మోడీ వరల్డ్ లీడర్.. ఇదిగో ఫ్రూఫ్

Wed Sep 28 2022 07:00:01 GMT+0530 (India Standard Time)

Modi is a world leader Here is the proof

ప్రధానిగా నరేంద్రమోడీ అయ్యాక భారతదేశానికి ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు దక్కింది. మోడీ వరల్డ్ లీడర్ గా ఎదిగాడు. ఆయన ఎదగడమే కాదు.. భారత్ ను ప్రపంచపటంలో నిలిపారు. ఇప్పుడు ఏ దేశమేగినా.. ఎందుకాలిడినా మన భారతీయత గురించి గొప్పగా చెబుతున్నారంటే అదంతా మోడీ అవలంభించిన విధానాలే అనడంలో ఎలాంటి సందేహం లేదు.ఈ ఏడాది జూన్ లో జర్మనీలో జరిగిన జీ7 సదస్సుకు అతిథిగా భారత ప్రధాని నరేంద్రమోడీని ఆహ్వానించారు. ప్రపంచంలో పారిశ్రామికంగా శక్తివంతమైన అమెరికా కెనడా జర్మనీ ఫ్రాన్స్ బ్రిటన్ జపాన్ ఇటలీ దేశాల కూటమియే జీ7. నాడు ఆ సదస్సుకు వెళ్లినప్పుడు ఒక సందర్భంలో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోతో నరేంద్రమోడీ మాట్లాడుతుండగా.. వెనుక నుంచి నడుచుకుంటూ వచ్చిన అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ సడెన్ గా మోడీ మీద చేయి వేశారు. మోడీ వెనక్కి తిరిగి చూడగా జోబైడెన్ కనిపించారు. అప్పుడు ఇద్దరి మధ్య షేక్ హ్యాండ్ ఇచ్చుకొని నవ్వులు విరబూసాయి.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. భారత ప్రధాని నరేంద్రమోడీని తానే స్వయంగా అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ కలిసేందుకు వచ్చారంటూ.. ఇది భారత్ మోడీ ఘనత అని అందరూ కొనియాడారు.

ఒకప్పుడు జీ7 కూటమి జీ8గా ఉండేది. కానీ 2014లో క్రైమియాను రష్యా ఆక్రమించడంతో ఆ దేశాన్ని జీ8 నుంచి తొలగించారు. ఇప్పుడా కూటమి జీ7గా మారింది. రష్యా స్థానాన్ని భారత్ ఆక్రమిస్తుందని అంటున్నారు.

జర్మనీలో జీ7 సదస్సు జరిగిన మూడు నెలలకు ఉజ్బెకిస్తాన్ లో షాంఘై సహకార సదస్సు జరిగింది. చైనా నేతృత్వంలోని ఎస్.సీఓలో భారత్ రష్యా పాకిస్తాన్ సభ్యదేశాలు. సదస్సులో భారత ప్రధాని మోడీ రష్యా అధ్యక్షుడు పుతిన్ భేటి అయ్యారు. ఉక్రెయిన్ పై యుద్ధం సరికాదని.. ఇది ప్రజాస్వామ్యానికి దౌత్యానికి చర్చలకు సమయం అని పుతిన్ కు మీడియా ముందే మోడీ హితవు పలికారు. మోడీ చేసిన ఈ వ్యాఖ్యలకు పశ్చిమ దేశాల నుంచి ప్రశంసలు లభించాయి.

ఐక్యరాజ్యసమితి 77వ జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో భారత ప్రధాని నరేంద్రమోడీని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యూయేల్ మేక్రాన్ అభినందించారు. రష్యా అధ్యక్షుడికి సూటిగా చెప్పిన మోడీ మంచిపని చేశారని ప్రశంసించారు.

ఐరాసలోని భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం ఉన్న దేశాల్లో ఫ్రాన్స్ ఒకటి. కాబట్టి ఆ దేశ అధ్యక్షుడు ఐరాసాలో మోడీని అభినందించడాన్ని ముఖ్యమైన పరిణామంగా చెప్పొచ్చు. భారత్ కు అంతర్జాతీయంగా గుర్తింపు దక్కుతుందనడానికి ఇదొక ఉదాహరణగా చెప్పొచ్చు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.