మోడీషాలు గెలిచారా? ఓడారా? మూల్యం మాత్రం దేశం చెల్లించుకోవటమా?

Mon May 03 2021 10:01:27 GMT+0530 (IST)

Modi's election disturbance .. has become fatal to the people of the country!

విజయం ఇచ్చే ఉత్సాహం వేరుగా ఉంటుంది. చేతికి అధికారం వస్తే ఆ కథే వేరు. అయితే.. అధికారం అన్నది అలవాటుగా మారి.. తర్వాతి రోజుల్లో అదో వ్యామోహంగా మారితే తిప్పలు తప్పవు. ఇప్పుడు అలాంటి పరిస్థితినే దేశ ప్రజలు ఎదుర్కొంటున్నారు. దేశంలోని అత్యధిక రాష్ట్రాల్లో కాషాయ జెండా రెపరెపలాడాలన్న తలంపు మంచిదే. అందుకు దేశ హితాన్ని పణంగా పెట్టాల్సిన అవసరం ఉందంటారా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. మోడీషాలను విమర్శించటం.. సదరు వ్యక్తి దేశభక్తిని శంకించే కొత్త తరహా సంప్రదాయాన్ని నమో అభిమానులు విజయవంతంగా అమలు చేస్తున్నారు.ప్రజాస్వామ్య వ్యవస్థలో తప్పులు జరిగితే.. ప్రశ్నించటం సగటు జీవికి ఉండే ప్రాథమిక హక్కు. ప్రజలు ఎన్నకున్న ప్రభుత్వాన్ని.. అదే ప్రజలు తప్పు పడితే ఎందుకు ఫీల్ కావాలి? విమర్శల్ని ఆహ్వానించటం ద్వారా తనను తాను మార్చుకునే అవకాశం ఉంటుందని.. అందుకే విమర్శల్ని తరచూ ఆహ్వానిస్తుంటారు కార్పొరేట్ ప్రపంచంలోని లీడర్లు. మరి.. రాజకీయాలు ఇందుకు భిన్నంగా ఎందుకు ఉండాలి?

మోడీషా జమానాకు ముందు వరకు అధికారపక్షాన్ని విమర్శించటం తప్పుగా ఉండేది కాదు. నిజానికి అదే చాలా అవసరమన్నట్లుగా ఉండేది. ఎప్పుడైతే మోడీ చేతికి అధికారం వెళ్లిందో అప్పటి నుంచి కనిపించని పరిమితులు ఎక్కువై.. ఇప్పుడు తనను విమర్శించే వారి సోషల్ మీడియా ఖాతాల్ని ఆపించే వరకు వెళుతోంది. ఇదేమాత్రం సరైన సంప్రదాయం కాదన్న మాట పలువురి నోటి నుంచి వినిపిస్తోంది.

సుదీర్ఘంగా సాగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు తగ్గట్లే ఫలితాలు వచ్చాయని చెప్పలేం కానీ.. రేఖా మాత్రంగా ఊహించారని చెప్పాలి. పశ్చిమబెంగాల్ లో బొటాబొటి మార్కులతో మమత పాస్ అవుతారనుకుంటే.. డబుల్ సెంచురీ సాధించారు. కాకుంటే.. నందిగ్రామ్ లో ఆమె ఓటమిపాలయ్యారు. ఇంత భారీగా సీట్లను సొంతం చేసుకుంటారని ఎవరూ అంచనా కట్టలేదు.

తమిళనాడులో డీఎంకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని అందరూ చెప్పారు కానీ.. వారు అంచనా వేసినంత భారీ విజయాన్ని స్టాలిన్ సొంతం చేసుకోలేదని చెప్పాలి. అందరూ అంచనా వేసినట్లే పుదుచ్చేరిలో బీజేపీ గెలవగా.. కేరళలో కమ్యునిస్టులు గెలిచారు. అసోంలో బీజేపీ తన పట్టును నిలుపుకుంటుందన్న అంచనాకు తగ్గట్లే ఫలితాలు వచ్చాయి. నిజానికి మోడీషాల గురి మొత్తం పశ్చిమబెంగాల్ మీదే ఉంది. అంతో ఇంతో కేరళలోనూ తమ బలాన్ని పెంచుకోవాలని తపించారు. ఈ రెండుచోట్ల మోడీషాలకు దారుణమైన పరాభవం ఎదురైందని చెప్పాలి.

దారుణ పరాభవం అన్న మాట ఎందుకంటే.. బెంగాల్  ఎన్నికల్లో బీజేపీ తన సత్తా చాటేందుకు చేసిన ప్రయత్నాలు దేశ ప్రజలకు తెలియంది కాదు. ఏకంగా ఎనిమిది దశల్లో పోలింగ్ నిర్వహించటం మొదలు.. బెంగాల్ లో చేపట్టిన భారీ బహిరంగ సభలు.. ర్యాలీలపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఎంత అధికారాన్ని సొంతం చేసుకోవాలనుకుంటే మాత్రం.. కోవిడ్ వేళ మోడీషాలు ఇంతలా ఎన్నికల ప్రచారానికి ప్రాధాన్యత ఇవ్వాలన్న ప్రశ్నలు వెల్లువెత్తాయి.

గెలుపు ఒక ఆరాటంగా మారిన మోడీషాలు.. తాజాగా జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల కోసం తమకున్న శక్తిసామర్థ్యాల్ని ఎంతలా వినియోగించారో అందరికి తెలిసిందే. కోవిడ్ కేసులు భారీగా పెరిగిపోతున్నప్పటికి ఆ విషయాల్ని పట్టించుకోకుండా.. ఏం జరిగినా ఫర్లేదు.. ఎన్నికలయ్యాకే అంతా అన్నట్లుగా వ్యవహరించారన్న ఆరోపణ ఉంది. పిల్లికి చెలగాటం.. ఎలుకకు ప్రాణ సంకటం అన్నట్లుగా.. అధికారం మీద మోడీషాలకున్న అనురక్తి.. దేశ ప్రజలకు సంకట స్థితిని తీసుకొచ్చిందన్న విమర్శ వినిపిస్తోంది. అధికారం కోసం మోడీషాలకు అంత ఆరాటం ఎందుకు? అన్న ప్రశ్నకు ఎంత వెతికినా సమాధానం లభించటం లేదనే చెప్పాలి.