Begin typing your search above and press return to search.

హెల్త్ వర్శిటీ టోటల్ చేంజ్ : పేరు మార్పు వెనక పక్కా వ్యూహం...?

By:  Tupaki Desk   |   25 Sep 2022 9:21 AM GMT
హెల్త్ వర్శిటీ టోటల్ చేంజ్ : పేరు మార్పు వెనక పక్కా వ్యూహం...?
X
ఏపీలో ఇపుడు హెల్త్ వర్శిటీ మీదనే హాట్ హాట్ డిస్కషన్ సాగుతోంది. విజయవాడ నడిబొడ్డున ఉన్న ఈ విశ్వవిద్యాలయానికి మూడున్నర దశాబ్దాల సుదీర్ఘ చరిత్ర ఉంది. ఏపీలో ఎన్టీయార్ హయంలో దీంతో పాటు తిరుపతిలోని పద్మావతి వర్శిటీ కూడా ఏర్పాటు అయింది. ఈ నేపధ్యంలో అనేక ప్రాజెక్టులు కూడా ఏపీలో రూపుదిద్దుకోబోతోన్నాయి. పోలవరం ప్రాజెక్ట్ కి డాక్టర్ వైఎస్సార్ పేరు పెడతామని ఇప్పటికే వైసీపీ నాయకులు ప్రకటించారు. అక్కడ వైఎస్సార్ భారీ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు రచిస్తున్నారు.

వైసీపీ స్వయంగా అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. అందులో ఏ కొన్ని పూర్తి అయినా వైఎస్సార్ పేరు పెట్టుకోవచ్చు. కానీ ఏరి కోరి మరీ డాక్టర్ ఎన్టీయార్ వర్శిటీ మీదనే ఎందుకు ఫోకస్ చేశారు అంటే దాని వెనక చాలా కధ ఉందని ప్రచారం సాగుతోంది. అలాగే ఆషామాషీగా పేరు మార్పు జరగలేదని పక్కా వ్యూహం కూడా ఉందని అంటున్నారు. ఇంతకీ ఆ కధ ఏంటి అన్నది చూస్తే చిత్రమే అనిపిస్తుంది.

ఎన్టీయార్ వర్శిటీ లో ముఖ్యమంత్రి జగన్ ఫోటో ఎక్కడా కనబడదు అని అంటున్నారు. జగన్ ఏపీకి సీఎం. ఆయన ఫోటో ప్రతి ప్రభుత్వ ఆఫీసుల్లోనూ ఉంటుంది, ఉండాలి ఇది ప్రోటోకాల్. కానీ దానికి భిన్నంగా ఈ హెల్త్ వర్శిటీలో మూడేళ్ళు గడచినా జగన్ ఫోటో మాత్రం పెట్టలేదు అని ప్రచారంలో అయితే ఉంది. అదే అసలు వివాదానికి కారణం అని కూడా చెబుతున్నారు.

అక్కడ పేరుకుపోయిన కొందరు స్వజాతీయులు వారి సొంత కులాభిమానం మమతానురాగాలతోనే ఇదంతా చేస్తున్నారు అని చెబుతున్నారు. రాజకీయ పార్టీలను ప్రజలు ఎన్నుకుంటారు. ఏ ప్రభుత్వం ఆయుష్షు అయినా అయిదేళ్ళే. నచ్చినా నచ్చకపోయినా ప్రజాస్వామ్యంలో వారిని ప్రభువులుగా గుర్తించాలి. కానీ మేము గుర్తించమని మొండికేస్తే పరిస్థితి వేరేగా ఉంటుంది.

అలా కొన్ని చోట్ల జరగడం వల్లనే ఇపుడు ఇంతటి విపరీత నిర్ణయాలకు కారణం అయింది అని అంటున్నారు. అంతే కాదు అక్కడ పాలన కూడా పూర్తిగా కొందరి కనుసన్ననలోనే సాగుతోందని కూడా అంటున్నారు. దీంతో టోటల్ గా మార్చి మొత్తం హెల్త్ వర్శిటీని ప్రక్షాళన చేసే దిశగానే ప్రభుత్వం నడుం బిగించింది అని అంటున్నారు.

అందులో తొలి అడుగుగా ఏకంగా పేరు మార్పు చేశారని చెబుతున్నారు. దీని వల్ల రాజకీయ దుమారం చెలరేగుతుంది అని కూడా ఊహించినా చేశారు అంటే ఏది ఎలా జరిగినా తట్టుకుందేందుకే అని అంటున్నారు. ఇదిలా ఉండగా ఈ వర్శిటీలో పాతుకుపోయిన వారిని కదిపేయడం, క్షేత్ర స్థాయి నుంచి సమూలమైన మార్పులు తీసుకురావడం ముందు ముందు జరగబోయే పరిణామాలు అని అంటున్నారు. అలాగే ఏపీలో ఉన్న మొత్తం మెడికల్ కాలేజీలు అన్నీ ఈ వర్శిటీ గొడుకు కిందకే చేరుతాయి కాబట్టి ఇక్కడ బాధ్యులను తగిన వారిని ఎంపిక చేయడం ద్వారా పూర్తిగా ప్రక్షాళన చేస్తారని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.