Begin typing your search above and press return to search.

అచ్చెన్న పై నాని ఫైర్.. సాక్షిది తప్పన్న జగన్

By:  Tupaki Desk   |   10 Dec 2019 7:41 AM GMT
అచ్చెన్న పై నాని ఫైర్.. సాక్షిది తప్పన్న జగన్
X
ఏపీ అసెంబ్లీలో సన్నబియ్యంపై చర్చ కాకరేపింది. మంత్రి కొడాలి నాని.. టీడీపీ శాసనసభాపక్ష ఉప నేత అచ్చెన్నాయుడు మధ్య మాటల యుద్ధం నడించింది. సన్నబియ్యంపై ప్రశ్నించిన అచ్చెన్నాయుడుపై తీవ్ర పదజాలంతో మంత్రి నాని తిట్టిపోశారు. ఆ వ్యాఖ్యలు దుమారం రేపడం.. అచ్చెన్న సహా టీడీపీ ఎమ్మెల్యేలు ఆందోళన చేయడంతో స్పీకర్ తమ్మినేని రికార్డుల నుంచి తొలగించారు.

ఇక వైసీపీ అధికారంలోకి వస్తే సన్నబియ్యం ఇస్తామని హామీ ఇచ్చారని టీడీపీ ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, రామానాయుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దీనిపైన సాక్షి పత్రిక లో కూడా వార్త వచ్చిందని టీడీపీ ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి సూచించారు.

దీనికి సమాధానం ఇచ్చిన పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని వివరణ ఇస్తూ ఫైర్ అయ్యారు. తాము ఎప్పుడూ సన్నబియ్యం ఇస్తామని చెప్పలేదని.. కేవలం నాణ్యమైన బియ్యం ఇస్తామని చెప్పామని వివరించారు. దీనికి టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్న అడ్డుచెప్పి నాలెడ్జ్ లేదా అని మంత్రి నానిని అనడంతో వాగ్వాదం నడిచింది.అచ్చెన్నపై మంత్రి నాని తీవ్ర పదజాలంతో దూషించాడు.

ఈ వివాదం ముదరడంతో సీఎం జగన్ జోక్యం చేసుకొని వివరణ ఇచ్చారు. తాము మేనిఫెస్టోలో సన్నబియ్యం ఇస్తామని ఎక్కడా చెప్పలేదని మేనిఫెస్టో కాపీని సభకు చూపించారు. అయినా సన్నబియ్యంను శ్రీకాకుళంలో ప్రారంభించామని.. వచ్చే ఏప్రిల్ నుంచి 1400 కోట్లతో రాష్ట్రమంతా ప్రారంభిస్తామని తెలిపారు.

ఈ సందర్భంగా సన్నబియ్యంపై టీడీపీ ఎమ్మెల్యేలు తప్పు మాట్లాడారని.. సాక్షి పత్రికలో కూడా తప్పు రాశారని సీఎం జగన్ చెప్పుకొచ్చారు. మీ పత్రికల్లో ఏ రకమైన వార్త వచ్చిందో చూడాలని సూచించారు. ఈ సందర్భంగా తాను గతంలో అన్న మాటలను వీడియోలో సభకు జగన్ చూపించారు.