కాపుల రిజర్వేషన్ల కోసం చాలా ఏళ్లుగా ఉద్యమం జరుపుతున్నారు కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం. కాపులకు రిజర్వేషన్లు ఇస్తానని 2014 ఎన్నికల సమయంలో మాజీ సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ...2019 ఎన్నికల వరకు నెరవేరలేదు. ఆ తర్వాత కాపులకు అండగా నిలుస్తానని బీసీలకు అన్యాయం జరగకుండా...కాపుల రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నానని నాటి ప్రతిపక్ష నేత నేటి సీఎం జగన్ 2019 ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. అయితే గత ప్రభుత్వంతో పోలిస్తే కాపు కమిషన్ పేరుతో జగన్ భారీ ప్యాకేజీ ప్రకటించారు. కానీ కాపుల రిజర్వేషన్ల అంశం పరిష్కారం కాలేదు. ఈ క్రమంలోనే జగన్ కు కాపు రిజర్వేషన్ల ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కొద్ది రోజుల క్రితం బహిరంగ లేఖ రాశారు. కేంద్రంతో కాపుల రిజర్వేషన్ల అంశం మాట్లాడాలని ప్రధాని మోడీతో చర్చించాలని జగన్ ను కోరారు. వైసీపీ ప్రభుత్వంపై ముద్రగడ మెతక వైఖరి అవలంబిస్తున్నారంటూ టీడీపీ నేతలు ఆరోపించారు. కాపులకు భారీ ప్యాకేజీ ఇచ్చిన జగన్ ను విమర్శించారంటూ వైసీపీ శ్రేణులు గుర్రుగా ఉన్నాయి. ఈ వ్యవహారం జరుగుతుండగానే ముద్రగడ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాపు ఉద్యమం నుంచి తప్పుకోబోతున్నానని ప్రకటించారు ముద్రగడ.
కాపు ఉద్యమ
నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారు!. కాపు
ఉద్యమం నుంచి తప్పుకోవాలని ముద్రగడ నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఓ బహిరంగ
ప్రకటనను ముద్రగడ విడుదల చేశారు. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో తనపై కొందరు
పెద్దలు దుష్ప్రచారం చేయిస్తున్నారని తనను కాపు ద్రోహిగా గజదొంగగా
చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని ముద్రగడ ఆవేదన వ్యక్తం చేశారు. తనపై
మీడియా సోషల్ మీడియాలో ఎందుకు మానసిక దాడులు చేస్తున్నారో అర్థం కావడం
లేదని వాపోయారు. ఉద్యమం చేసిన కాలంలో మానసికంగా శారీరకంగా రాజకీయంగా
ఆర్థికంగా ఎంతో నష్టపోయానని కానీ ఏనాడు చింతించలేదని అన్నారు. ఆ రోజు
ఉద్యమంలోకి రావడానికి చంద్రబాబుగారే ముఖ్య కారణమని కాపులకు బీసీ
రిజర్వేషన్ ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారని ముద్రగడ గుర్తు చేశారు. కాపు
ఉద్యమం ద్వారా డబ్బులు పదవులు పొందాలని ఏనాడూ అనుకోలేదని ఆవేదన వ్యక్తం
చేశారు.
తన ఉద్యమ ఫలితాన్ని క్రెడిట్ ను వేరొకరు కొట్టేశేలా
ఉన్నారంటూ మిత్రుడొకరు ఫోన్ చేశారని అయినా తాను ఇతరుల బాటలో నడవలసిన
అవసరం లేదని అన్నారు. ఎవరి ద్వారా రిజర్వేషన్ వచ్చినా నాకు అభ్యంతరం లేదని
పేరు ప్రఖ్యాతల కన్నా నా జాతికి రిజర్వేషన్లు దక్కడం నాకు ముఖ్యమని ఆనాడే
చెప్పానని అన్నారు. నాడు తుని సభకు వేలాది మంది రావడం ఎంతో
ఆనందాన్నిచ్చిందని జీవితంలో మరువలేని అనుభూతి అని ముద్రగడ చెప్పారు.
సందర్భాన్ని బట్టి ఉద్యమం రూపు మార్చుకుంటుందని నేను ఏది చేసినా...కాపు
జాతి ప్రయోజనాలకే పెద్దపీట వేశానని అన్నారు. అటువంటి తనపై దుష్ప్రచారం
చేస్తున్నారని బంతిని కేంద్రం కోర్టులో కి తెలివిగా నెట్టానని కామెంట్స్
చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏదో ఒక మార్గంలో రిజర్వేషన్లు
సాధించడమే తన లక్ష్యమని దానికి పెడర్థాలు తీసి తనపై టీవీల్లో చర్చలు జరిపి
తనను కాపు ద్రోహిగా చిత్రీకరించడం కలచివేసిందని అన్నారు. మరి ముద్రగడ
నిర్ణయంపై మిగతా కాపు నేతలు కాపు జేఏసీ ఏవిధంగా స్పందిస్తారన్నది
ఆసక్తికరంగా మారింది.