్యర్థుల్లో... బీద మస్తాన్‌ రావు, విజయ సాయిరెడ్డి ఇద్దరూ నెల్లూరు జిల్లాకు చెందిన వారే కావడం విశేషం. ఈ ఎంపిక స‌రిగాలేద‌ని.. త‌న‌కు ఫేవ‌ర్ చేసేవారికి.. త‌న గుత్తాధిప‌త్యానికి కొమ్ము కాసేవారికి ప‌ద‌వులు ఇచ్చార‌ని.. చంద్ర‌బాబు మండిప‌డ్డారు.