Begin typing your search above and press return to search.

బాబును అరెస్ట్ చేస్తేనే..ప్రజాప్రతినిధులపై దాడులు ఆగుతాయట!

By:  Tupaki Desk   |   24 Feb 2020 2:50 PM GMT
బాబును అరెస్ట్ చేస్తేనే..ప్రజాప్రతినిధులపై దాడులు ఆగుతాయట!
X
నవ్యాంధ్రప్రదేశ్ రాజధానిని అమరావతిలోనే కొనసాగించాల్సిందేనంటూ రెండు నెలలకు పైగా జరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో అమరావతిలో నిత్యం ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ క్రమంలో ప్రజాప్రతినిధులు... ప్రత్యేకించి అధికార పార్టీ ప్రజాప్రతినిధులపై దాడులు కూడా చోటుచేసుకుంటున్నాయి. ఈ తరహా దాడులు ఆగాలంటే... టీడీపీ అధినేత - విపక్ష నేత నారా చంద్రబాబునాయుడును అరెస్ట్ చేయాల్సిందేని వైసీపీ నేత - బాపట్ల ఎంపీ నందిగం సురేశ్ డిమాండ్ చేశారు. ఆదివారం నాడు అమరావతి పరిధిలో నందిగంపై అమరావతి జేఏసీ మహిళలు దాడికి యత్నించిన సంగతి తెలిసిందే. ఈ దాడితో అమరావతిలో ఆదివారం రాత్రి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనపై వైసీపీ - టీడీపీ పోటాపోటీగా ఫిర్యాదులు చేసుకున్నాయి.

ఈ క్రమంలో నందిగం సురేశ్ సోమవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి... తనపై జరిగిన దాడిని వివరించారు. అంతేకాకుండా తనపై దాడికి దిగింది అమరావతి మహిళా రైతులు కాదని, టీడీపీకి చెందిన వ్యక్తులే తనపై దాడికి దిగారని ఆయన ఆరోపించారు. మహిళలను ముందు పెట్టి టీడీపీ ప్రజాప్రతినిధులపై దాడికి దిగుతోందని కూడా నందిగం ఆరోపించారు. ఆదివారం నాటి దాడి తనపై జరిగిన రెండో దాడి అని కూడా నందిగం వివరించారు. ఈ తరహా దాడులు ఆగాలంటే.. విపక్ష నేత చంద్రబాబును అరెస్ట్ చేయాల్సిందేనని, అప్పుడే దాడులు ఆగుతాయని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతి జేఏసీ పేరిట టీడీపీ గూండాలను ప్రజాప్రతినిధులపైకి చంద్రబాబు ఉసిగొల్పుతున్నారని కూడా నందిగం ఆరోపించారు. అమరావతిలో కొనసాగుతున్న నిరసనలన్నీ... టీడీపీ పెయిడ్ ఉద్యమాలేనని నందిగం సంచలన వ్యాఖ్యలు చేశారు.

కేవలం తన సామాజిక వర్గానికి లబ్ధి చేకూర్చుకునేందుకే చంద్రబాబు అమరావతి జేఏసీ పేరిట ఉద్యమాలు నడిపిస్తున్నారని కూడా నందిగం సురేశ్ ఆరోపించారు. చంద్రబాబును అరెస్ట్ చేస్తే... అమరావతి పరిధిలో నిత్యం రణరంగంగా మారుతున్న పరిస్థితులు శాంతిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. అమరావతిలో పరిస్థితులన్నీ చక్కబడాలంటే చంద్రబాబును తక్షణమే అరెస్ట్ చేయాలని కూడా నందిగం డిమాండ్ చేశారు. తనపై దాడి జరిగిన సమయంలో మహిళలు చేతుల్లో కారం పట్టుకుని తమ చొక్కాలు పట్టుకుని దారుణంగా వ్యవహరించారని, ఈ తరహా దాడులు చంద్రబాబు నేతృత్వంలో రూపకల్పన జరిగినవేనని నందిగం ఆరోపించారు. మరి చంద్రబాబును అరెస్ట్ చేయాలంటూ నందిగం చేసిన డిమాండ్ పై జగన్ సర్కారు ఎలా స్పందిస్తుందో చూడాలి.