Begin typing your search above and press return to search.

సీమ ప్ర‌త్యేక రాష్ట్రంగా ఉంటే.. మైసూరా కీల‌క వ్యాఖ్య‌లు

By:  Tupaki Desk   |   21 July 2021 12:30 PM GMT
సీమ ప్ర‌త్యేక రాష్ట్రంగా ఉంటే.. మైసూరా కీల‌క వ్యాఖ్య‌లు
X
తెలుగు రాష్ట్రాల మ‌ధ్య మొద‌లైన‌ జ‌ల వివాదం.. చినికి చినికి గాలివాన‌గా మారిన సంగ‌తి తెలిసిందే. వివాదం లేఖ‌ల యుద్ధం దాటి.. సుప్రీం చెంత‌కు చేర‌డం.. ఆ త‌ర్వాత కేంద్రం గెజిట్ విడుద‌ల చేయ‌డం జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. అయితే.. ఈ విష‌యంపై మాజీ ఎంపీ, సీనియ‌ర్ రాజ‌కీయ నాయ‌కుడు మైసూరారెడ్డి స్పందించారు. హైద‌రాబాద్ లో నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో రెండు రాష్ట్రాల జ‌ల వివాదంపై మాట్లాడుతూ రెండు రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల తీరుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రాయ‌ల‌ సీమ ప్ర‌త్యేక రాష్ట్రంగా ఉంటే.. ప‌రిస్థితి మ‌రోలా ఉండేద‌ని కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

కేవ‌లం రాజ‌కీయ ల‌బ్ధికోస‌మే ఇద్ద‌రు ముఖ్య‌మంత్రులు ఘ‌ర్ష‌ణ‌కు దిగార‌ని, దానివ‌ల్ల రాయ‌ల‌సీమ నీటి ప్రాజెక్టుల‌ను గంద‌ర‌గోళంలోకి నెట్టేశార‌ని మైసూరారెడ్డి ధ్వ‌జ‌మెత్తారు. ఇద్ద‌రు సీఎంలు కూర్చొని మాట్లాడుకుంటే స‌మ‌స్య ప‌రిష్కారం అవుతుంద‌న్న ఆయ‌న‌.. వీరికి ఎందుకు భేష‌జాలు అడ్డు వ‌స్తున్నాయ‌ని ప్ర‌శ్నించారు.

వీరిద్ద‌రూ తెగేదాక లాగ‌డం వ‌ల్లనే ప‌రిస్థితి ఇంత‌దాకా వ‌చ్చింద‌ని ధ్వ‌జ‌మెత్తారు. కేంద్ర ప్ర‌భుత్వం జారీచేసిన గెజిట్ వ‌ల్ల రాయ‌ల‌సీమ‌కు తీవ్ర న‌ష్టం జ‌రుగుతుంద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఈ నోటిఫికేష‌న్ సీమ ప్రాంతానికి గొడ్డ‌లిపెట్టు వంటిద‌ని అన్నారు. ఈ ప‌రిస్థితి ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు మంచిది కాద‌ని అన్నారు.

ఈ ప‌రిస్థితి వ‌ల్ల‌.. రాయ‌ల‌సీమ ప్ర‌త్యేక రాష్ట్రం అంశం తెర‌పైకి వ‌స్తోంద‌ని అన్నారు. త‌మ‌కు కూడా రాష్ట్రం ఏర్ప‌డితే ఈ ప‌రిస్థితి వ‌చ్చేది కాద‌నే అభిప్రాయం జ‌నాల్లో ఉద్భ‌విస్తోంద‌ని అన్నారు. కేంద్రం ఇచ్చిన ఈ గెజిట్ ను రాష్ట్ర ప్ర‌భుత్వం ఆహ్వానించ‌డం పూర్తిగా త‌ప్పేన‌ని మండిప‌డ్డారు.