Begin typing your search above and press return to search.

'భ‌ర‌త్ అనే నేను' గుర్తుకు తెచ్చే బిల్లు

By:  Tupaki Desk   |   26 July 2018 8:18 AM GMT
భ‌ర‌త్ అనే నేను గుర్తుకు తెచ్చే బిల్లు
X
ఏ ముహుర్తంలో భ‌రత్ అనే నేను మూవీని స్టార్ట్ చేశారో కానీ.. ఆ సినిమా బంప‌ర్ విజ‌యాన్ని సాధించ‌ట‌మే కాదు.. ఎప్పుడూ లేనంత ఎక్కువ‌గా రాజ‌కీయ నేత‌ల నోళ్ల‌ల్లోనూ.. చ‌ట్ట‌స‌భ‌ల్లోనూ ఆ చిత్రం ప్ర‌స్తావ‌న రావ‌టం చూస్తున్న‌దే. చివ‌ర‌కు అవిశ్వాస తీర్మానం లాంటి సీరియ‌స్ వేళ‌లోనూ.. ఈ సినిమా ప్ర‌స్తావ‌న రావ‌టం అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. ఈ సినిమాలో ముఖ్య‌మంత్రి పాత్ర‌ను పోషించిన మ‌హేశ్ బాబు పాత్ర‌.. ట్రాఫిక్ రూల్స్ ను బ్రేక్ చేసే వారికి రూ.10వేలు.. పాతిక వేలు.. రూ.50వేలు చొప్పున ఫైన్ వేయ‌టం.. అదో పెను సంచ‌ల‌నంగా మారిన‌ట్లు సినిమాలో చూపిస్తారు.

దీనికి త‌గ్గ‌ట్లే తాజాగా.. లోక్ స‌భ‌లో పెడుతున్న బిల్లును చూస్తే.. భ‌ర‌త్ అనే నేను సినిమాను స్పూర్తిగా తీసుకున్నారా? అన్న సందేహం క‌ల‌గ‌క మాన‌దు. రోడ్డు ప్ర‌మాదాల నివార‌ణ‌కు కీల‌క‌మైన మోటారు వాహ‌నాల స‌వ‌ర‌ణ బిల్లు 2017 లోక్ స‌భ‌లో ఆమోదం పొందింది. కానీ.. రాజ్య‌స‌భ‌లో ప్ర‌తిప‌క్షాలు అడ్డుకుంటున్నాయి.

అంత‌కంత‌కూ పెరుగుతున్న రోడ్ల ప్ర‌మాదాల‌ను త‌గ్గించ‌ట‌మే ల‌క్ష్యంగా బిల్లును పెట్టారు. ప్ర‌తి ఏటా రోడ్డు ప్ర‌మాదాల కార‌ణంగా 1.46 ల‌క్ష‌ల మంది దేశ ప్ర‌జ‌లు మ‌ర‌ణిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో 2020 నాటికి రోడ్డు ప్ర‌మాదాల్ని భారీగా త‌గ్గించే దిశ‌గా ఈ బిల్లును రూపొందించారు. ఐక్య‌రాజ్య స‌మితి సూచ‌న ప్ర‌కారం మ‌రో రెండేళ్ల వ్య‌వ‌ధిలో ఇప్పుడున్న ప్ర‌మాదాల్ని 50 శాతం త‌గ్గించాల్సిందిగా కోరింది.

ఈ బిల్లు కానీ ఆమోదం పొందితే ఆ దిశ‌గా మార్పులు చోటు చేసుకునే వీలుంద‌ని భావిస్తున్నారు. ఎందుకంటే.. ఈ బిల్లు అంత క‌ఠినంగా ఉండ‌ట‌మే కార‌ణంగా చెబుతున్నారు. ట్రాఫిక్ రూల్స్ ను బ్రేక్ చేసే వారిపై భారీగా ఫైన్లు విధించేలా బిల్లును సిద్ధం చేశారు. ఇక‌.. ప్ర‌మాదాల‌కు కార‌ణ‌మైన మైన‌ర్ల విష‌యంలోనూ వాహ‌న య‌జ‌మానుల‌ను బాధ్యులు చేసేలా బిల్లులో వివిధ అంశాల్ని పొందుప‌ర్చారు.

ఇంత‌కీ ఈ బిల్లులో ఏముందంటే..!

1. వాహన రిజిస్ట్రేషన్‌ కీ - డ్రైవింగ్‌ లైసెన్స్‌ కీ ఆధార్‌ తప్పనిసరి.

2. వాహనాలు ఢీ కొట్టి పారిపోతే ప్రభుత్వమే బాధితులకు నష్టపరిహారం ఇస్తుంది. ప్రస్తుతం చెల్లిస్తోన్న రూ.25వేలకు బ‌దులుగా రూ.2ల‌క్ష‌ల‌కు ప‌రిహార మొత్తాన్ని పెంచారు.

3. ప్రమాదాలకు మైనర్లు కారణమైన సందర్భంలో వాహన యజమాని కానీ, సదరు మైనరు సంరక్షకులుగానీ బాధ్యత వహించాల్సి ఉంటుంది. ప్ర‌మాదం త‌మ ప్ర‌మేయం లేకుండా జ‌రిగిన‌ట్లు కానీ తాము నివారించే ప్ర‌య‌త్నం చేసినా జ‌రిగింద‌న్న‌ది నిరూపించుకుంటే వారిని శిక్ష‌కు ప‌రిహ‌రిస్తారు. ఒక‌వేళ పెద్ద‌ల‌కు తెలిసే ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లుగా తేలితే వెహికిల్ రిజిస్ట్రేష‌న్ ర‌ద్దు అవుతుంది. జువైనల్‌ చట్టం ప్రకారం నేరస్తులను విచారిస్తారు.

4. ప్రమాదంలో ఉన్న వారిని ఆదుకునే వారికి ఈ బిల్లు రక్షణ కల్పిస్తోంది. ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులకు తోడ్పడిన వారిని నేరంలో భాగం చేయకుండా ఇది నివారిస్తుంది. బాధితులను ఆసుపత్రిలో చేర్చినప్పుడు సైతం వారు కోరితే వారి వివరాలను పోలీసులు, ఆసుపత్రి వర్గాలు గోప్యంగా ఉంచాల్సి ఉంటుంది.

5. డ్రింక్ చేసి వాహనాలు నడిపిన వారికి ఇప్పుడు విధిస్తోన్న ఫైన్‌ ని రూ.2వేల నుంచి రూ.10 వేల‌కు పెంచారు.

6. ఇష్టమొచ్చినట్టు రాష్‌ గా వాహనాలు నడిపితే విధించే జరిమానాను రూ.వెయ్యి నుంచి రూ.5వేల‌కు పెంచారు.

7. లైసెన్స్‌ లేకుండా వాహనాలు నడిపే నేరానికి రూ.500 నుంచి రూ.5వేల‌కు పెంచారు.

8. అతివేగంగా వాహనాలు నడిపినందుకు ప్రస్తుతం ఉన్నరూ. 400 ఫైన్‌ని రూ.వెయ్యి..రూ.2వేల‌కు పెంచారు.

9. సీటు బెల్టు పెట్టుకోకుండా వాహనం నడిపితే ప్రస్తుతం రూ.100 ఫైన్‌. ఆ స్థానే రూ.వెయ్యికి పెంచారు.

10. ఫోన్‌ మాట్లాడుతూ వాహనాన్ని నడిపితే ప్రస్తుతం రూ.వెయ్యి ఫైన్‌. దాన్ని రూ. 5వేల‌కు పెంచారు
.
11. మోటారు వాహనాల యాక్సిడెంట్‌ ఫండ్‌ లో బీమాను చేర్చారు.

12. దివ్యాంగులకు అవసరమైన రీతిలో వాహనాల నిర్మాణాన్ని తప్పనిసరి చేశారు.

13. నాణ్యత లేని రోడ్లను వేసినందుకు కాంట్రాక్టర్లు సైతం ప్రమాదాలకు బాధ్యత వహించాల్సి ఉంటుంది.

14. రోడ్డు ప్రమాదాల్లో ఆర్నెల్ల లోపే బాధితులు నష్టపరిహారం కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

15. మరణాలకు థర్డ్‌ పార్టీ బీమా పరిమితిని రూ.10 లక్షలు - తీవ్రమైన గాయాలకు రూ.5 లక్షలకు పెంచారు

16. కాలం తీరిన డ్రైవింగ్‌ లైసెన్స్‌ ని తిరిగి నమోదు చేయించుకోవడానికి నెల గడువును ఏడాదికి పెంచారు.

17. ప‌రిమితుల‌కు త‌గ్గట్లు వాహనం నాణ్యత లేకుంటే ఆయా వాహనాలను ప్రభుత్వమే తిరిగి రప్పించుకోవచ్చు. తక్కువ నాణ్యత కలిగిన వాహనాలు తయారు చేసినందుకు రూ.500 కోట్ల వరకు జరిమానా విధించే వీలుంది.