దగ్గరోళ్లను చేసుకోవద్దు..నన్నపనేని హెచ్చరిక!

Wed Jul 17 2019 16:51:31 GMT+0530 (IST)

టీడీపీ హయాంలో ఫైర్ బ్రాండ్ గా వెలుగువెలిగి మాటల తూటాలు పేల్చే  ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి తాజాగా మరోసారి షాకింగ్ కామెంట్స్ తో వార్తల్లో నిలిచారు. మేనరికపు వివాహాలపై ఆమె చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. విశాఖ జిల్లా ప్రహ్లాదపురం నూకాలమ్మ గుడి వద్ద ఇటీవలే పుట్టిన ఇద్దరు అంగవైకల్యపు పిల్లలకు విషమిచ్చి ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ కుటుంబాన్ని పరామర్శించిన నన్నపనేని ఈ సందర్భంగా వారి మరణానికి దగ్గరి బంధువులను చేసుకోవడం.. మేనరికపు సంబంధమే కారణమని ఆరోపించారు.ఈ ఇద్దరు అంగవైకల్యపు పిల్లలు పుట్టడానికి.. ఆ మహిళా పిల్లలతో ఆత్మహత్యకు మేనరికపు సంబంధమే కారణమని నన్నపనేని స్పష్టం చేశారు. కుటుంబ సభ్యుల ద్వారా ఇదే విషయం తెలుసుకున్న నన్నపనేని ఏపీ వ్యాప్తంగా దీనిపై ప్రచారం చేస్తానని.. దగ్గరి వాళ్లను చేసుకోవద్దని రూల్ కూడా పెడుతామని స్పష్టం చేశారు.

దేశంలో - రాష్ట్రంలో మేనమామ - మేన కోడలిని  చేసుకునే సంప్రదాయం అనాదిగా ఉంది. ఇప్పటికీ ఆ చుట్టరికాలు కొనసాగుతూనే ఉంటాయి. ఇలా చేసుకున్న దంపతులకు జన్యుపరమైన లోపాలతో పిల్లలు పుడతారు. చెవి - మూగ - అంగవైకల్యం బారిన పడుతారు. ఇలానే మేనరికపు వివాహం చేసుకున్న ఓ మహిళ తనకు పుట్టిన వైకల్య పిల్లలను చంపి తను తనువు చాలించింది. ఈ నేపథ్యంలో మేనరికపు వివాహాల రద్దు కోసం పోరాడుతానని నన్నపనేని స్పష్టం చేసింది.