ఇక ముద్రగడ ... ?

Tue Jan 18 2022 05:00:01 GMT+0530 (IST)

Mudragada Padmanabham In AP Politics

ఏపీలో రాజకీయం భలే చిత్రంగా ఉంది. అన్ని పార్టీలూ కులాల చుట్టూ తిరుగుతున్నాయి. ఎన్నిక నుంచి ఎన్నిక. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మళ్లీ ఎన్నికల్లో ఎలా గెలవడం. అదే ధ్యాస. అదే ఊసు. ఆదే ఆశ. అదే శ్వాస. ఇలా ఏపీ రాజకీయం సాగుతోంది. ఇక ఏపీలో నాలుగు రాజ్య సభ సీట్లు త్వరలో  ఖాళీ అవుతున్నాయి. అందులో నుంచి ఎవరికి సీటు ఇస్తారు ఎవరి నోట్లో స్వీట్ పెడతారు అని వైసీపీ వర్గాలు ఆసక్తిగా చర్చించుకుంటున్నాయి.ఈ మధ్యనే రాజ్యసభ సీటు మీద అతి పెద్ద రగడ జరిగింది. మెగాస్టార్ చిరంజీవి జగన్ భేటీ అయితే చిరుకు బంపర్ ఆఫర్ జగన్ ఇచ్చారు. అందుకే ఆయన ఒంటరిగా  వచ్చి కలసి మరీ వెళ్ళారు అని కొన్ని  విపక్షాలు గట్టిగా సౌండ్ చేశాయి. అయితే దాన్ని మెగాస్టార్ అంతే స్ట్రాంగ్ గా ఖండించారు.

దాంతో అది పొలిటికల్  వెదర్ కొంత చల్లబడింది. ఇపుడు మరో కీలక నేత మీద అదే స్థాయిలో  ప్రచారం సాగుతోంది. ఆయన కూడా కాపు సామాజికవర్గానికి చెందిన వారే. ఒక విధంగా కాపులకు ఐకాన్ లాంటి వారు. ఆయనే గోదావరి జిల్లాలకు చెందిన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం. ఆయన మీద వైసీపీ గురి పెట్టింది అంటున్నారు.

ముద్రగడను ఎలాగైనా ఒప్పించి రాజ్యసభ సీటు ఇవ్వాలని ఆ పార్టీ పెద్దలు భావిస్తున్నారుట. గోదావరి జిల్లాలో ముద్రగడ ఇమేజ్ వేరుగా ఉంటుంది. ఆయన కాపులకు పెద్ద దిక్కులాటి వారు. వైసీపీ మీద కాపులు గుర్రుగా ఉన్నారు అన్న వార్తలు ఒక వైపు ప్రచారంలో ఉన్న టైమ్ లో ముద్రగడను తమ వైపునకు తిప్పుకోవడం ద్వారా  పెద్దల సభకు పంపాలని వైసీపీ చూస్తోంది అన్న టాక్ అయితే జోరుగా నడుస్తోంది.

ముద్రగడ దీనికి అంగీకరిస్తే వైసీపీ రొట్టె విరిగి నేతిలో పడినట్లే. అయితే ముద్రగడ ఇలాంటి పదవులకు దూరం అనే అంతా అంటున్నారు. ఆయన ఈ మధ్య రాసిన ఒక బహిరంగ లేఖలో కూడా ఎన్నాళ్ళూ తక్కువ జనాభాకు అందలాలు వారి పల్లకీ మనం ఎన్నాళ్ళు బోయీలుగా మోయాలీ అంటూ లాజిక్ పాయింట్ తీశారు. దాంతో ముద్రగడ ఇలాంటి ప్రతిపాదనను ఒప్పుకునే చాన్సే లేదు అంటున్నారు.

మొత్తానికి నర్సాపురం లో కాపులను ప్రసన్నం చేసుకోవడానికి వైసీపీ ఒక ఎంపీ సీటు కాపులకు ఇవ్వాలని చూస్తోంది. కాపు సామాజికవర్గానికి చెందిన ప్రముఖుడి మెడలో వరమాల వేయలనుకుంటోంది. అయితే వైసీపీ కోరుకున్న వారు ఎవరూ సీటు వద్దు అనే వారే ఉన్నారుట. మరి ఆ సామాజికవర్గంలో ఎవరో  ఒకరికి టికెట్ ఇచ్చినా అంత ఇంపాక్ట్ రాదని వైసీపీ భావిస్తోందిట. దాంతో ఇపుడు ముద్రగడ ఒప్పుకోకుంటే ఏం చేస్తుందో చూడాలి.