ఎన్టీయార్ ప్లస్ వైఎస్సార్... ?

Sun Jan 30 2022 08:00:01 GMT+0530 (IST)

NTR and YSR

ఏపీని పాలిచిన వారు ఎందరో మహనీయులు ఉన్నారు. అలాంటి వారిలో ఆంధ్ర రాష్ట్రం తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం అపరిమితమైన ప్రజాదరణ కలిగిన నేతగా చెప్పుకునేవారు. ఆ తరువాత కూడా చాలా మంది ప్రజలలో గొప్ప పేరు తెచ్చుకున్నారు. అయితే ప్రజాకర్షణలో ఎన్టీయార్ ని మించిన వారు లేరు అన్నది చెప్పాలి. ఆయన అద్భుతమైన సినీ నటుడు కావడమే కాకుండా రాజకీయాల్లో నటించలేదు అందుకే ఆయన మహా నాయకుడిగా జనం గుండెల్లో ఉన్నారు.ఇక ఆయన తరువాత వైఎస్సార్ కూడా జనం గుండె చప్పుడు విన్నారు. ఆయనకు ఉన్నది పొలిటికల్ గ్లామర్ మాత్రమే. అయినా కూడా ఆయన తనదైన పాలనతో ఉమ్మడి ఏపీ ప్రజాల హృదయాలలో చిరకీర్తిని సంపాదించుకున్నారు. ఇక ఏపీలో ఈ ఇద్దరు నాయకుల ఇమేజ్ తో  రెండు ప్రాంతీయ  పార్టీలు ఉన్నాయి. వైఎస్సార్ లెగసీని జగన్ కంటిన్యూ చేస్తూంటే ఎన్టీయార్ వారసుడిగా కంటే తనదైన రాజకీయంతోనే చంద్రబాబు కొనసాగుతున్నారు.

ఇక్కడ ఒక విచిత్రమైన పరిస్థితి టీడీపీలో ఉంది. ఎన్టీయార్ కి నట వారసుడిగా బాలయ్య జూనియర్ ఎన్టీయార్ ఉన్నారు. మరి రాజకీయాల్లో మాత్రం అల్లుడు చంద్రబాబు ఉన్నారు. ఆయనను వారసుడిగా నిజమైన ఎన్టీయార్ అభిమానులు అంగీకరించరని ఒక వాదన అయితే  ఎపుడూ ముందుకు తెస్తూ ఉంటారు.  ఇక చంద్రబాబు విషయం తీసుకుంటే ఆయన ఎన్టీయార్ కంటే ముందే రాజకీయాల్లో ఉన్నారు. మంత్రిగా కూడా పనిచేశారు.

దాంతో ఆయన ఎన్టీయార్ ని పార్టీ వ్యవస్థాపకుడిగా గౌరవిస్తారు. తన నాయకత్వ దక్షతతోనే ముందుకు సాగుతూ వస్తున్నారు. ఈ నేపధ్యంలో ఎన్టీయార్ కి అసలైన వారసులం తామేనని చెప్పుకోవడానికి వైసీపీ చూస్తోంది. నిజానికి ఎన్టీయార్ పొలిటికల్ బౌండరీస్ ఎపుడో దాటేశారు. ఆయన కాంగ్రెస్ తన ప్రత్యర్ధిగా రాజకీయాల్లో చెప్పుకున్నా ఆయన బతికున్న రోజుల్లో కూడా ఆయన అభిమానులు కాంగ్రెస్ లో నిండా ఉండేవారు.

ఇపుడు వైసీపీలో కూడా ఎన్టీయార్ కరడు కట్టిన అభిమానులు ఉన్నారు. అందులో మంత్రిగా కొడాలి నాని ఉన్నారు. ఆయన చిత్రంగా ఎన్టీయార్ బొమ్మతో పాటు వైఎస్సార్ బొమ్మను పెట్టుకుని ముందుకు సాగుతారు. ఇపుడు ఆయన ఎన్టీయార్ జిల్లాను తమ ప్రభుత్వం ప్రకటించడంతో అన్న గారికి నిజమైన వారసులం తామేనని అంటున్నారు.  అదే విధంగా ఎన్టీయార్ కి చంద్రబాబు నాయకత్వాన టీడీపీ ఏమీ చేయలేదని కూడా విమర్శిస్తున్నారు

ఇక ఎన్టీయార్ తో పాటు వైఎస్సార్ కి కూడా భారత రత్న ఇవ్వాలని ఆయన కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఈ విధంగా ఎన్టీయార్ని వైఎస్సార్ ని కలిపే పాలిటిక్స్ కి కొడాలి నాని ద్వారా వైసీపీ తెర తీస్తోంది అంటున్నారు. టీడీపీ అభిమానులందు అన్న గారి అభిమానులు వేరయా అన్న నీతిని అనుసరించి వారిని ఆకట్టుకోవాలని వైసీపీ చూస్తోంది అంటున్నారు.

ఏపీలో బలమైన సామాజికవర్గాన్ని అలా ఆకట్టుకుంటే వచ్చే ఎన్నికల్లో తమ రాజకీయం విజయవంతం అవుతుంది అన్న లెక్కలు అయితే వైసీపీ వేసుకుంటుంది అంటున్నారు. అయితే జిల్లాకు పేరు పెట్టినంతమాత్రాన ఎన్టీయార్ ఫ్యాన్స్ వైసీపీ వైపు మళ్ళరని టీడీపీ నాయకులు అంటున్నారు. ఎన్టీయార్ తమ వాడే అని కూడా చెప్పుకుంటోంది. మొత్తానికి 2024 ఎన్నికల్లో వైఎస్సార్ తో పాటు ఎన్టీయార్ ని కూడా కలుపుకుని ముందుకు పోవాలని చూస్తున్న వైసీపీ ప్రయత్నాలు ఎంతవరకూ ఫలిస్తాయో చూడాలి.