Begin typing your search above and press return to search.

ఏపీకి యాభై సీట్లు : ఎవరికి ప్లస్.. ఎవరికి మైనస్...?

By:  Tupaki Desk   |   29 Jun 2022 5:30 PM GMT
ఏపీకి యాభై సీట్లు : ఎవరికి ప్లస్.. ఎవరికి మైనస్...?
X
ఇది సువిశాల దేశం. లక్షల మందికి ఒక్కరే ప్రజా ప్రతినిధి ఉంటున్నారు. అదే పాతిక కోట్లు ఉన్న అమెరికాలో వందల్లో చట్ట సభలకు వస్తున్నారు. అయితే ఇపుడు ఆ లోటుని మన దేశంలోనూ తీర్చే పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా ఉమ్మడి ఏపీకి సంబంధించి విభజన హామీలలో ఒక విషయాన్ని పైసా ఖర్చు లేకుండా తీర్చేందుకు కేంద్రం సిద్ధపడుతోంది అంటున్నారు. ఏపీలో 175 అసెంబ్లీ సీట్ల నుంచి 225 కి, తెలంగాణాలో 119 నుంచి 153 దాకా సీట్లు పెరుగుతాయి.

ఈ విషయంలో బీజేపీ ఇపుడు అతి ఉత్సాహాన్ని చూపిస్తోంది. ఎందుకంటే తెలంగాణాలో అర్జంటుగా అధికారంలోకి రావాలని ఆ పార్టీ ఆలోచన చేస్తోంది. దాని కోసం సీట్లు భారీగా పెంచితే చిన్న నియోజకవర్గాలతో గెలుపు ఆశలు ఉంటాయని నమ్ముతోంది. ఇక ఏపీకి వస్తే కొత్తగా యాభై సీట్లు వస్తాయి. అధికార వైసీపీకి ఇది ఒక విధంగా మంచి వార్తే. కానీ ఆ పార్టీ ఉన్న వారి నుంచే యాభై మంది దాకా తొలగించి కొత్త వారికి ఇవ్వాలనుకుంటోంది.

మరి వైసీపీ ఎమ్మెల్యేల మీద తీవ్ర వ్యతిరేకత ఉందని తేలుతున్న దశలో ఇప్పటికే ఉన్న సీట్లలో గెలుపు కోసం కసరత్తు చేస్తున్న వైసీపీకి కొత్తగా యాభై అంటే మాత్రం కాస్తా కష్టమే అనుకోవాలి. ఇంకో వైపు చూస్తే ఈసారి జోష్ అంతా విపక్షంలోనే కనిపిస్తోంది. ప్రత్యేకించి తెలుగుదేశం ఇపుడు మంచి ఊపులో ఉంది. మహానాడు తరువాత ఇక గెలిచేశామని ఆ పార్టీ నేతలు అంటున్నారు.

దాంతోనే పొత్తులు వద్దు మరే ఎత్తులూ వద్దు మొత్తానికి మొత్తం 175 సీట్లు మాకే వదిలేయండి అని తమ్ముళ్ళు అధినాయకత్వాన్ని గట్టిగా కోరుతున్నారు. ఇక పోటీ చూస్తే ఒక్కో నియోజకవర్గంలో నలుగురైదుగురు ఉన్నారు. దాంతో ఈ హెవీ కాంపిటేషన్ ని తట్టుకుని పొత్తులతో ఎలా ముందుకు సాగాలా అన్నది అధినాయకత్వానికి అగ్ని పరీక్షగా మారింది. అయితే కొత్తగా యాభై సీట్లు వస్తే కనుక కచ్చితంగా టీడీపీ నెత్తిన పాలు పోసినట్లే అంటున్నారు.

ఆ యాభై సీట్లను కూడా పొత్తుల పేరిట వదిలేసినా 175 సీట్లలో పోటీ చేయవచ్చు. ఒక విధంగా సీట్ల పెరుగుదల అన్నది టీడీపీకి బాగా ఉపయోగపడుతుంది అని అంటున్నారు. అదే విధంగా జనసేన విషయానికి వస్తే మొత్తం 225 సీట్లలో పోటీ పెట్టడం అంటే ఇపుడు ఒకింత కష్టం అయినా బస్సు యాత్ర తరువాత బలం పెరిగితే బాగా క్లారిటీ వస్తుంది. అయినా పొత్తుల వైపే జనసేన ఎక్కువగా దృష్టి పెడుతుంది అని అంటున్నారు. దాంతో యాభై నుంచి డెబ్బై సీట్లను సులువుగా టీడీపీ నుంచి తీసుకునేందుకు ఈ పెరుగుదల ఉపయోగపడుతుంది.

అలాగే తెలంగాణాలో బీజేపీకి చిన్న నియోజకవర్గాలు ఉపయోగపడినట్లుగా ఏపీలో జనసేనకు కూడా కలసివచ్చే అవకాశం ఉంది అంటున్నారు. ఇక బీజేపీ పొత్తులతో వెళ్తే ఈ పెరుగుదల నుంచి బాగా అడ్వాంటేజ్ పొందగలదు అన్న మాట వినిపిస్తోంది. వామపక్షాలు కూడా ఈసారి అసెంబ్లీలో కాలు పెట్టడానికి ఈ సీట్ల పెరుగుదల కచ్చితంగా ఉపయోగపడుతుంది అంటున్నారు. వారు కూడా పొత్తుల కోసం చూస్తున్నారు. అలాగే కాంగ్రెస్ తన రాజకీయ జాతకాన్ని పరీక్షించుకునేందుకు చిన్న నియోజకవర్గాలు ఏమైనా చాన్స్ ఇస్తాయేమో చూడాలి.