Begin typing your search above and press return to search.

స‌రిహ‌ద్దులో సంచ‌ల‌నం: అన్న‌ల‌కు స‌ర‌ఫ‌రా చేస్తున్న రూ.కోట్లు ప‌ట్టివేత‌

By:  Tupaki Desk   |   4 Jun 2020 5:33 PM GMT
స‌రిహ‌ద్దులో సంచ‌ల‌నం: అన్న‌ల‌కు స‌ర‌ఫ‌రా చేస్తున్న రూ.కోట్లు ప‌ట్టివేత‌
X
తెలంగాణ‌ - మ‌హారాష్ట్ర‌ - చ‌త్తీస్‌ ఘ‌డ్ స‌రిహ‌ద్దుల మ‌ధ్య మావోయిస్టుల హ‌వా కొన‌సాగుతూ ఉంటున్న విషయం తెలిసిందే. అట‌వీ ప్రాంతం భారీగా ఉండ‌డంతో అన్న‌లు స్థావ‌రంగా ఏర్పాటుచేసుకుని కేంద్ర‌ - రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు స‌వాల్‌ గా మారారు. వారు రోజురోజుకు బ‌లోపేతం కావ‌డానికి కార‌ణం వారిప‌ట్ల ఉన్న సానుభూతిప‌రులు - మ‌ద్ద‌తుదారులు, అభిమానులు వారికి స‌హాయం చేస్తుంటారు. వారికి పెద్ద ఎత్తున నిధులు అందుతుంటాయి. తాజాగా వారికి భారీగా న‌గ‌దు స‌ర‌ఫ‌రా చేస్తున్న ఇద్ద‌రు అరెస్ట్ అయ్యారు. వారి నుంచి ఏకంగా రూ.1.2కోట్ల న‌గ‌దును స్వాధీనం చేసుకోవ‌డం సంచ‌ల‌నంగా మారింది. పెద్ద ఎత్తున డ‌బ్బు సమకూర్చుతున్నారనే ఆరోపణలపై తెలంగాణకు చెందిన ఇద్దరు కాంట్రాక్టర్లు గురువారం అరెస్టయ్యారు. తెలంగాణ-మ‌హారాష్ట్ర రాష్ట్రాల స‌రిహ‌ద్దులో వారిని అరెస్టు చేశారు.

పోలీసుల వివరాల ప్రకారం.. మ‌హారాష్ట్రలోని గ‌డ్చిరోలి అట‌వీ ప్రాంతంలో ఉంటోన్న మావోయిస్టులకు ఇద్దరు కాంట్రాక్టర్లు భారీగా డబ్బు అందించేందుకు రాత్రివేళ కారులో వెళ్లారు. దీనిపై పోలీసుల‌కు ముందే స‌మాచారం అందింది. దీంతో తెలంగాణ నుంచి మ‌హారాష్ట్రలోకి ప్రవేశించి కొంతదూరం రాగానే మ‌హారాష్ట్ర పోలీసులు గుర్తించి వారిని ఆపి తనిఖీలు చేపట్టారు. వారు ప్ర‌యాణిస్తున్న కారులో త‌నిఖీలు చేయ‌గా రూ.1.2 కోట్ల న‌గ‌దు క‌నిపించింది.

పెద్ద మొత్తం నగదు ఉండ‌డంతో పోలీసులు స్వాధీనం చేసుకుని వారిని పోలీస్‌స్టేష‌న్‌కు త‌ర‌లించారు. ఆ ఇద్దరు కాంట్రాక్టర్లతో పాటు ఒక మహీంద్రా స్కార్పియో వాహనం, రెండు సెల్‌ఫోన్లను మ‌హారాష్ట్ర పోలీసులు సీజ్ చేశారు. వారిద్ద‌రూ తెలంగాణ‌లో కాంట్రాక్టర్లుగా గుర్తించారు. అయితే ఆ న‌గ‌దు మావోయిస్టుల‌కు చేర‌వేస్తున్నార‌ని, తాము అడ్డుకోకపోయి ఉంటే మావోయిస్టులకు ఆ న‌గ‌దు వెళ్లిపోయేద‌ని పోలీసులు చెబుతున్నారు. అసాంఘిక శ‌క్తుల‌కు స‌హ‌కారం అందిస్తున్నార‌నే విష‌యమై వారిపై కేసులు న‌మోదు చేసే అవ‌కాశం ఉంది. ఈ ఘ‌ట‌న‌పై ద‌ర్యాప్తు చేస్తున్నట్లు మ‌హారాష్ట్ర పోలీసులు తెలిపారు. ఆ సొమ్మును ఏ లక్ష్యంతో వారు తరలిస్తున్నారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే త‌మ‌కు మావోయిస్టుల నుంచి బెదింపు కాల్స్ రావ‌డంతోనే కాంట్రాక్టర్లు డబ్బు సమకూర్చేందుకు వెళ్తున్నట్లుగా పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు.