బిగ్ బాస్ హీట్..నాగ్ కు గట్టిగానే తగిలిందబ్బా!

Wed Jul 17 2019 23:06:13 GMT+0530 (IST)

స్టార్ మా ఛానెల్ లో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ షోపై ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద రచ్చే జరుగుతోంది. ఈ షోలో పాలుపంచుకునే కంటెస్టెంట్ల వ్యక్తిగత వివరాలను సేకరించే క్రమంలో నిర్వాహకులు అసభ్యంగా ప్రవర్తిస్తున్నారంటూ టీవీ యాంకర్ శ్వేతారెడ్డి - నటి గాయత్రి గుప్తాలు ఆరోపణలు చేయడంతో పాటు ఏకంగా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇప్పుడు బిగ్ బాస్ పై నీలి నీడలు అలముకున్నాయనే చెప్పాలి. బిగ్ బాస్ -3 హోస్ట్ గా వ్యవహరించేందుకు సిద్ధమైపోయిన టాలీవుడ్ హీరో నాగార్జున అక్కినేనికి కూడా ఈ సెగ ఇప్పుడు గట్టిగానే తగిలిందని చెప్పక తప్పదు. ఏకంగా తన ఇంటి ఎదుట మహిళలు పెద్ద ఎత్తున నిరసనకు దిగడంతో నాగ్ ీ షోలో కొనసాగుతారా? అన్న అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి.అయినా నాగ్ ఇంటి వద్ద ఆందోళన సందర్భంగా ఏం జరిగిందన్న విషయానికి వస్తే... మహిళలను కించపరిచే విధంగా బిగ్ బాస్ నిర్వాహకులు వ్యవహరిస్తున్నారంటూ శ్వేతారెడ్డి - గాయత్రి గుప్తలు పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో... మహిళలను కించపరిచే ఇలాంటి షోను తక్షణమే రద్దు చేయాలని - అంతేకాకుండా ఇప్పటికే ఈ షోకు హోస్ట్ గా వ్యవహరించేందుకు ఒప్పందం కుదుర్చుకున్న నాగార్జున తక్షణమే ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకుని షో నుంచి తప్పుకోవాలని ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన పలువురు విద్యార్థులు బుధవారం మధ్యాహ్నం ఓ ప్రకటన విడుదల చేశారు. అటు బిగ్ బాస్ నిర్వాహకుల నుంచి గానీ ఇటు నాగ్ నుంచి తమకు స్పష్టమైన హామీ లభించని పక్షంలో నిరసనలకు కూడా దిగుతామని వారు హెచ్చరికలు జారీ చేశారు.

అయితే సాయంత్రం దాకా కూడా అటు నిర్వాహకుల నుంచి గానీ - ఇటు నాగ్ నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవడంతో అనుకున్నట్లుగానే వర్సిటీ విద్యార్థినీలు పెద్ద సంఖ్యలో నాగ్ ఇంటి వద్దకు చేరుకున్నారు. అయితే అప్పటికే అక్కడ పెద్ద సంఖ్యలో మోహరించిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ సందర్బంగా నాగ్ ఇంటి సమీపంలో పెద్ద రచ్చే చోటుచేసుకుంంది. మహిళలను అవమానించేలా ఉన్న షో నుంచి నాగ్ తప్పుకోవాల్సిందేనని నినదించిన విద్యార్థినీలు... బిగ్ బాస్ షోను కూడా నిషేదించాలని పెద్ద పెట్టున నినిదాలు చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. నేరుగా తన ఇంటి వద్దకే మహిళలు వచ్చి నిరసన వ్యక్తం చేసిన నేపథ్యంలో నాగ్ ఈ షో నుంచి తప్పుకుంటారా? లేదంటే తాను కుదుర్చుకున్న ఒప్పందం మేరకు షోలో కంటిన్యూ అవుతారా? విషయంపై ఇప్పుడు ఆసక్తికర చర్చ నడుస్తోంది.