Begin typing your search above and press return to search.

ఏపీలో ఎన్నికల వేడి రాజుకుంటోంది.?

By:  Tupaki Desk   |   15 Dec 2019 9:54 AM GMT
ఏపీలో ఎన్నికల వేడి రాజుకుంటోంది.?
X
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన జగన్ ఈ ఆరునెలల్లో తాను హామీనిచ్చిన నవరత్నాల నుంచి హామీ ఇవ్వని అద్భుత పథకాలను కూడా అమలు చేసి ప్రజలకు చేరువయ్యారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం, అమ్మఒడి ద్వారా ప్రజల మనసులను చూరగొన్నారు.

ఇదే ఊపులో స్థానిక సంస్థలను కూడా కొట్టేయాలని డిసైడ్ అయినట్లు తెలిసింది. 151 మంది ఎమ్మెల్యేల బలం ఉండడంతో క్షేత్రస్థాయిలో బలమైన టీడీపీని చావుదెబ్బ తీయడానికి రెడీ అయ్యాడట..

ఈ క్రమంలోనే ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలిసింది. మున్సిపల్ ఎన్నికలతోపాటు పంచాయతీ, జడ్పీ-ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించేందుకు రెడీ అవుతున్నట్టు తెలిసింది. ఏడాది కిందటే వీటి పదవీ కాలం ముగిసిపోయింది. అయితే ఈ స్థానిక ఎన్నికలపై కోర్టులో వాజ్యాలు దాఖలు కావడంతో జాప్యం జరిగింది. ఇప్పుడు అన్నీ తొలిగిపోయాయి.

అసెంబ్లీ ఎన్నికల టైంలో చంద్రబాబు స్థానిక సంస్థలను పట్టించుకోకపోవడంతో అధికారుల పాలనలో పల్లెలు, పట్టణాల్లో పాలన పడకేసింది. దీంతో ఏపీ సర్కారు స్థానిక ఎన్నికలకు సిద్ధమవుతున్నట్టు తెలిసింది. తాజాగా మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ త్వరలోనే మున్సిపల్ ఎన్నికలు నిర్వహించబోతున్నట్టు ప్రకటించారు. వచ్చే ఫిబ్రవరిలో జరిగే అవకాశం ఉందని తెలిపారు. వీటి తర్వాత పంచాయతీ, పరిషత్ ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయని సమాచారం. దీంతో ఈ జనవరి తర్వాత ఎండాకాలంలో ఏపీలో ఎన్నికల కోలాహలం మొదలుకాబోతోందన్నమాట..