రెండు వెన్నుపోట్లు...ఎన్నో నిజాలు...?

Thu Jan 20 2022 09:00:02 GMT+0530 (IST)

NTR 26th Death Anniversary

అన్న గారు కనుల ముందు లేకుండా అపుడే ఇరవై ఆరేళ్ళు గడచిపోయాయి. ఆయన 1996 జనవరి 18న తనువుని విడిచి కానరాని లోకాలను పయనమయ్యారు. ఎన్టీయార్ అంటేనే తెలుగు జాతికి ఒక బలమైన  శక్తిగా అంతా భావిస్తారు. తెలుగు వారికి రాజకీయ ప్రముఖులుగా టంగుటూరి ప్రకాశం తరువాత అంతటి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న మహనీయుడుగా ఎన్టీయార్ ని చూస్తారు. ఎన్టీయార్ అన్న మూడు అక్షరాలు కొన్ని దశాబ్దాల పాటు అటు సినీ రంగాన్ని ఇటు రాజకీయ రంగాన్ని ఊపేశాయి.ఎన్టీయార్ మూడున్నర దశాబ్దాల పాటు సినీ రంగంలో రారాజుగా వెలిగారు. ఇక రాజకీయాల్లో చూసుకుంటే ఆయన కేవలం పద్నాలుగేళ్ళు మాత్రమే ఉన్నారు. అందులోనే మూడు సార్లు ముఖ్యమంత్రిగా  ఏడున్నరేళ్ళ పాటు కొనసాగారు. ఎన్టీయార్ రాజకీయ జీవితం బహు చిత్రంగా ఉంటుంది. ఆయన సినిమా నటుడిగా ఉన్నపుడు మూడు షిఫ్టులు పనిచేసేవారు. ఏ రోజూ వార్తా పత్రికను చదివే అలవాటు ఆయనకు లేదని సన్నిహితులు చెబుతారు. ఆ టైమ్ ని కూడా ఆ సినిమా కోసమే కేటాయించేవారుట.

ఇక రాజకీయాల పొడ ఆయనకు గిట్టేది కాదని అప్పటికే ఒకమారు పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసిన జగ్గయ్య గుమ్మడి లాంటి వారి సెట్స్ లో వర్తమాన  రాజకీయాల గురించి మాట్లాడుకుంటే ఎన్టీయార్ ఆ ప్రస్థావన ఎందుకు అనేవారని చెప్పుకునేవారు. అలాంటి ఎన్టీయార్ భవన వెంకటరామ్ సీఎం గా ప్రమాణ స్వీకారం చేస్తే దానికి కోరి మరీ వచ్చి అదంతా చూశారు. ఆయనకు ముఖ్యమంత్రి విలాసం ఏంటి అన్నది అలా ఆలోచనకు వచ్చిందని అంటారు.

ఇక ఎన్టీయార్ దానికంటే ముందు అప్పటికి సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా ఉన్న చంద్రబాబుని తన అల్లుడిగా చేసుకున్నారు. అలా ఆయన చుట్టూ కొంత రాజకీయ వాతావరణం ఏర్పడింది. ఇల ఆయన 1982 మార్చి 28న టీడీపీని స్థాపిస్తున్నట్లుగా ప్రకటించారు. అది కొన్ని గంటల్లోనే దేశమంతా ఆ రోజుల్లో దావానలంగా వ్యాపించింది. ఇక ఎన్టీయార్ ప్రభజనం అలా మొదలై 1983 జనవరి 9న ఆయన సీఎం గా ప్రమాణం చేసేంతదాకా కొనసాగింది.

ఎన్టీయార్ వైద్య సేవల నిమిత్తం అమెరికా టూర్ లో ఉండగా తొలిసారి ఆయన మీద రాజకీయ కుట్ర జరిగింది. ఆయన తిరిగి వచ్చేసాక ఆగస్ట్ 16న ఆయన పదవిని కోల్పోయారు. ఆయనకు వెన్నుపోటు పొడిచి ఆయన క్యాబినేట్ సహచరుడు నాదెండ్ల భాస్కరరావు ముఖ్యమంత్రి అయ్యారు. అయితే నెల రోజుల పాటు నాడు సాగిన ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమానికి కేంద్ర పెద్దలు తలవొగ్గి తిరిగి ఆయంకే పట్టం కట్టారు. అలా సెప్టెంబర్ 16న ఎన్టీయార్ మళ్ళీ సీఎం అయ్యారు.

ఆ తరువాత అసెంబ్లీని రద్దు చేసి 1985 మార్చిలో జరిగిన ఎన్నికల్లో ఎన్టీయార్ బంపర్ మెజారిటీతో మళ్ళీ సీఎం అయ్యారు. ఇక 1989లో డిసెంబర్లో వచ్చిన ఎన్నికల్లో ఎన్టీయార్ తొలిసారి ఓటమి పాలు అయ్యారు. అదే ఎన్టీయార్ 1994 డిసెంబర్ లో జరిగిన ఎన్నికల్లో అద్భుతమైన విజయాన్ని సాధించి మూడవ సారి సీఎం అయ్యారు.

ఇక తొలిసారి వెన్నుపోటు జరగకపోయి ఉంటే ఏం జరిగేది అన్నది కనుక చూసుకుంటే ఎన్టీయార్ పాలనాపరమైన కొన్ని విధానాల వల్ల జనాల్లో వచ్చిన వ్యతిరేకత కారణంగా షెడ్యూల్ ప్రకారం 1988లో ఎన్నికలు జరిగితే ఎన్టీయార్ ఓడిపోయేవారు అని చెబుతారు. అలా కాకుండా మధ్యలో దించేయడం వల్ల ఎన్టీయార్ కి విపరీతమైన సానుభూతి వచ్చి ఆయన పొలిటికల్ కెరీర్ ఇంకా పెద్ద ఎత్తున కొనసాగేలా అది ఉపయోగపడింది అంటారు.

ఇక రెండవ వెన్నుపోటు ఫ్యామిలీ మెంబర్స్ ద్వారానే జరిగింది. టీడీపీని రక్షించుకోవడం కోసం అని చిన్నల్లుడు చంద్రబాబు పావులు కదిపితే పెద్దల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు కూడ చేయి కలిపారు. ఇక కుమారులు కుమార్తెలు కూడా ఎన్టీయార్ కి ఎదురు నిలిచారు.దాంతో  ఎన్టీయార్ పదవిని 1995 ఆగస్ట్ 31న కోల్పోయారు. ఆ మరుసటి రోజు అంటే సెప్టెంబర్ 1న చంద్రబాబు ఉమ్మడి ఏపీ సీఎం అయ్యారు

ఈ వెన్నుపోటు కనుక జరగకపోయి ఉంటే ఎన్టీయార్ దేశానికి ప్రధాని అయ్యేవారు అని అంతా గట్టిగా నమ్ముతారు. 1996లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో టీడీపీ మెజారిటీ సీట్లు సాధించింది. అప్పట్లో కాంగ్రెస్ వీక్ గా ఉంది. బీజేపీకి బలం లేదు. దాంతో మూడవ ఫ్రంట్ నేతగా అన్న గారు దేశానికి నాయకత్వం వహించేవారు. కానీ కుటుంబ సభ్యులు తొందర పడ్డారా లేక రాజకీయమే అలా మారిందా తెలియదు కానీ ఎన్టీయార్ చనిపోయేలా ఆ పరిణామాలు దారి తీశాయి. ఆత్మగౌరవం మెండుగా ఉండే ఎన్టీయార్ తన సొంత ఫ్యామిలీనే ఎదురు నిలిచేసరికి తట్టుకోలేకపోయారు అంటారు.

ఇక ఎన్టీయార్ రాజకీయ జీవితం చూస్తే ఆయన మూడు సార్లు అధ్బుతమైన మెజారిటీ సాధించి సీఎం అయినా కూడా ఏ టెర్మ్ లోనూ అయిదేళ్ళ పాటు పూర్తి స్థాయిలో పదవిని అనుభవించలేదు. అలాగే ఆయన జాతీయ రాజకీయాల ఆకాక్ష అలాగే ఉండిపోయింది.1989లో ఆయన ఏర్పాటు చేసిన నేషనల్ ఫ్రంట్ గెలిచినా ఏపీలో టీడీపీ ఓడిపోవడంతో ఆయన తెర వెనకే ఉండిపోవాల్సి వచ్చింది. మొత్తానికి ఎగిసిపడిన రాజకీయ కెరటంగానే ఎన్టీయార్ ని చూడాలి.