తెలంగాణలో మటన్ ను అంతలా లాగిస్తున్నారట

Mon Sep 28 2020 12:30:26 GMT+0530 (IST)

Mutton Sales In Telangana

ఇటీవల కాలంలో నాన్ వెజ్ వినియోగం పెరుగుతోంది. కారణాలు ఏమైనా కానీ ముక్క లేనిదే ముద్ద దిగని పరిస్థితికి చాలా మంది వచ్చేశారు. నాన్ వెజ్ వినియోగంలో చికెన్ మొదటిస్థానంలో ఉంటే.. మటన్ రెండో స్థానంలో ఉంటుంది. దీనికి కారణం ధర ఎక్కువగా ఉండటమే కాదు. కరోనా నేపథ్యంలో చికెన్ వినియోగంపై అనుమానాలు ఉండటంతో.. ఖరీదైనప్పటికీ మటన్ లాగించే కార్యక్రమం ఎక్కువైనట్లుగా చెబుతున్నారు. తెలంగాణలో మటన్ వినియోగం భారీగా పెరిగినట్లుగా గణాంకాలు చెబుతున్నాయి.దీనికి తోడు మాంసం ఎంత ఎక్కువగా తింటే రోగ నిరోధక శక్తి అంతలా పెరుగుతుందన్న మాట వైద్యులు చెబుతున్న వేళ.. తెలంగాణలో మటన్ వినియోగం భారీగి పెరిగినట్లుగా చెబుతున్నారు. గత ఆర్థిక సంవత్సరం 2019 ఏప్రిల్ నుంచి 2020 మార్చి వరకు తెలంగాణ రాష్ట్రంలో 9.65 లక్షల మెట్రిక్ టన్నుల మేర మాంసం విక్రయాలు జరిగితే..గడిచిన ఆర్నెల్ల వ్యవధిలో (ఏప్రిల్ -సెప్టెంబరు) 6.14లక్షల మెట్రిక్ టన్నుల మాంసం వినియోగం జరిగినట్లుగా చెబుతుననారు.

లాక్ డౌన్ సందర్భంగా అన్ని వాణిజ్య సంస్థల్ని మూసేసినా.. మెడికల్.. కిరాణా.. కూరగాయలు.. పండ్ల దుకాణాలతో పాటుగా మాంసం విక్రయ దుకాణాల్ని తెరుచుకోవటానికి అనుమతి ఇచ్చింది. దీంతో.. మాంసం వినియోగం భారీగా పెరిగినట్లు చెబుతున్నారు. తెలంగాణలో తొలిసారి ఆర్నెల్ల వ్యవధిలో ఇంత భారీగా మాంసం వినియోగం పెరిగినట్లు చెబుతున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో రోజుకు 50వేల గొర్రెలు.. మేకల తలలు తెగితే.. తాజాగా 60వేల చొప్పున తెగుతున్నట్లుగా చెబుతున్నారు. ఈ మొత్తం వినియోగంలో ఒక్క హైదరాబాద్ మహా నగర వాటానే పాతిక శాతం పైనే ఉంటుందని చెబుతున్నారు.