Begin typing your search above and press return to search.

మున్సిపల్ పోరు: 6 ఓట్లకు 78వేలు

By:  Tupaki Desk   |   21 Jan 2020 11:06 AM GMT
మున్సిపల్  పోరు: 6 ఓట్లకు 78వేలు
X
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో డబ్బు ఏరులై పారుతోంది. ఇప్పటికే డబ్బులు పంచుతున్న వీడియోలు వైరల్ అయ్యాయి. తెలంగాణ వ్యాప్తంగా కాస్తో కూస్తో డబ్బులు పంచుతున్నారు. అయితే హైదరాబాద్ శివారులో కోట్ల విలువైన భూములు గల మున్సిపాలిటీల్లో చైర్మన్ స్థానం దక్కించుకొని లాభం పొందేందుకు కోట్లు పంచేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.

తాజాగా రంగారెడ్డి జిల్లా తుర్కయాంజాల్ లోని ఒక కుటుంబానికి ఏకంగా రూ.78వేలను ఓ ప్రధాన పార్టీ అభ్యర్థులు పంచడం హాట్ టాపిక్ గా మారింది. ఆ కుటుంబంలోని 6 ఓట్ల కోసం మొదట వచ్చిన ప్రధాన పార్టీ అభ్యర్థి ఒక్కొక్కరికి రూ5వేల చొప్పున 30వేలు ఇచ్చి వెళ్లారు.

కాసేపటికే అక్కడికి వచ్చిన మరో ప్రధాన పార్టీ అభ్యర్థి తన ప్రత్యర్థులు ఎవరు ఎన్ని పైసలు ఇచ్చినా తీసుకోవాలని.. తనకే ఓటు వేయాలని ఈయన కూడా ఓటుకు 5వేల చొప్పున 30వేలు ఇచ్చి వెళ్లాడు.

ఇక రెండు ప్రధాన పార్టీలతో పోటీ పడలేని మరో అభ్యర్థి వాళ్లంత ఇచ్చుకోలేనంటూ ఓటుకు 3వేల చొప్పున పంచి తనను గెలిపించాలని ఆ కుటుంబాన్ని ప్రాథేయపడ్డాడట..

ఇలా ఒక్కరోజే ఆ కుటుంబానికి ఏకంగా రూ.78000 రావడం తో వారు అవాక్కయ్యారు. కేవలం ఒక్క కుటుంబానికే ఇంత మొత్తం అందిందంటే ఆ కౌన్సిలర్ స్థానంలో మున్సిపాలిటీలో ఎన్ని కోట్లు పంచి ఉంటారని అంతా ముక్కున వేలేసుకున్నారు. హైదరాబాద్ శివారు విలువైన భూములు, ఆస్తులు గల మున్సిపాలిటీల్లో ఇప్పుడు ఓటుకు డిమాండ్ ను బట్టి 5000-15000 వరకూ పంచుతున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.