అలాంటి జాబ్ కోసమే సెర్చ్ చేసే వారు పెరిగారట!

Mon Aug 10 2020 05:00:01 GMT+0530 (IST)

More Demand for Work From home Jobs

లాక్ డౌన్ నేపథ్యంలో సమీకరణాలన్ని మారిపోవటం తెలిసిందే. మొన్నటివరకు ఉద్యోగం చేస్తున్నామంటే.. పొద్దుపొద్దునే లేవటం.. నీట్ గా రెఢీ కావటం.. బాక్సు సిద్ధం చేసుకోవటం.. ఉరుకులు పరుగులు తీస్తూ.. బైకో.. కారో.. ఎవరికి అనువుగా వారు బయలుదేరి ఆఫీసులకు చేరుకునే వారు. నిద్ర లేచింది మొదలు పడుకునే వరకు ఉరుకులు పరుగులుతో జీవితం మహా వేగంగా గడిచిపోయేది. కరోనా పుణ్యమా అని సీన్ మొత్తం మారిపోయింది. నిద్ర లేచింది మొదలు పడుకునే వరకు అదే ఇంట్లో.. అదే మనుషుల మధ్య.. పని చేసే పరిస్థితి. ఇలాంటివి బోరింగ్ గా ఉండవా? అంటే.. ఉంటాయి కానీ.. కరోనాను కొని తెచ్చుకునే దానితో పోలిస్తే.. నచ్చినా.. నచ్చకున్నా ఇంట్లోనే ఉండి పని చేయటం అలవాటుగా మారింది.గతంలో మాదిరి ఉరుకులు పరుగులు లేకపోవటం..రోజులో తక్కువలో తక్కువ నాలుగైదు గంటలు ట్రాఫిక్.. పొల్యుషన్ మధ్య ప్రయాణాలు చేసే కన్నా.. కంఫర్ట్ గా ఉండే టీషర్టు.. నైట్ ఫ్యాంట్లతో పని కానిచ్చేయటం.. ఒకందుకు సదుపాయంగానే ఉన్న పరిస్థితి. దీనికి తోడు.. కోవిడ్ మహమ్మారి నుంచి వచ్చే ఏడాది సెప్టెంబరు.. అక్టోబరు వరకు సహజీవనం చేయాల్సి ఉన్నందున.. ఇంటి నుంచి పని చేసే ఉద్యోగాలకే ప్రాధాన్యత ఇవ్వటం పెరిగిందట.

లాక్ డౌన్ వేళలో.. చేస్తున్న ఉద్యోగం ఊడిపోకపోతే చాలురా భగవంతుడా అనుకునే స్థాయి నుంచి.. కొత్త అవకాశాల కోసం తపిస్తున్న వారి సంఖ్య నెమ్మదిగా పెరుగుతోందట. తమకు సరిపోయే ఉద్యోగాల కోసం వెతుకుతున్న వారి సంఖ్య ఈ మధ్య ఎక్కువైనట్లుగా చెబుతున్నారు. అయితే.. ఇలా సెర్చ్ చేసేవారంతా వర్క్ ఫ్రం హోంకే అత్యధిక ప్రాధాన్యత ఇవ్వటం గమనరా్హం.

రిమోట్ లో ఉండి పని చేయటం.. ఇంటి నుంచి పని చేసే ఆప్షన్ పక్కాగా ఉండాల్సిందేనని తేల్చి చెబుతున్న వారంతా భారీగా పెరిగారని చెబుతున్నారు. గతంలో పోలిస్తే ఇది 442 శాతం అధికమని చెబుతున్నారు. కరోనాఎంతకాలం ఉంటుందో తేలని నేపథ్యంలో మరికొన్నినెలల పాటు ఇంటి నుంచి పని చేయటమే మంచిదన్న ఆలోచనకు వచ్చేసినట్లు చెబుతున్నారు. దీంతో.. ఉద్యోగాల్నిమానాలనుకునే వారు తప్పనిసరిగా ఇంటి నుంచి పని చేసే ఆప్షన్ కే ప్రయారిటీ ఇస్తున్నట్లుగా తాజా గా చేసిన అధ్యయనం ఒకటి వెల్లడించింది.

ఇది మన దగ్గరే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు ఇలాంటి  ట్రెండే ఇప్పుడు నడుస్తోందని చెబుతున్నారు. ఇంటి నుంచి పని చేసే తీరులో ఉద్యోగుల పని తీరుపై ఉన్న సందేహాలు లాక్ డౌన్ లోనే తీరిపోయినట్లుగా చెబుతున్నారు. దీంతో.. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా కొత్త రంగాల్లో ఉద్యోగ అవకాశాలు మరింత పెరిగినట్లు చెబుతున్నారు. ప్రతి సంక్షోభానికి ప్రజల్ని కష్టపెట్టే గుణం ఉన్నట్లే.. తనను తాను మార్చుకోవటానికి మనిషికి అవకాశం ఇచ్చే మరో కోణం కూడా ఉంటుందని చెప్పక తప్పదు.