ఎన్ కౌంటర్ పై NHRC రహస్య విచారణ

Sun Dec 08 2019 12:41:51 GMT+0530 (IST)

దిశ హంతకుల ఎన్ కౌంటర్ పై లోతైన విచారణ చేయాలని ఢిల్లీ నుంచి వచ్చిన జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్.హెచ్.ఆర్.సీ) సభ్యులు నిర్ణయించారు. ఈ మేరకు సోమవారం వరకూ రాష్ట్రంలోనే ఉండి ఎన్ కౌంటర్ పై సమగ్ర విచారణ జరుపనున్నారు.తొలిరోజు శనివారం ఎన్ కౌంటర్ లో చనిపోయిన నలుగురి మృతదేహాలను పరిశీలించారు. పోస్టు మార్టం చేసిన వైద్యులతో మూడున్నర గంటలపాటు భేటి అయ్యి వివరాలు అడిగి తెలుసుకున్నారు. హైదరాబాద్ నుంచి ఫోరెన్సిక్ నిపుణులను పిలిపించి మరీ పోస్టుమార్టంపై లోతైన విచారణ చేశారు. పోస్టుమార్టం నివేదికను అధ్యయనం చేశారు. ఆ తర్వాత షాద్ నగర్ లో ఎన్ కౌంటర్ జరిగిన చటాన్ పల్లి స్థలాన్ని పరిశీలించారు.

ఈరోజు ఆదివారం మృతుల తల్లిదండ్రులతో సమావేశం కానున్నారు. సోమవారం రాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారులు ఎన్ కౌంటర్ చేసిన పోలీసులతో సమావేశమయ్యే అవకాశాలున్నాయని పోలీస్ వర్గాలు తెలిపాయి. విచారణ పూర్తయ్యాక సోమవారం సాయంత్రం  లేదా మంగళవారం ఉదయం తిరిగి ఢిల్లీకి వెళ్లనున్నారు.

ఎన్ కౌంటర్ పై నిజానిజాలను తెలుసుకునేందుకు మానవ హక్కుల సంఘం ప్రతినిధులు రహస్యంగా విచారణ జరపడం గమనార్హం. వైద్యులు పోలీసు ఉన్నతాధికారులు తప్ప ఎవరినీ లోపలికి అనుమతించలేదు. మీడియాతోనూ మాట్లాడలేదు. మరి వీరి విచారణలో ఎన్ కౌంటర్ బూటకమా.? నిజమైనదా అన్నది మంగళవారం తెలిసే అవకాశం ఉంది.