మునుగోడు టికెట్ ఫైనల్ చేశాక.. కేసీఆర్ మాట కాదంటూ తీర్మానమా?

Sat Aug 13 2022 10:19:38 GMT+0530 (IST)

KCR Decided To Give Ticket To Kusukuntla Prabhakar Reddy

కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలోకి చేరే క్రమంలో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న మునుగోడు ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో ఆ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే. ఉప ఎన్నికలో ఎలా అయినా సరే గెలుపు ఖాయం చేసుకోవటం ద్వారా తమ సత్తా చాటాలని డిసైడ్ అయ్యారు టీఆర్ఎస్ అధినేత కమ్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.ఇందులో భాగంగా గతంలో టీఆర్ఎస్ అభ్యర్థిగా మునుగోడు అసెంబ్లీ బరిలో దిగి ఓడిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి టికెట్ ఇవ్వాలని గులాబీ పార్టీ బాస్ కేసీఆర్ ప్రాథమికంగా డిసైడ్ చేయటం తెలిసిందే. అధికారికంగా ఈ నిర్ణయాన్ని వెల్లడించనప్పటికీ.. కూసుకుంట్లకే టికెట్ ఫైనల్ అయిన వేళ.. ఆ పార్టీలో కూసుకుంట్ల వ్యవహారం ఇప్పుడు కొత్త రచ్చకు కారణమైంది.

ఫలానా అభ్యర్థిని బరిలోకి దించుతామని గులాబీ బాస్ కేసీఆర్ డిసైడ్ అయిన తర్వాత.. ఆయన నిర్ణయాన్ని వ్యతిరేకించిన సందర్బాలే చాలా తక్కువ. అంతేకాదు.. టికెట్  ఫలానా వారికి కేటాయించొద్దంటూ తీర్మానాలు చేయటం.. వ్యతిరేకత గళాలు వినిపించటం లాంటివి ఇప్పటివరకు జరిగింది లేదు. అలాంటిది మునుగోడులో మాత్రం అందుకు భిన్నంగా కేసీఆర్ నిర్ణయాన్ని తప్పు పట్టటమేకాదు.. ఆయన కూసుకుంట్లకు టికెట్ కేటాయించొద్దంటూ తీర్మానం చేసిన తీరు సంచలనంగా మారింది. దీనికి సంబంధించి తాజాగా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయగా.. దానికి టీఆర్ఎస్ కు చెందిన 300 మంది హాజరు కావటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ఈ రచ్చను సెట్ చేయటానికి మంత్రి జగదీశ్ రరెడ్డితో పాటు.. పార్టీకి చెందిన పలువురు నేతలతో ప్రగతిభవన్ లో చర్చ జరిగినప్పటికీ.. వారు ససేమిరా అనటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తాను అన్ని పేర్లతో సర్వేలు చేయించామని.. ప్రభాకర్ రెడ్డికే టికెట్ ఇవ్వాలని మెజార్టీ ప్రజలు చెప్పినట్లుగా కేసీఆర్ వ్యాఖ్యానించినట్లుగా చెబుతున్నారు. అంతేకాదు.. ఈ ఉప ఎన్నికకు అయ్యే ఖర్చు మొత్తం పార్టీనే చూసుకుంటుందని కేసీఆర్ స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది.

కూసుకుంట్ల అభ్యర్థిత్వాన్ని బలపర్చాలి.. అందరూ విభేదాల్ని పక్కనపెట్టి కలిసికట్టుగా పని చేసి పార్టీ గెలుపులో కీలకపాత్ర పోషించాలన్నారు. అంతేకాదు.. ఎన్నికల ఖర్చు కోసం ఎవరికి.. ఎక్కడా అడగాల్సిన అవసరం లేదని.. ఆ ఇబ్బంది పడొద్దని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించినట్లుగా చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. కేసీఆర్ నిర్ణయానికి భిన్నంగా.. కూసుకుంట్లకు టికెట్ వద్దంటూ చౌటుప్పల్ మండలంలోని గుడిమల్కాపూర్ వద్ద ఉన్న ఆందోళ్ మైసమ్మ టెంపుల్ సమీపంలోని ఫంక్షన్ హాల్ లో పలువురు సమావేశమయ్యారు. ఈ మీటింగ్ కు ఏకంగా 300 మంది హాజరు కావటం.. వారంతా కూసుకుంట్లకు టికెట్ ఇస్తే పార్టీకి పని చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది.

పార్టీ నేతల్ని ఆర్థికంగా.. రాజకీయంగా ఇబ్బందులు పెట్టి..శత్రువులకు సహకరించే కూసుకుంట్లకు టికెట్ ఇస్తే పార్టీకి నష్టం జరుగుతుందన్నది వారి వాదన. కేసీఆర్ స్వయంగా సమావేశమైన తర్వాత కూడా కూసుకుంట్లకు టికెట్ ఇచ్చే విషయంలో వ్యతిరేక గళాన్ని వినిపిస్తున్న వైనం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.మరి.. దీనికి కేసీఆర్ ఎలా రియాక్టు అవుతారు? ఆయన స్పందన ఏమిటి? అన్నది ప్రశ్నగా మారింది. మరి.. ఈ ఇష్యూను సీఎం కేసీఆర్ ఎలా డీల్ చేస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.