Begin typing your search above and press return to search.

మోడీ విత్ జగన్ : లేటెస్ట్ ఎగ్జాంపుల్ ఇదే...?

By:  Tupaki Desk   |   14 May 2022 6:18 AM GMT
మోడీ విత్ జగన్ : లేటెస్ట్ ఎగ్జాంపుల్ ఇదే...?
X
ప్రధాని మోడీ కరడు కట్టిన ఆరెస్సెస్ విశ్వాసి. ఇక ఆయన బీజేపీ గెలుపు కోసం ఏమైనా చేయాలనుకుంటారు. దాని కంటే ముందు ఆయన తన మిత్రులను కూడా జాగ్రత్తగా ఎంపిక చేసుకుంటారు అని అంటారు. ఇక ఏపీ విషయానికి వస్తే ఒక ఆసక్తికరమైన వార్త ఎపుడూ ప్రచారంలో ఉంటుంది. ప్రధాని మోడీ జగన్ అంటే పుత్ర వాత్సల్యం చూపిసారు అని. ఈ ఇద్దరు మధ్యన ఒక సీఎం ఒక పీఎం రిలేషన్ కంటే కూడా ఇదే ఎక్కువ అంటారు.

ఆ విషయాన్ని కూడా ఆ మధ్య అనంతపురం టూర్ లో కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఓపెన్ గానే చెప్పారు. జగన్ అంటే మోడీకి ఎంతో అభిమానం. ఒక తండ్రిలా ఆయన్ని ఆదరిస్తారు అని నిర్మలమ్మ చెప్పుకొచ్చారు. దానికి అనేక రుజువులూ సాక్ష్యాలు కూడా ఉన్నాయి. ప్రధాని మోడీ జగన్ మాట ఎపుడూ కాద‌నలేదు. అందుకే ఏపీకి ఇబ్బడి ముబ్బడిగా అప్పులు కూడా లభించాయి.

నిజానికి చంద్రబాబు సర్కార్ దిగిపోయిన తరువాత ఏపీ ఖజానా కేవలం 100 కోట్లతో మాత్రమే ఉంది. నాటి ఆర్ధిక మంత్రి యనమల రామక్రిష్ణుడు కూడా కొత్త ప్రభుత్వానికి పైసా కూడా అప్పు పుట్టదు అనేశారు. కానీ దానికి భిన్నంగా మూడేళ్ల పాటు సర్కార్ ని లాక్కువచ్చిన ఘనత జగన్ ది. ఆయనకు అండగా ఉన్న మోడీది కూడా. అందుకే ఎవరెంత తన మీద విమర్శలు చేసినా జగన్ ధీమాగా ఉంటారు. కేంద్రంలో మోడీతో ఆయనకు ఉన్న సత్సంబంధాలు అలాంటివి అంటారు.

దీనికి లేటెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి బయటపడింది. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ పదవీ కాలాన్ని మరో ఆరు నెలల పాటు అంటే ఈ ఏడాది నవంబర్ నెలాఖరు నాటి దాకా కంటిన్యూ చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. నిజానికి ఇది అసాధారణమైన నిర్ణయం అని అంటున్నారు. ఎందుకంటే ఎవరికైనా పదవీ కాలం పొడిగింపు అంటే మూడు నెలలు మాత్రమే పొడిగిస్తారు. అలా రెందు విడతలుగా పొడిగించాక ఇక సరి అనే చెప్పాలి.

కానీ ఏపీలో సమీర్ శర్మ విషయంలో జగన్ పట్టుదలగా మరో ఆరు నెలలు ఆయనే సీఎస్ గా ఉండాలని కోరుకున్నారు. దానికి మాత్రం ప్రధాని ప్రత్యేక అధికారాలతో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో జగన్ నేరుగా ప్రధానికి లేఖ రాశారు. అది గత నెల 12న రాస్తే ప్రధాని దాని మీద అసాధారణమైన నిర్ణయం తీసుకుని సమీర్ శర్మకు మరో ఆరు నెలలు పదవి పొడిగించారు. సాధారణంగా ఇలాంటి అసాధరణమైన నిర్ణయాలు ప్రధాని స్థాయిలో తీసుకోవాలీ అంటే వారి సొంత పార్టీ అధికారంలో ఉన్న చోటనే సాధ్యపడుతుంది.

మరి జగన్ వైసీపీ అధినేత. అయినా ప్రధాని స్పెషల్ గా ట్రీట్ చేశారు అంటే ఈ బంధం గ్రేట్ గురూ అనకుండా ఉండలేరు కదా. సో మోడీ విత్ జగన్ అన్నది ఇపుడు హాట్ టాపిక్ గా ఉంది. ఎవరేమనుకున్నా ఈ బంధం 2024 వరకూ ఆ మీదట కూడా కంటిన్యూ కాబోతోందిట. ఇదే నిజం అని ఢిల్లీ వర్గాలు అంటున్నాయి.