Begin typing your search above and press return to search.

మోడీ ‘భాష’.. బ్రిటన్ కు అర్థమైంది

By:  Tupaki Desk   |   14 Oct 2021 9:08 AM GMT
మోడీ ‘భాష’.. బ్రిటన్ కు అర్థమైంది
X
అవతలోడు కాల్చి వాతలు పెడుతున్నా.. మౌనంగా భరించటం.. శాంతి వచనాల్ని వల్లించటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఈ విషయాన్ని కొందరు ఎంతలా చెప్పినా మన పాలకులు పెద్దగా పట్టించుకున్నది లేదు. భారత్ సహనాన్ని చేతకానితనంగా అర్థం చేసుకున్న దేశాలకు కొదవ లేదు. ఎక్కడదాకానో ఎందుకు.. మన దాయాదే మనకో పెద్ద ఉదాహరణ. గిల్లి.. గిచ్చినా సరే.. ఏవేవో పెద్దరికపు లెక్కలు వేసుకొని.. ప్రపంచ దేశాల ముందు పెద్ద మనిషి ఇమేజ్ ఉండాలంటే.. ఆ మాత్రం సంయమనం అవసరమన్నట్లు చెప్పే మాటలకు కొదవ లేదు.

ఇలాంటి ధోరణి మోడీ దేశ ప్రధాని అయ్యాక కాస్త మారింది. అన్ని విషయాల్లో కాకున్నా కొన్ని విషయాల్లో లాగి పెట్టి కొట్టినట్లుగా.. టిట్ ఫర్ టాట్ అన్నట్లుగా వ్యవహరించటం ఎక్కువైంది. అదేం సిత్రమో కానీ.. గతంలో రాయబారాలతో కానీ పని.. ఇలాంటి చర్యలతో సదరు దేశాలు విషయాన్ని వెంటనే అర్థం చేసుకుంటున్నాయి. తాజాగా ఆ జాబితాలో చేరింది బ్రిటన్.

మన దేశాన్ని నాలుగు వందల ఏళ్లు పాలించిన తెల్ల దొరలు.. పోయేటప్పుడు దేశాన్ని రెండు ముక్కలు చేసి.. రావణకాష్టం ఎప్పటికి కాలేలా విషయాన్ని సెట్ చేసి పోయారు. ఆ విషయాన్ని పక్కన పెడితే.. కొవిడ్ వేళ.. తమ దేశానికి వచ్చే భారతీయులు తాము చెప్పిన వ్యాక్సిన్ వేసుకొని రాకుంటే.. తమ దేశంలోకి వచ్చిన తర్వాత క్వారంటైన్ పేరుతో కఠిన నిబంధనల్ని విధిస్తూ నిర్ణయం తీసుకుంది.

మన దేశంలో సాగుతున్న వ్యాక్సినేషన్ లో కోవాగ్జిన్.. కొవిషీల్డ్.. స్పుత్నిక్ మూడింటిలో దేన్నీ తాము గుర్తించలేదని పేర్కొంది. మిగిలిన రెండింటిని బ్రిటన్ అభ్యంతరం పెట్టటాన్ని అర్థం చేసుకోవచ్చు.. కొవిషీల్డ్ విషయంలోనూ ఆ దేశం మొండిగా వ్యవహరించిన తీరుకు.. మోడీ మాష్టారు సైతం స్పందించి టిట్ ఫర్ టాట్ అన్న రీతిలో అధికారిక నిర్ణయాన్ని తీసుకున్నారు. బ్రిటన్ నుంచి వచ్చే ఆ దేశ పౌరులు భారత్ కు చేరుకున్న తర్వాత పది రోజుల పాటు క్వారంటైన్ లో గడపాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ నిర్ణయం బ్రిటన్ కు ఎక్కడ తగలాలో అక్కడ తగిలింది.

ఆ దేశానికి చెందిన పలువురు పారిశ్రామికవేత్తలు. ఇతరత్రా అవసరాల కోసం భారత్ కు తరచూ వచ్చి పోయే వారంతా బ్రిటన్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావటం.. భారత్ విషయంలో తాము అనుసరించిన దానికి ప్రతిఫలంగా తమకు ఎదురైన ఇబ్బందిని గుర్తించింది. ఆ వెంటనే.. గతంలో తాము జారీ చేసిన ఆంక్షల్ని సడలించి..వ్యాక్సిన్ జాబితాలో కోవిషీల్డ్ ను గుర్తిస్తున్నట్లు పేర్కొంది. కోవిషీల్డ్ వేసుకున్న భారతీయులు బ్రిటన్ లో అడుగు పెడితే ఎలాంటి క్వారంటైన్ అవసరం లేదని పేర్కొంది. బ్రిటన్ నిర్ణయం మారిన వేళ.. భారత్ సైతం బ్రిటన్ విషయంలో తన క్వారంటైన్ నిబంధనను సడలిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తానికి దేశీయంగానే కాదు.. అంతర్జాతీయంగా కూడా తన ‘భాష’ను అర్థమయ్యేలా మోడీ మాస్టారు సక్సెస్ అయినట్లేనని చెప్పక తప్పదు.