Begin typing your search above and press return to search.

ఆ ఎన్టీయార్ కి ఈ ఎన్టీయార్ కీ దూరమేనా..?

By:  Tupaki Desk   |   26 Sep 2022 2:30 AM GMT
ఆ ఎన్టీయార్ కి ఈ ఎన్టీయార్ కీ దూరమేనా..?
X
విజయవాడలోని హెల్త్ వర్శిటీకి ఎన్టీయార్ పేరు తొలగించడం పెద్ద ఎత్తున రాజకీయ చిచ్చునే రేపుతోంది. అయితే ఈ విషయంలో అధికార వైసీపీ కంటే విపక్ష టీడీపీయే ప్రధాన బాధితురాలుగా మారుతోందా అన్న చర్చ సాగుతోంది. ఈ పేరు మార్పు వ్యవహారం తరువాత సీనియర్ ఎన్టీయార్ తో పాటు జూనియర్ ఎన్టీయార్ కూడా ప్రస్తుత టీడీపీకి దూరం అయ్యారా అన్నదే కీలకమైన పాయింట్ ఇపుడు.

అదెలా అంటే ఎన్టీయార్ వర్శిటీ పేరు మార్పుపై సహజంగా టీడీపీ అగ్గిమీద గుగ్గిలం అయింది. అది అవాలి కూడా. అయితే టీడీపీ రియాక్షన్ ఇలాగే ఉంటుందని ముందే ఊహించిన వైసీపీ అలనాటి వెన్నుపోటు ఎపిసోడ్ ని తెర మీదకు తెచ్చి ఆ పార్టీని బాది బాది మరీ బదనాం చేస్తోంది. బాబు నుంచి బాలయ్య వరకూ టోటల్ నారా నందమూరి ఫ్యామిలీనే అన్న గారిని మోసం చేసిన వారి జాబితాలో కట్టేసి రచ్చ రచ్చ చేస్తోంది.

దాంతో అఫెన్స్ ఆడాల్సిన టీడీపీ డిఫెన్స్ లో పడినట్లు అయింది. ఇపుడు చూస్తే విజయవాడ నడి వీధుల్లో మరో విషయం చోటు చేసుకుంది. వియ్ డొంట్ నీడ్ ఎన్టీయార్ అంటూ ఆనాడు అంటే 1995 సెప్టెంబర్ 1న గద్దెనెక్కిన చంద్రబాబు డెక్క‌న్ క్రానికల్ కి ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు పెట్టిన హెడ్డింగ్ తో సహా ఆ న్యూస్ పేపర్ జిరాక్స్ లు తీసి పెద్ద పోస్టర్లుగా విజయవాడలో అంతటా అంటించేశారు.

అంటే ఎన్టీయార్ నుంచి సీఎం పోస్టుని లాక్కున్న చంద్రబాబు ఆయనను ఘాటుగా విమర్శిస్తూ ఆనాడు ఇచ్చిన ఇంటర్వ్యూ విజయవాడ నలుమూలల్లోనూ ఇపుడు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు అన్న మాట. అయితే ఇది ఎవరు చేశారన్నది తెలియకపోయినా టీడీపీకి ఇబ్బందే అవుతుంది అంటున్నారు.

ఇవన్నీ కూడా విజయవాడలోని కీలకమైన ప్రాంతాలు అయిన రమేష్ హాస్పిటల్స్, బెంజ్ సర్కిల్, సిద్ధార్థ్ కాలేజీ, సత్యనారాయణపురం, గన్నవరం, కృష్ణలంక, పటమట, అజిత్‌సింగ్ నగర్, విద్యాధరపురం, గవర్నరు పేట వంటి చోట్ల దర్శనం ఇచ్చాయి. రేపటి నుంచి విజయవాడలో దస‌రా ఉత్సవాలు ఉన్నాయి.

ఏపీ అంతా విజయవాడలోనే ఉంటుంది. అంటే బహు సులువుగా చంద్రబాబు నాడు ఎన్టీయార్ ని విమర్శించి ఎలా పక్కన పెట్టారన్నది జనాలకు తెలియచెప్పే ఉద్దేశ్యంతోనే ఇదంతా చేశారు అని అంటున్నారు. అయితే ఇలా పోస్టర్లు వేసింది ఎవరో మాత్రం తెలియడంలేదు అని అంటున్నారు.

ఇక జూనియర్ ఎన్టీయార్ విషయానికి వస్తే ఆయన ఎన్నికల వేళకు అయినా టీడీపీకి ప్రచారానికి వస్తారు అని అనుకుంటే ఆయన చేసిన ట్వీట్ మీదనే ట్రోలింగ్స్ చేయిస్తూ ఆయన్ని కార్నర్ చేయాలని చూశారు. మరి ఎవరో తెలియదు కానీ దీని వల్ల జూనియర్ కి టీడీపీకి మధ్య అతి పెద్ద గ్యాప్ ఏర్పడిపోయింది. 2024 ఎన్నికల వేళకు జూనియర్ కనీస‌మైనా గా కూడా ఈ వైపు చూసే సీన్ అయితే ఉండదు అంటున్నారు. ఏకంగా జూనియర్ ఎన్టీయార్ కులాన్ని ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులు అన్నీ కూడా హర్ట్ అయ్యేలా ఉన్నాయి.. దాని వల్ల టీడీపీకి ఆయన్ని బాగా దూరం చేశాయనే అంటున్నారు.

ఇపుడు టోటల్ గా విశ్లేషిస్తే ఒక్క వర్శిటీకి పేరు మార్పు వల్ల అధికార పార్టీ ఎటూ విమర్శల పాలు అవుతోంది. కానీ పొలిటికల్ గా చూస్తే టీడీపీ అటు సీనియర్ ఎన్టీయార్ ని సొంతం చేసుకోలేక ఇటు జూనియర్ ఎన్టీయార్ ని దగ్గరకు తీసుకోలేక రెండిందాలా చెడుతోందా అంటే ప్రస్తుతానికి ఇదే సీన్ కనిపిస్తోంది. ఆ మీదట ఏం జరుగుతుంది అన్న దానికి కాలమే జవాబు చెప్పాలి.