Begin typing your search above and press return to search.

మటన్ వ్యాపారి ఇంట్లో పార్టీ.. హైదరాబాద్ కు కొత్త గుబులు

By:  Tupaki Desk   |   27 May 2020 5:30 AM GMT
మటన్ వ్యాపారి ఇంట్లో పార్టీ.. హైదరాబాద్ కు కొత్త గుబులు
X
ఒక చిన్న తప్పు.. భారీ మూల్యాన్ని చెల్లించాల్సిన పరిస్థితి. ఒకరు తప్పు చేస్తే.. అక్కడితో ఆగకుండా దాని ప్రభావం వందలాది మంది మీద పడటమే కాదు.. అదో గొలుసులా మారటం అన్నింటికంటే పెద్ద సమస్య. మాయదారి రోగాన్ని నిలువరించే విషయంలో యావత్ ప్రపంచం కిందామీదా పడుతున్న దానికి కారణంగా.. ఒక్కరితో మొదలయ్యే గొలుసు.. చూస్తుండగానే భారీ గొలుసుగా మారిపోవటమే.

అందుకే భౌతిక దూరంతో పాటు.. విందులు.. వినోదాలు లాంటి వాటికి చెక్ పెట్టం.. ఎక్కువమంది ఒకే చోట జమ కాకూడదని ప్రభుత్వం నెత్తినోరు కొట్టుకుంటోంది. కానీ.. మితిమీరిన ఆత్మవిశ్వాసం.. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న వేళ.. తమకేం కాదన్న పనికిమాలిన భరోసా ఇప్పుడు అందరికి ఇబ్బందిగా మారుతోంది. తాజగా హైదరాబాద్ శివారులోని పహాడీషరీఫ్ లో జరిగిన ఒక వేడుక ఇప్పుడు కొత్త గుబులును రేపుతోంది.

పహాడీషరీఫ్ లో ఒక మటన్ వ్యాపారి కుటుంబం నివాసం ఉంటోంది. వీరి కుటుంబ సభ్యులు.. బంధువులు ఏటా వేసవిలో ఒకేచోటకు చేరి సరదాగా గడుపుతుంటారు. ఈ అలవాటును ఈసారి కొనసాగించారు. ఇప్పుడున్న ప్రత్యేక పరిస్థితుల్లో అలాంటి వాటికి చెక్ చెప్పాల్సి ఉంది. కానీ.. అందుకు భిన్నంగా పది రోజుల క్రితం నాలుగు కుటుంబాలకు చెందిన 28 మంది వేడుకలు జరుపుకున్నారు.

ఈ వేడుకకు సదరు మటన్ వ్యాపారి బంధువులే కాదు.. జియాగూడ.. గౌలిపురా.. బోరబండ ప్రాంతాలకు చెందిన తొమ్మిది మంది.. సంతోష్ నగర్ కు చెందిన ఐదుగురు హాజరయ్యారు. మొత్తంగా 42 మంది ఒకే చోటకు చేరి రెండు రోజుల పాటు పార్టీ చేసుకున్నారు.ఇది ఇక్కడితో ఆగకుండా ఈ పార్టీలో పాల్గొన్న వారిలో 18 మంది మహేశ్వరం మండలం హర్షగూడలో కిరాణా షాపు నడిపే బంధువు ఇంటికి వచ్చారు. ఆయన కుటుంబ సభ్యులు నలుగురితో కలిసి మరోసారి పార్టీ చేసుకున్నారు. ఇలా పార్టీల్లో పాల్గొన్న వారిలో బోరబండ.. సంతోష్ నగర్ నుంచి వచ్చిన వారిలో కొంతమందికి పాజిటివ్ గా తేలింది.

దీంతో.. పహాడిషరీప్ లో చేసుకున్న పార్టీ గురించి బయటకు వచ్చింది. దీంతో.. మటన్ వ్యాపారి ఇంట్లో జరిగిన పార్టీలో పాల్గొన్న వారికి పరీక్షలు జరపగా.. 13 మందికి పాజిటివ్ వచ్చింది. ఇదిలా ఉంటే.. మటన్ వ్యాపారికి పాజిటివ్ కావటంతో.. అతడి వద్ద మాంసాన్ని కొనుగోలు చేసిన వారు ఎంతమంది ఉంటారు? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఇప్పుడు ఈ మటన్ వ్యాపారి ఉదంతంపై ప్రభుత్వ యంత్రాంగం ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. అక్కడ జరిగిన పార్టీ కారణంగా రానున్న రోజుల్లో ఎన్ని పాజిటివ్ లు తెర మీదకు వస్తాయన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఈ ఉదంతం హైదరాబాదీయుల్లో కొత్త గుబులుకు కారణంగా మారనుంది.