జగన్.. బాబు.. ఒకేచోట ఉన్నా ఎదురుపడకుండా కూర్చున్నారు

Tue Aug 16 2022 09:59:48 GMT+0530 (IST)

Nara Chandrababu Naidu And Ys Jagan

పంద్రాగస్టు.. జనవరి 26.. ఈ రెండు సందర్భాల్లో ఆయా రాష్ట్రాల గవర్నర్లు 'ఎట్ హోం' పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించటం.. ఆ సందర్భంగా ముఖ్యమంత్రి.. విపక్ష నేతతో సహా ప్రజాప్రతినిధులు.. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు.. ప్రత్యేక ఆహ్వానితుల్ని గవర్నర్ పిలుస్తారు. దీంతో ఈ కార్యక్రమానికి ఆహ్వానం అందుకున్న వారు తప్పనిసరిగా హాజరవుతుంటారు. ఈసారి పంద్రాగస్టు నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. విపక్ష నేత చంద్రబాబుతో పాటు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ఆహ్వానం అందింది. దీంతో.. ఒకే ఫ్రేమ్ లోకి ముగ్గురు ముఖ్యనేతలు వచ్చే వీలుందన్న అభిప్రాయంతో పాటు ఆసక్తి వ్యక్తమైంది. అయితే.. ఏపీ ఎట్ హోంలో ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకున్నాయి.ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ నిర్వహించిన ఎట్ హోం కార్యక్రమానికి ముందుగా అనుకున్నట్లే ముఖ్యమంత్రి.. విపక్ష నేత ఇద్దరూ హాజరయ్యారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాత్రం రాలేదు. ఆయన ఎందుకు హాజరు కాలేదన్న దానిపై సమాచారం రాలేదు. ఇక.. సీఎంజగన్ తో పాటు ఆయన సతీమణి భారతి.. పలువురు మంత్రులు.. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు హాజరు కాగా.. విపక్ష నేత చంద్రబాబుతో పాటు.. ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుతో పాటు పలువురు టీడీపీ నేతలు హాజరయ్యారు.

ఇరువురు అగ్రనేతలు ఒకే చోటకు.. ఒకే సమయంలో హాజరైనప్పటికీ.. వీరిద్దరూ ఒకరికి ఒకరు ఎదురు పడకుండా కూర్చోవటం విశేషం. ప్రధాన టేబుల్ వద్ద సీఎం జగన్ దంపతులు.. గవర్నర్ దంపతులు.. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పీకే మిశ్రా దంపతులు కూర్చోగా.. వేదిక ఎడమ వైపు టేబుల్ వద్ద ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు.. అచ్చెన్నాయుడు.. ఎంపీ కేశినేని నాని.. అశోక్ బాబు తదితరులు కూర్చున్నారు. తన ఆహ్వానం మన్నించి ఎట్ హోంకు వచ్చిన అతిధులందరిని గవర్నర్ పలుకరించారు. ఆయనే స్వయంగా అతిధులు కూర్చున్న టేబుళ్ల వద్దకు వెళ్లి పలుకరించారు. మొత్తంగా కార్యక్రమం ఆహ్లాదంగా ముగిసింది.